Blanket Benefits: మీకు తెలుసా? బరువైన దుప్పటి కప్పుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలో!
మెత్తగా హాయిగా ఉన్న దుప్పటి కప్పుకుని నిద్రపోతే ఎలా ఉంటుంది. ఆహా.. ఎంతసేపైనా అలాగే పడుకోవాలని అనిపిస్తుంది కదా.
కొంతమందికి నిద్రపోయేటప్పుడు దుప్పటి కప్పుకొనిదే నిద్ర కూడా రాదు. ఆఖరికి ఎండాకాలంలో కూడా గాలి ఆడకపోయినా దుప్పటి మాత్రం కప్పుకుని తీరాల్సిందే. చెమటలు పడుతున్నా కూడా ముసుగుతన్ని మరి హాయిగా నిద్ర పోతారు. దుప్పటి కప్పుకుంటే హాయిగా నిద్ర పడుతుందని అంటారు. అందుకే మెత్తగా, బరువుగా ఉండే వాటిని చుట్టేసుకుని నిద్రపోతారు. దుప్పటి కప్పుకుని పడుకోవడం వల్ల హాయిగా ఉండటమే కాదు, ఆందోళనను తగ్గించి, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందట.
గతంలో అయితే సోలాపూర్ దుప్పట్లు ఎక్కువగా కప్పుకోవడానికి ఉపయోగించే వాళ్ళు. అవి కాస్త మొద్దుగా బరువుగా రఫ్ గా ఉంటాయి. కానీ ఇప్పుడు మార్కెట్లో పట్టుకుంటేనే జారిపోయేంత మెత్తగా ఉండేవి దొరుకుతున్నాయి. చూడటానికి కూడా ఎంతో క్యూట్ గా కనిపిస్తూ చాలా మెత్తగా మృదువుగా తాకడానికి చేతికి చాలా హాయిగా అనిపించేవి లభిస్తున్నాయి. బాగా డబ్బున్న వాళ్ళ ఇళ్ళల్లో ఇవి ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. బరువుగా మెత్తగా ఉండే ఆ దుప్పటిని కప్పుకుంటే నిజంగానే హాయిగా నిద్ర పడుతుందా అని చాలా మందికి సందేహం కలుగుతుంది.
బరువు దుప్పటి ఎలా రూపొందించారు?
USA టుడే ప్రకారం మొదటి బరువైన దుప్పటి 1997 లో కనిపెట్టారంట. కీత్ జివాలిచ్ అనే వ్యక్తి దీన్ని కనిపెట్టాడు. తన కూతురు ఒక మెత్తని బొమ్మని ఆయన భుజం మీద ఉంచినప్పుడు ఈ బరువైన దుప్పటి కనిపెట్టాలనే ఆలోచన వచ్చిందంట. హాయిగా ఉండే అనుభూతి కలిగించే దుప్పటి సృష్టించాలని అనుకున్నారట. అతను దాన్ని రూపొందించడానికి డీప్ ప్రెజర్ టచ్ స్టిమ్యులేషన్ థెరపీ (DPTS)ని ఉపయోగించాడు. మైక్రో గ్లాస్ పూసలు, ఉక్కు పూసలు, గులకరాళ్ళు, ఇసుకతో పాటు కొన్ని రకాల ధాన్యాలు వంటి వాటిని ఉపయోగించి ఈ బరువున్న దుప్పటిని తయారు చేశారు.
బరువైన మెత్తటి దుప్పటి కప్పుకోవడం వల్ల ఆందోళన తగ్గుతుంది. పూణేలోని ఆత్మాన్ సైకాలజీ స్టూడియోలో చీఫ్ సైకాలజిస్ట్ వినయా గోర్ మాట్లాడుతూ దీని గురించి మాట్లాడుతూ ఇది కౌగిలించుకున్న లేదా ఎవరో పట్టుకున్న అనుభూతికి సమానమైన ఒత్తిడిని, శరీరానికి హాయిని కలిగిస్తుంది. ఒత్తిడి సాధారణంగా స్వయం ప్రతిపత్త నాడీ వ్యవస్థను విశ్రాంతి మోడ్‌లో ఉంచుతుంది. తరచుగా వచ్చే గుండె కొట్టుకోవడం వంటి ఆందోళన లక్షణాలను తగ్గించడంలో ఇది సహాయపడుతుందని చెప్పారు.
మనం గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది అదే బరువైన మెత్తటి దుప్పటి కప్పుకోవడం వాళ్ళ అదనపు వెచ్చదనాన్ని అందించడంలో ఇది సహకరిస్తుంది. నిద్ర, ఆహారం శరీరానికి చాలా అవసరం. సరిగా నిద్రపోకపోతే హార్మోన్ల పనితీరుకి తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. ఇటీవల కొన్ని అధ్యయనాలు బరువైన మెత్తని దుప్పట్లని వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ దుప్పట్లు కొంతవరకు ఆరోగ్యానికి మంచే చేస్తాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని మెంటల్ వెల్ నెస్ సెంటర్ నిపుణురాలు రచన చెప్పుకొచ్చారు.
ఈ సమస్య ఉన్నవాళ్ళు వినియోగించకూడదు
అయితే ఈ బరువైన దుప్పటి అందరికీ సరిపోదని కూడా నిపుణులు తెలిపారు. దీర్ఘకాలిక శ్వాసకోశ లేదా రక్తప్రసరణ సమస్యలు, ఆస్తమా, తక్కువ రక్తపోటు, స్లీప్ అప్నియా లేదా క్లాస్ట్రోఫోబియా వంటి పరిస్థితులు ఉన్నవారు దీన్ని ఉపయోగించకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఇందులోని గాజు పూసలు బయటకి వచ్చి ప్రమాదంగా మారే అవకాశం ఉంది. అమెరికన్ ఆక్యుపేషనల్ థెరపీ అసోసియేషన్ చేసిన 8 అధ్యయనాల ప్రకారం ఆందోళనను తగ్గించడంలో బరువున్న దుప్పట్లు తగిన చికిత్స సాధనం కావచ్చు. అయితే అవి నిద్రలేమికి సహాయపడతాయని సూచించడానికి మాత్రం తగిన ఆధారాలు లేవు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఫ్రొజెన్ ఫుడ్ అతిగా తింటున్నారా? అనారోగ్యాన్ని 'కొని' తెచ్చుకున్నట్లే!
Also read: రవ్వ పాయసం, రవ్వ గారెలు - బొంబాయి రవ్వతో టేస్టీ వంటలు