రోజుకో గుడ్డు తినడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుందా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?
గుడ్డు ఆరోగ్యాన్నిస్తుందని అందరికీ తెలుసు, అలాగే జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుందా?
పిల్లలూ, పెద్దలూ రోజుకో గుడ్డు తింటే ఎంతో ఆరోగ్యం. శరీరానికి అవసరమయ్యే పోషకాహారం లభిస్తుంది. ప్రతిరోజూ గుడ్డు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మెదడు పనితీరును పెంచి మెదడు ఆరోగ్యాన్ని, అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుందని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. రోజుకో గుడ్డు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
గుడ్డులో ఏముంటుంది?
జ్ఞాపకశక్తి పెరిగేందుకు గుడ్డే ఎందుకు తినాలి? అంటే దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఎన్నో అమైనో ఆమ్లాలు, ఐరన్, విటమిన్లు, ఖనిజాలు, కెరోటినాయిడ్స్, లుటిన్, జియాక్సంతిన్ వంటి ఎన్నో అత్యవసరమైన పోషకాలు ఇందులో ఉంటాయి. రోజూ ఒక గుడ్డు తినడం వల్ల మీ శరీరానికి 75 కేలరీలు, 7-8 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కొవ్వు, 1.6 గ్రాముల సంతృప్త కొవ్వులు, కండరాలను నిర్మించడంలో సహాయపడే అనేక పోషకాలు లభిస్తాయి.దీనితో పాటూ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో కణాలు, కణజాలాల పునరుత్పత్తికి కూడా సహాయపడుతుంది.న్యూట్రిషనల్ న్యూరోసైన్స్ జర్నల్ ప్రచురించిన ప్రకారం 18 నుంచి 75 సంవత్సరాల మధ్య వయస్సు గల 79 మందిపై చేసిన అధ్యయనంలో గుడ్లు తినడం వల్ల జ్ఞాపకశక్తిని పెరుగుతుందని తేలింది.
నిపుణులు ఏమంటారు?
ఈ అధ్యయనం ప్రధాన పరిశోధకుడైన కిరణ్ క్యాంప్‌బెల్ మాట్లాడుతూ గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, అందులోని ప్రొటీన్ అయిన హైడ్రోలైసేట్‌ను విచ్ఛిన్నం చేయడం వల్ల కలిగే లాభాలు వివరించారు. గుడ్డులోని ప్రొటీన్ జ్ఞాపకశక్తిని పెంచుతుందని నిర్ధారించారు. స్వీయ నియంత్రణ, సృజనాత్మకత, శ్రద్ధ, తార్కికంగా ఆలోచించడం, జ్ఞాపకశక్తి, పనులను మెరుగ్గా చేసేలా చేయడం వంటివి గుడ్డు తినడం వల్ల కలిగే అధిక ప్రయోజనాలు.
గుడ్డులో ఉండే కోలిన్, లుటీన్, జియాక్సంతిన్ వంటి ఫైటోన్యూట్రియెంట్‌లను గుడ్డు సొనలు కలిగి ఉంటాయి. ఈ పోషకాలు జ్ఞాపకశక్తిని పెంచేందుకు సహకరిస్తాయి. రోజుకో గుడ్డు వరకు మంచిదే, కానీ అధికంగా తినడం వల్ల మాత్రం సమస్యలు రావచ్చు. కాబట్టి మితంగా తినడం మంచిది. గుడ్డు పచ్చ భాగంలో ఉండే కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో తీసుకోవడం వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు పెరగవచ్చు. అందుకే రోజుకు ఒక గుడ్డు సొన తినడం చాలు, అందులోనే ప్రొటీన్లు ఉంటాయి.
Also read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయ ఇదే, కిలో కొనాలంటే ఎంత ఖర్చుపెట్టాలంటే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.