Dental Care: టూత్ పేస్ట్ లేకుండా బ్రష్ చెయ్యొచ్చా? నిపుణులు ఏం సూచిస్తున్నారు?
దంతాల పరిశుభ్రత చాలా ముఖ్యం. ఒక్కొక్కరు ఒక్కో రకమైన పేస్ట్ ఉపయోగిస్తూ బ్రష్ చేస్తారు. కానీ అసలు నిజంగా టూత్ పేస్ట్ అవసరం లేదని అంటున్నారు నిపుణులు.
పూర్వకాలంలో అయితే బొగ్గు పొడి, వేప పుల్లలతోనే పళ్ళు తోముకునే వాళ్ళు. తర్వాత పళ్ల పొడి, టూత్ పేస్ట్ వచ్చాయి. ఎక్కువ పేస్ట్ వేసుకుని పళ్ళు రుద్దుకోవాలని లేదంటే దంతాలు శుభ్రపడవని అంటారు. చిన్నప్పటి నుంచి నోటి శుభ్రత గురించి చెప్తూనే ఉంటారు. రోజుకి కనీసం రెండు సార్లు బ్రష్ చేయాలని చెప్తారు. కొంతమంది అదే విధానం పాటిస్తారు కూడా. అయితే నోటి పరిశుభ్రతకి తప్పనిసరిగా టూత్ పేస్ట్ వేసుకుని బ్రష్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. అదేంటి టూత్ పేస్ట్ లేకుండా బ్రష్ ఎలా చేస్తారు అని ఆలోచిస్తున్నారా? అందుకు కారణాలు ఉన్నాయి. అవేంటంటే..
టూత్ పేస్ట్ లేకుండా బ్రష్ చెయ్యడం మంచిదేనా?
నోటి పరిశుభ్రతకి టూత్ బ్రష్ అత్యంత కీలకమైనది. అయితే టూత్ పేస్ట్ మాత్రం కేవలం ఒక అదనపు టచ్ అని దంతవైద్యులు చెప్తున్నారు. అంతేకాదు టూత్ పేస్ట్ ను నివారించడం ఖచ్చితంగా మంచి విషయమే అని కొన్ని అధ్యయనాలు కూడా వెల్లడిస్తున్నాయి.
దంత ఫలకం అంటే ఏంటి?
క్లీవ్ ల్యాండ్ క్లినిక్ ప్రకారం మన దంతాల మీద కొంత మొత్తంలో ఫలకం ఉంటుంది. అది నోటిలోని బ్యాక్టీరియా, చక్కెర, పిండి పదార్థాలతో కలిసినప్పుడు దంతాల మీద ఏర్పడే ఒక పొర. బ్రషింగ్, ఫ్లాస్టింగ్ అనేది దంతాల మీద ఏర్పడే ఆ ఫలకాన్ని వదిలించుకోవడానికి చేసే మార్గాలు. అది తొలగించడంలో నిర్లక్ష్యం చేస్తే గట్టిపడి టార్టార్‌గా మారుతుంది. దాని వల్ల కావిటీస్, చిగురు వాపు వంటి వ్యాధులు, ఇతర ఇన్ఫెక్షన్లకి దారితీస్తుంది. ఇది నోటి దుర్వాసనకి కారణమవుతుంది. ఇది దీర్ఘకాలికంగా అలాగే ఉంటే చిగుళ్ళలో రక్తస్రావం కూడా అవుతుంది. అయితే ఈ ఫలకాన్ని వదిలించుకోవడానికి టూత్ పేస్ట్ అవసరం లేదని ఆ బ్యాక్టీరియాని తుడిచిపెట్టడానికి టూత్ బ్రష్ పళ్ళు సరిపోతాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అసలు టూత్ పేస్ట్ దేనితో తయారు చేస్తారో తెలుసా?
అడ్వాన్స్‌డ్ డెంటల్ ఆర్ట్స్ ప్రకారం టూత్ పేస్ట్ కొన్ని రకాల రసాయనాలతో తయారు చేయబడుతుంది. అవేంటంటే..
ఫ్లోరైడ్: ఇది అన్ని టూత్ పేస్ట్ ల్లో ఉండే రసాయనం. ఇది పళ్ల మీద ఎనామిల్ ని బలంగా ఉంచేందుకు, కావిటీస్ రాకుండా నివారించేందుకు సహాయపడుతుంది.
అబ్రాసివ్స్: ఇవి ఫలకం ఏర్పడటానికి వ్యతిరేకంగా పోరాడే రసాయనం. ఇది దంత ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
కృత్రిమ రుచులు: ఇది తీపు, ఉప్పు, పుదీనా వంటివి కలపడం వల్ల ఒక రకమైన సువాసన, రుచి ఉంటుంది.
డిటర్జెంట్లు: ఇది తప్పనిసరిగా అన్ని రకాల టూత్ పేస్ట్ లో ఉంటుంది. ఇవి నురగని ఏర్పరుస్తాయి.
కృత్రిమ రంగులు: అనేక రకాల పేస్టుల్లో రంగు వచ్చే విధంగా ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులు కలుపుతారు.
దంతాలు మెరిసేలా కాపాడుకోవడం ఎలా?
దంతాలు తెల్లగా, బలంగా ఆరోగ్యంగా ఉండేందుకు సరిగా బ్రష్ చెయ్యాలి. టూత్ బ్రష్ ని సున్నితంగా వృత్తాకార కదలికలో కదిలించాలి. నాలుక కూడా తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే నాలుక మీద కూడా పాచి పేరుకునిపోతుంది. కనీసం రోజుకి ఒక్కసారైనా ఫ్లాస్టింగ్ చెయ్యాలి. ఆహారం తిన్న తర్వాత పుక్కిలించడం వల్ల పళ్లలో ఇరుక్కున ముక్కలు బయటకి వచ్చేస్తాయి. చక్కెర తక్కువగా తీసుకోవాలి. స్వీట్స్ అధికంగా తినడం వల్ల కావిటీస్ ఏర్పడే ప్రమాదం ఉంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: అల్ బుకరా పండ్లు కనిపిస్తే కచ్చితంగా తినండి, ఈ సమస్యలనీ దూరం అయిపోతాయి