Diwali Safety Tips : దీపావళి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. పిల్లల నుంచి పెద్దల వరకు ఆరోగ్యం కోసం
Deepawali 2025 : దీపావళికి ఇంటిని శుభ్రం చేసుకోవడమే కాదు.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే వాయు, శబ్ధ కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. మరి ఆ సమయంలో ఏమి ఫాలో అవ్వాలంటే..

Diwali Safety Tips for Health : దీపావళి (Diwali 2025) సమయంలో ఇళ్లు శుభ్రం చేసుకోవడం నుంచి.. ఇంటిని అలంకరించడం, ఆఫర్లలో దొరికే ఇంటికి అవసరమైన వస్తువులు తెచ్చుకోవడం వంటివి చేస్తారు. ఇది చాలామందికి ఉండే రొటీన్. కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో మాత్రం ముందుగా ప్రిపేర్ అవ్వరు. ఏ పండక్కి తీసుకున్నా.. తీసుకోకపోయినా.. దీపావళి సమయంలో మాత్రం కచ్చితంగా ఆరోగ్యం కోసం ముందుగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీపావళి పండుగ (Deepavali Festival) ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా.. కొన్నిసార్లు ఆరోగ్య సమస్యల్ని కూడా ఇస్తుంది. అందుకే పిల్లల నుంచి పెద్దలవరకు.. ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దీపావళి సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
దీపావళి సమయంలో వ్యాపించే వ్యాధులు ఇవే
ముందుగా ఇంటిని క్లీన్ చేయడం నుంచి చూస్తే.. ఇళ్లు క్లీన్ చేసేప్పుడు దుమ్ము బారిన పడతారు. మాస్క్ కట్టుకున్నా సరే కొన్నిసార్లు దుమ్ము వల్ల తుమ్ములు రావడం, దగ్గు, ఇతర అలర్జీలు రావడం జరుగుతాయి. జలుబు చేసి శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు కూడా రావచ్చు. అలాగే ఆస్తమా, డస్ట్ అలర్జీ సమస్య ఉన్నవారు క్లీనింగ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఫ్లోర్, వస్తువులు క్లీనింగ్ చేయడానికి డిటర్జెంట్లు, క్లీనర్లు వాడుతారు. ఇలాంటివాటిలో హానికరమైన కెమికల్స్ ఉంటాయి. వాటిని ఎక్కువగా ఉపయోగిస్తే అది చర్మం, కళ్లకు హాని కలిగించవచ్చు. కొన్ని సందర్భాల్లో శ్వాస సమస్యలు కూడా వస్తాయి.
ఇవేకాకుండా దీపావళి సమయంలో చాలామంది క్రాకర్స్ వాడతారు. ఆ సమయంలో వాటి నుంచి వచ్చే పొగ శ్వాస సమస్యలు తెస్తుంది. దగ్గు, జలుబు రావచ్చు. అలాగే వాటిని కాల్చేప్పుడు స్కిన్ కాలిపోవచ్చు. క్రాకర్స్ సౌండ్స్ ఎక్కువగా ఇబ్బంది పెట్టవచ్చు. శబ్ధాల వల్ల నిద్రరాకపోవచ్చు. కొన్నిసార్లు కళ్లల్లో అగ్గిరవ్వలు పడతాయి. పండుగ సమయంలో చాలామందికి కళ్లు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ దీపావళి సమయంలో వచ్చే మేజర్ సమస్యలుగా చెప్పవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
దీపావళి సమయంలో లేదా ఇంటిని ఏ సమయంలో అయినా క్లీన్ చేయాలనుకుంటే.. CDC, NCDC మార్గదర్శకాల ప్రకారం.. మాస్క్ (N95 లేదా సర్జికల్) పెట్టుకుంటే మంచిదట. బ్లీచ్, డిటర్జెంట్ల వంటి క్లీనింగ్ రసాయనాలు చేతులు, కళ్లకు హాని కలిగిస్తాయి కాబట్టి.. దానిని నివారించడానికి మీరు రబ్బరు గ్లవ్స్, సేఫ్టీ గాగుల్స్ ధరించాలి. శుభ్రపరిచే సమయంలో గది తలుపులు, కిటికీని తెరిచి ఉంచాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మంచి గాలి లోపలికి ప్రవేశిస్తుంది. దుమ్ము, ఇతర విషయాలు ఇబ్బంది కలిగించవు. చీపురుకు బదులుగా తడి గుడ్డ లేదా మోప్ ఉపయోగించడానికి ప్రయత్నించండి. అప్పుడు దుమ్ము గాలిలోకి ఎగరదు.
అలాగే క్రాకర్స్ కాల్చేప్పుడు మీరు బాగా సెన్సిటివ్ అనుకుంటే వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండండి. అలాగే బయటకు వెళ్లాల్సి వస్తుంది అనుకుంటే మాస్క్ పెట్టుకోండి. చెవులలో కాటన్ పెట్టుకోవచ్చు. ఎవరైనా మీకు సమీపంలో క్రాకర్స్ కాలుస్తుంటే కళ్లు మూసుకోవాలి. లేదా గ్లాసెస్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా సిల్క్ డ్రెస్లు వేసుకోకూడదు. కాటన్ వంటివి వేసుకుంటే మంచిది. ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టుకోవాలి. అంతేకాకుండా బర్నాల్ వంటివి అందుబాటులో ఉంచుకోవాలి. ఏదైనా మేజర్ ప్రమాదం జరిగితే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదిస్తే మంచిదని చెప్తున్నారు నిపుణులు.






















