Pregnant: బ్లాక్ కాఫీ డయాబెటిస్ రాకుండా అడ్డుకోగలదా?
గర్భిణుల్లో వచ్చే డయాబెటిస్ గురించి అవగాహన చాలా అవసరం. ఇది దీర్ఘకాలంలో టైప్ 2 డయాబెటిస్ గా మారే అవకాశం కూడా ఉంది.
డయాబెటిస్ అంటే టైప్ 1, టైప్ 2 గురించి ఎక్కువగా తెలుస్తుంది. కానీ గెస్టేషనల్ డయాబెటిస్ (గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం) గురించి అవగాహన తక్కువగా ఉంటుంది. కారణం అది కేవలం గర్భిణీలకు మాత్రమే వస్తుంది. దాదాపు 10 నుంచి 16 శాతం గర్భిణీల్లో ఈ డయాబెటిస్ కనిపిస్తుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీలో మధుమేహం వచ్చినా.. డెలివరీ అయిన తర్వాత తగ్గిపోతుంది. కానీ మరికొంతమందిలో మాత్రం అది కంటిన్యూ అవుతుంది. పిల్లలకి కూడా సోకే ప్రమాదం ఉంది. ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్ల గెస్టేషనల్ డయాబెటిస్ నుంచి బయటపడొచ్చని తాజా అధ్యయనం ఒకటి చెప్పుకొచ్చింది.
క్రమం తప్పకుండా కాఫీ తాగడం వల్ల గెస్టేషనల్ డయాబెటిస్ ని దూరం చేసుకోవచ్చని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఆర్టిఫిషియల్ స్వీటేనర్స్ లేదా చక్కెర వేసుకుని తాగిన కాఫీ వల్ల కూడా గెస్టేషనల్ డయాబెటిస్ ను దూరం పెట్టవచ్చని పేర్కొన్నారు. కెఫీన్ లేని కాఫీ వల్ల కూడా ఈ ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. గెస్టేషనల్ మధుమేహం ఉన్న వాళ్ళు ఏదో ఒక టైమ్ కి టైప్ 2 డయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఉంది. అయితే బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చని పరిశోధకులు అంటున్నారు.
పరిశోధన ఏం చెబుతోంది?
రోజుకి రెండు నుంచి ఐదు కప్పుల కెఫీన్ లేదా డికాఫీన్ తాగడం వల్ల గర్భిణీల్లో వచ్చే డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధనలో తేలింది. ఇందులో పాలీఫేనాల్స్ ఉండటం వల్ల ఇది జరుగుతుంది. అయితే గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం ఉన్న మహిళల మీద కాఫీ ప్రయోజనాలు గురించి పరీక్షించడం ఇదే తొలిసారి. పరిశోధకులు 25 సంవత్సరాలకి పైగా గెస్టేషనల్ డయాబెటిస్ వచ్చిన 4500 మందికి పైగా మహిళలని పరిశీలించారు. దీర్ఘకాలికంగా కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు పరిశీలించారు. గర్భం దాల్చిన తర్వాత మహిళలు కెఫీన్ తో కూడిన కాఫీని తీసుకోవడం వల్ల టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
కృత్రిమ స్వీటేనర్ లేదా షుగర్ కలుపుకుని కాఫీ తాగే వారిలో ఈ ప్రమాదం 10%, 17% తగ్గినట్టుగా తెలిపారు. తాజా అధ్యయనం గురించి మరికొంతమంది నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తారు. కాఫీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది అనేందుకు స్పష్టమైన ఆధారాలు, అధ్యయనాలు చాలా తక్కువగా ఉన్నాయి. మరికొన్ని అధ్యయనాలు కాఫీ తాగడం వల్ల హానికరమైన ప్రభావాలు చూపించిందని చెప్తున్నాయి. అయితే కొన్ని దేశాల్లో బ్లాక్ కాఫీ తాగితే ఇండియా మాత్రం పాలు, చక్కెర కలుపుకుని తాగుతారు. ఏది ఏమైనప్పటికి కాఫీ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.
ఈ అధ్యయనం కొవ్వు/ అధిక కొవ్వు లేని పాల ఉత్పత్తులు లేకుండా చక్కెర కలపకుండా తీసుకున్న కాఫీ మాత్రమే తాగారు. కానీ ఇది భారతదేశంలో సరిపోతుందో లేదో మాత్రం చెప్పడం కష్టం అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది పాలు, పంచదార లేకుండా కాఫీ తీసుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అందుకే దీని మీద మరిన్ని అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణుల బృందం వెల్లడించింది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: పదే పదే ఆకలేస్తుందా? ఈ ప్రాణాంతక వ్యాధికి సంకేతం కావొచ్చు!