Stock Market Crash: స్టాక్ మార్కెట్లలో HMPV కేస్ భయం - సెన్సెక్స్ 1200, నిఫ్టీ 400 పాయింట్లు క్రాష్
First HMPV Case In India: దేశంలో తొలి HMPV కేసు వెలుగులోకి రావడంతో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు ఒక్క పూటలోనే 9 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశారు.
Stock Market Crash On HMPV Fear: భారతదేశంలో మొదటి HMPV కేసును గుర్తించడంతో భారతీయ స్టాక్ మార్కెట్లలో భయం ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి... బాంబే స్టాక్ ఎక్సేంజ్ (BSE) సెన్సెక్స్ 1,263 పాయింట్లు పతనమై 77,959.95 స్థాయికి పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ కూడా 402 పాయింట్లు క్షీణించి 24000 దిగువనకు జారిపోయింది, 23,601.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని చూసింది. బ్యాంకింగ్, ఇంధన రంగ షేర్లలో భారీ క్షీణత కనిపిస్తోంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో కూడా భారీ క్షీణత కనిపిస్తోంది. మార్కెట్ అస్థిరతను కొలిచే ఇండెక్స్ ఇండియా విక్స్ (INDIA VIX) 13.37 శాతం క్షీణతతో ట్రేడవుతోంది.
ఈ రోజు (సోమవారం, 06 జనవరి 2025) BSE సెన్సెక్స్ 79,281.65 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. NSE నిఫ్టీ 24,045.80 స్థాయి దగ్గర స్టార్ట్ అయింది.
మార్కెట్‌కు కరోనా గుర్తుకొచ్చింది
బెంగళూరులో తొలి హెచ్‌ఎంపీవీ కేసు నమోదైందని ఉదయం వార్తలు వచ్చిన వెంటనే స్టాక్ మార్కెట్‌లో పతనం ప్రారంభమైంది. ఈ వైరస్ మొదట చైనాలో బయటపడింది, ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు కొన్ని రోజులుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు కనిపిస్తున్నాయి. చైనాలో ఇప్పటికే లక్షల మంది దీని బారిన పడ్డారని ఆ రిపోర్ట్స్‌ను బట్టి తెలుస్తోంది.
మన దేశంలో, బెంగళూరు మొదటి HMPV కేస్ బయటపడ్డట్లు రిపోర్ట్స్ రావడంతో, మార్కెట్ పెట్టుబడిదారులకు 5 సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారి గుర్తుకు వచ్చింది. నిద్రాణంగా ఉన్న కరోనా భయం HMPV రూపంలో బయటికొచ్చే సరికి మార్కెట్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. వచ్చినంతవరకు చాలు అనుకుంటూ పెట్టుబడిదారులు షేర్లను అమ్మడం స్టార్ట్ చేశారు.
HMPV వల్ల రూ.లక్షల కోట్ల నష్టం
కర్ణాటకలో HMPV కేసు వెలుగులోకి రావడంతో నేటి సెషన్‌లో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. BSE మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 9 లక్షల కోట్లకు పైగా క్షీణించింది. BSEలో లిస్టయిన స్టాక్స్ మార్కెట్ విలువ గత సెషన్‌లో రూ. 449.78 లక్షల కోట్లుగా ఉండగా, ఈ రోజు అది రూ. 440.74 లక్షల కోట్లకు తగ్గింది. అంటే, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్క పూటలోనే (ఈ రోజు మధ్యాహ్నానికి) రూ. 9.04 లక్షల కోట్లు తగ్గింది.
అనూహ్య పతనం తర్వాత, ఇంట్రాడే కనిష్ట స్థాయుల నుంచి మార్కెట్లు కొద్దిగా కోలుకున్నాయి. మధ్యాహ్నం 12.20 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 937.13 పాయింట్లు లేదా 1.18 శాతం పడిపోయి 78,285.98 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. NSE నిఫ్టీ 290.10 పాయింట్లు లేదా 1.21 శాతం క్షీణించి 23,714.65 పాయింట్ల వద్ద కదులుతోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయంతో మీ రిటైర్మెంట్ నాటికి రూ.కోట్ల కొద్దీ డబ్బు