Prawns Pakoda: క్రిస్పీ క్రిస్పీగా రొయ్యల పకోడీ, సింపుల్ రెసిపీ ఇదిగో
రొయ్యలంటే ఇష్టపడే వారి కోసమే ఈ రెసిపీ. తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.
నాన్ వెజ్ ప్రియులకు రొయ్యల పేరు చెబితే చాలు నోరూరిపోతుంది. అలాంటి వారికి రొయ్య పకోడీ చాలా నచ్చుతుంది. దీన్ని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చికెన్ పకోడీలాగే రొయ్య పకోడీ కూడా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు
రొయ్యలు - అరకిలో
కారం - ఒక టీస్పూను
బియ్యం పిండి - రెండు టీస్పూన్లు
పసుపు - అర టీస్పూను
సెనగపిండి - పావు కప్పు
కరివేపాకు - రెండు రెమ్మలు
ఉప్పు రుచికి సరిపడా
నూనె - సరిపడా
మొక్కజొన్న పిండి - రెండు స్పూన్లు
తయారీ ఇలా
1. రొయ్యలు బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. చిన్న రొయ్యలైతే అలాగే ఉంచుకోవచ్చు. పెద్దవైతే ఒక రొయ్యని రెండు మూడు ముక్కలుగా చేస్తే పకోడీ బాగా వస్తుంది. రొయ్య కూడా బాగా ఉడుకుతుంది.
2. ఇప్పుడు ఒక గిన్నెలో సెనగపిండి, బియ్యం పిండి, కారం, పసుపు, ఉప్పు కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి.
3. కొంచెం నీరు చేర్చాలి. మరీ ఎక్కువేస్తే జావలా అయి పకోడీ వేయలేరు.
4. ఇప్పుడు ఆ పిండిలో తరిగిన రొయ్యలు వేసి బాగా కలపాలి. కరివేపాకులు కూడా వేయాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసి వేడి చేయాలి.
6. నూనె బాగా వేడెక్కాక పిండిని పకోడీల్లా వేసుకోవాలి.
7. బంగారు వర్ణంలోకి వేగాక తీసి ప్లేటులో వేసుకోవాలి. ఇవి క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి.
రొయ్యలు సముద్రపు ఆహారం. ఇవి చాలా బలవర్ధకమైనవి. ఇందులో ఉండే పోషకాలు మానవ శరీరానికి చాలా ముఖ్యమైనవి. ఇందులో సెలీనియం అనే పదార్థం ఉంటుంది. ఇది క్యాన్సర్ వంటి రోగాల నుంచి కాపాడుతుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా సెలీనియం అడ్డుకుంటుంది. వీటిలో ఉండే కాల్షియం దంతాలు, ఎముకలు బలంగా ఉండేందుకు సహకరిస్తుంది. అదనపు బరువు తగ్గేందుకు కూడా ఇవి సహకరిస్తాయి. రొయ్యలు తింటే పెద్దగా బరువు పెరగరు. దీనిలో గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
వీటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రొయ్యలు తినడం వల్ల విటమిన్ డి లోపం తగ్గుతుంది. రొయ్యల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. మచ్చలు, ముడతలు రాకుండా అడ్డుకుంటాయి. వయసు సంబంద చర్మ సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. రొయ్యలు తినడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. వెంట్రుకలు ఊడిపోయే సమస్య నుంచి బయటపడవచ్చు. మెదడుకు కూడా రొయ్యల్లోని పోషకాలు అత్యవసరం. గ్రహణ శక్తి, ఏకాగ్రతలను పెంచుతుంది. చదువుకునే పిల్లలకు వారానికి కనీసం రెండు సార్లు వీటిని తినిపిస్తే చాలా మంచిది. వారికి మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది.
Also read: నాన్ వెజిటేరియన్లకు హ్యాపీ న్యూస్, డిప్రెషన్‌కు అధికంగా గురయ్యేది ఈ ఆహారం తినేవారేనట
Also read: చిన్న చిన్న విషయాలకే మీకు ఏడుపొస్తుందా? తప్పేం లేదు ఏడ్చేయండి, మీకే లాభం