Deepavali 2025 : దసరా జరిగిన 20 రోజుల తర్వాతే దీపావళిని ఎందుకు చేసుకుంటారు? గూగుల్ మ్యాప్ చెప్పిన సీక్రెట్ ఇదే
Diwali Facts 2025 : ప్రతి సంవత్సరం దసరా తర్వాత 20 రోజులకి దీపావళి వస్తుంది. దీని వెనుక కారణం ఏంటో, ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Dussehra to Diwali Gap Story : భారతదేశంలో ప్రతి సంవత్సరం దీపావళి (Deepavali 2025)ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. సనాతన ధర్మంలో ఇది ముఖ్యమైన పండుగ. అయితే ఈ దీపాల పండుగ ప్రతి సంవత్సరం దసరా జరిగిన 20 లేదా 21 రోజుల తర్వాత వస్తుంది. ఈ సంవత్సరం 2025లో దసరా తర్వాత సరిగ్గా 20 రోజులకు అక్టోబర్ 20వ తేదీన వచ్చింది. అసలు దసరా జరిగిన.. 20 రోజుల తర్వాతే దీపావళిని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? దీని వెనుక ఓ ఇంట్రెస్టింగ్ రీజన్ ఉందట. దీనిగురించి అందరికీ పెద్దగా తెలియకపోవచ్చు. మరి ఆ కారణమేంటో ఇప్పుడు చూసేద్దాం.
దసరా తర్వాత 20 రోజులకే దీపావళి.. ఎందుకంటే..
దసరా తర్వాత 20 లేదా 21 రోజుల తర్వాత దీపావళిని జరుపుకోవడానికి ఒక మతపరమైన నమ్మకం ఉంది. మహర్షి వాల్మీకి రామాయణం ప్రకారం.. రావణుడు సీతను ఎత్తుకెళ్లిన తర్వాత.. వానర సైన్యంతో వెళ్లిన రాముడు.. లంకాధిపతి రావణుడిని వధిస్తాడు. అనంతరం ధర్మం వైపు నిలిచిన బంగారు లంకను రావణుడి తమ్ముడు విభీషణుడికి అప్పగిస్తాడు. రావణుడి సంహరణకు ప్రతీకగా దసరా చేసుకుంటారు. ఆ తర్వాత శ్రీరాముడు సీతా సమేతుడై.. అయోధ్యకు తిరిగి వస్తాడు. ఇలా లంక నుంచి రాముడు అయోధ్య రావడానికి మొత్తం 20 రోజులు పట్టిందని వాల్మికీ రామాయణం చెప్తోంది. రాముడు రాగానే అయోధ్య నగరంలోని వారందరూ ఆయనకు స్వాగతం పలుకుతూ దీపాలు వెలిగించారని.. అప్పటి నుంచి ఈ పండుగను దీపావళిగా జరుపుకోవడం ప్రారంభించారని చెప్తోంది రామాయణం. ప్రతి సంవత్సరం తిథుల ప్రకారం దసరా తర్వాత 20 లేదా 21 రోజులకు దీపావళి చేస్తారు.
గూగుల్ మ్యాప్ ఏం చెబుతోంది?
దసరా తర్వాత దీపావళిని జరుపుకోవడం గురించి విశ్లేషిస్తే.. అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఎలా అంటే.. శ్రీరాముడు శ్రీలంక నుంచి భారతదేశానికి ప్రయాణించారు. కాబట్టి ఇప్పుడు ఉపయోగించే గూగుల్ మ్యాప్ ద్వారా రెండు స్థానాల మధ్య ప్రయాణ దూరాన్ని సులభంగా లెక్కించవచ్చు. దాని కోసం ఫోన్‌లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత మీ లొకేషన్లో శ్రీలంకను ఎంచుకుని.. గమ్యస్థానంలో అయోధ్య, ఉత్తరప్రదేశ్‌ను ఎంచుకోవాలి. ఇప్పుడు సెర్చ్ చేస్తే.. ఈ మొత్తం దూరం 3127 కి.మీ అని చూపిస్తుంది.

వాకింగ్ సింబల్‌పై క్లిక్ చేస్తే.. సమయం చూపిస్తుంది. అప్పుడు మొత్తం సమయం 491 గంటలు ఉంటుంది. అంటే ఇరవైన్నర రోజులు అని చూపిస్తుంది. అందుకే దీపావళి కొన్నిసార్లు దసరా నుంచి 20 రోజుల తర్వాత.. మరికొన్నిసార్లు 21 రోజుల తర్వాత జరుపుకుంటారు. ఓ రకంగా టెక్నాలజీ కూడా 20 రోజుల ప్రయాణాన్ని సమర్థిస్తుందని భక్తులు బలంగా నమ్ముతున్నారు.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు, సమాచారంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ABP దేశం ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించట్లేదు. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఫాలో అవ్వడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.






















