Digital Detox: ఆ ఊర్లో రోజూ గంటన్నర సేపు ఫోన్లు, టీవీలు బంద్, ఆ సమయంలో అంతా ఏం చేస్తారో తెలుసా?
కొంత మంది ప్రజలు తీసుకునే నిర్ణయాలు చాలా గొప్పగా, స్ఫూర్తివంతంగా ఉంటాయి. మహారాష్ట్రలోని ఓ గ్రామ ప్రజల నిర్ణయం గురించి తెలిస్తే మీరూ అభినందించకుండా ఉండలేరు.
సరిగ్గా రాత్రి 7 గంటలకు ఆ ఊళ్లో ఓ సైరన్ మోగుతుంది. వెంటనే ఆ ఊరి ప్రజలంతా తమ ఫోన్లు, టీవీలతో పాటు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను తీసి పక్కన పెడతారు. సుమారు గంటన్నర పాటు ఊళ్లోని ఏ ఒక్కరూ ఫోన్లు సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించరు. అదేంటీ? రోజూ అలా ఎందుకు చేస్తారు? ఆ గంటన్నర సమయం ఎలా టైంపాస్ చేస్తారు? ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం ఏమిటనేగా మీ సందేహం? అయితే మీరు తప్పకుండా ఆ ఊరి గురించి తెలుసుకోవల్సిందే.
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని గ్రామ ప్రజలు రాబోయే ఉపద్రవాన్ని ముందుగానే పసిగట్టారు. అందుకే, అక్కడి ప్రజలంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 7 గంటలకు సైరన్ మోగగానే.. ఎన్ని ముఖ్యమైన పనులన్నా సరే ఫోన్ ముట్టుకోరు. కాల్స్ అటెండ్ చేయరు. వాటిని ఇంట్లో పడేసి ఊర్లో తిరుగుతారు. కనీసం పిల్లలకు కూడా ఫోన్లు ఇవ్వరు. టీవీలను సైతం చూడనివ్వరు. దాదాపు గంటన్నరపాటు అవన్నీ ఆఫ్‌లో ఉండాల్సిందే. మరి ఆ సమయంలో వారంతా ఏం చేస్తారనేగా మీ సందేహం?
ఆ గంటన్న సమయంలో పిల్లలు పుస్తకాలు తెరిచి బుద్ధిగా చదువుకుంటారు. ఆయా గ్రామాల పెద్దలంతా ఒక చోట కూర్చొని ఊరులో చేపట్టాల్సిన డెవలప్‌మెంట్ కార్యక్రమాల గురంచి చర్చిస్తారు. ఒక్క గ్రామంతో మొదలైన ఈ సాంప్రదాయం ఇప్పుడు ఆ జిల్లాలో ప్రతి గ్రామానికీ పాకుతోంది. ఇలా చేయడానికి బలమైన కారణమే ఉంది.
వాస్తవానికి ఈ రోజుల్లో జనాలు టెక్నాలజీ చుట్టూనే తిరుగుతున్నారు. ఆన్ లైన్ లో విలాసవంతమైన వస్తువులను ఆర్డర్ చేయడం నుంచి మొదలుకొని రోజువారి కిరాణా వంటి అవసరాల వరకు అన్ని పనులు ఆన్ లైన్ ద్వారానే చక్కదిద్దుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా లేకుండా అస్సలు ఉండలేకపోతున్నారు. ఫోన్ ఎక్కువగా వాడటం మూలంగా బ్లూ లైట్ తగిలి నిద్రలేమి సమస్యలు వస్తున్నాయి. రేడియేషన్ మూలంగా మెదడు సంబంధ ఇబ్బందులు కలుగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే డిజిటల్ డిటాక్స్‌ను క్రమం తప్పకుండా సాధన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కనీసం కొన్ని గంటల పాటైనా స్మార్టు ఫోన్లకు దూరంగా ఉండాలంటున్నారు. మిగతా ప్రాంతాల్లో ఈ విధానాన్ని ఎవరు పాటించినా, పాటించకపోయినా ప్రతి రోజు సాయంత్రం 7 గంటలకు సైరన్ మోగిన వెంటనే వారి ఫోన్లను దూరం పెడతారు. టీవీలను ఆఫ్ చేస్తారు. సుమారు గంటన్నర పాటు వాటి జోలికి వెళ్లరు. పిల్లలకు సంబంధించిన హోం వర్క్ చేయించడంతో పాటు గ్రామ ప్రగతికి సంబంధించిన విషయాల గురించి ఆ ఊరి జనాలు చర్చిస్తారు.
కరోనా మహమ్మారి తర్వాత పిల్లలు స్కూళ్లకు వెళ్లిన సమయంలో అందరూ సోమరులుగా తయారైనట్లు టీచర్లు గుర్తించారు. చదవడం, రాయడం చేయలేకపోతున్నారని గ్రహించారు. విద్యార్థులు ఎక్కువగా సెల్ ఫోన్లు చూస్తున్నారని గ్రామ సర్పంచ్ కు చెప్పారు. ఈ నేపథ్యంలో తమ గ్రామంలో డిజిటల్ డిటాక్స్ ఆలోచనను అమలు చేసినట్లు సర్పంచ్ వెల్లడించారు.
డిజిటల్ డిటాక్స్ అంటే ఏమిటి?
చాలా మంది ప్రజలు సెల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. గంటల తరబడి ఫోన్లు చూడటం మూలంగా చాలా మంది శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. దీని నుంచి తప్పించుకునేందుకు ఫోన్లు, డిజిటల్ వస్తువులను ఉపయోగించకుండా దూరంగా ఉండటాన్నే డిజిటల్ డిటాక్స్ అంటారు.
డిజిటల్ డిటాక్స్ మూలంగా కలిగే లాభాలు ఏంటంటే?
డిజిటల్ డిటాక్స్ కూలంగా సెన్సాఫ్ సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. సోషల్ ఇంటరాక్షన్స్ పెరుగుతాయి. చక్కగా నిద్రపోయే అవకాశం ఉంటుంది. చర్మ సౌందర్యం కలుగుతుంది. మెరుగైన ఉత్పాదకత కలుగుతుంది. మానసిక ఆరోగ్య ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనకు గురి కాకుండా చూసుకోవచ్చు. తృప్తిగా ఉండవచ్చు. ఆత్మగౌరవాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. జీవితంలో ఆరోగ్యకరమైన, విభిన్న సాధనల కోసం మరింత సమయాన్ని వెచ్చించే అవకాశం ఉంటుంది.
Also read: బంగాళాదుంపలు తొక్క తీసి వండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో నష్టం, ఈ లాభాలన్నీ కోల్పోవాల్సిందే
Also read: వాతావరణం చల్లగా ఉందా? ఆ సమయంలో మీరు తినకూడని కూరగాయలు ఇవే