Yoga at Desk : డెస్క్ వర్క్ చేసేవారు చేయగలిగే యోగాసనాలు ఇవే.. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆఫీస్‌లో ట్రై చేయండి
Seated Yoga Poses : డెస్క్ వర్క్ చేసేవారు ఒత్తిడిని, ఇతర ఆరోగ్య సమస్యలను తగ్గించుకునేందుకు కూర్చొని చేయగలిగే కొన్ని యోగాసనాలు ఉన్నాయి. అవేంటో.. వాటివల్ల కలిగే లాభాలేంటో చూసేద్దాం.

Best Yoga Asanas to Do in the Office for Health : ఆఫీస్‌లో డెస్క్ ముందు గంటల తరబడి కూర్చొనే జాబ్స్‌తో ఆరోగ్యానికి ఎన్నో నష్టాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఒత్తిడి సమస్య తీవ్రంగా ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా జాబ్లే చాలామంది చేస్తున్నారని.. వారిలో ఎక్కువమంది శారీరక, మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండేందుకు యోగాను రొటీన్లో చేర్చుకోవాలంటున్నారు.
డెస్క్ దగ్గర వర్క్ చేస్తూనే.. కొన్ని యోగాసనాలు చేస్తే ఒత్తిడి తగ్గుతుందని సూచిస్తున్నారు యోగా నిపుణులు. ముఖ్యంగా కొన్ని స్ట్రెచ్‌లు చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని.. ఒత్తిడి తగ్గి పనిపై ఫోకస్ చేయగలుగుతారని చెప్తున్నారు. ఇంతకీ ఆ ఆసనాలు ఏంటి? వాటివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.
మార్జరాయసన (Seated Cat-Cow Stretch)
మార్జరాయసనను డెస్క్ దగ్గర కూర్చొని కూడా ఈ ఆసనం చేయవచ్చు. చైర్లో నిటారుగా కూర్చొని చేతులు మోకాళ్లపై ఉంచాలి.. ఇప్పుడు గాలి పీల్చుకుంటూ మీ వీపును వెనక్కి బెండ్ చేయాలి. గాలిని వదులుతూ వీపును ముందుకు బెండ్ చేస్తూ మీ గడ్డాన్ని ఛాతి భాగానికి తాకించాలి. ఈ ఆసనం రెగ్యులర్‌గా చేస్తే మెడ పట్టేయకుండా, నడుము నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటుంది. అలాగే మెడ దగ్గర ఉండే ఒత్తిడి కూడా తగ్గుతుంది.
నెక్ రోల్స్ (Neck Rolls)
నెక్ రోల్స్ చేయడానికి కూర్చీలో నిటారుగా కూర్చోవాలి. మీ మెడను షోల్డర్ నుంచి షోల్డర్‌కు వృత్తాకార దశలో తిప్పాలి. ఈ ఆసనం వల్ల ఒత్తిడితో పాటు మెడపై పడే స్ట్రెస్ కూడా తగ్గుతుంది. అలాగే భంగిమ కూడా పర్ఫెక్ట్ అవుతుంది.
షోల్డర్ రోల్స్(Shoulder Rolls)
మీ భుజాలను చాచి ముందుకు, వెనక్కి తిప్పడం లేదా చిన్నగా వృత్తాకార రూపంలో తిప్పడం చేయాలి. ఇలా చేయడం వల్ల భుజాలు దగ్గర ఒత్తిడి విడుదల అవుతుంది. కండరాలకు మంచి జరుగుతుంది.
పశ్చిమోత్తాసన (Seated Forward Bend)
కూర్చొని పాదాలు నేలకు ఆనించాలి. ఇప్పుడు గాలి పీల్చుకుంటూ మీ చేతులను పైకి ఎత్తాలి. అనంతరం గాలిని వదులు.. ముందుకు వంగి.. చేతులతో మీ పాదాలను లేదా నేల పట్టుకోవాలి. ఈ ఆసనం రెగ్యులర్‌గా చేయడం వల్ల నడుము కండరాలు బలపడతాయి. అంతేకాకుండా బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. ఒత్తిడి దూరమవుతుంది.
అర్థ మత్స్యేంద్రాసనం (Seated Spinal Twist)
కుర్చీలో కూర్చోని రెండు చేతులతో బ్యాక్‌రెస్ట్‌ను పట్టుకోవాలి. ఇప్పుడు శరీరాన్ని సున్నితంగా తిప్పాలి. ఇలా రెండు వైపులా చేస్తూ ఉండాలి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గుతుంది.
ఇవేకాకుండా ప్రాణాయామ చేస్తూ ఉంటే మంచిది. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఫోకస్ పెరుగుతుంది. ఎనర్జిటిక్‌గా ఉంటారు. అలాగే రోజూ యోగా చేయడం వల్ల కూడా శరీరంలో ఫ్లెక్సీబులిటీ పెరుగుతుంది. మానసికంగా, శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.






















