చిన్న చిన్న విషయాలకే మీకు ఏడుపొస్తుందా? తప్పేం లేదు ఏడ్చేయండి, మీకే లాభం
ఏడుపు వల్ల మానసికంగా కలిగే లాభాలే కాదు, శరీరంలోని కొన్ని అవయవాలకు కూడా చాలా మేలు చేస్తుంది.
ఏడ్వడం పెద్ద తప్పులా భావించకండి. ఆకలేసినప్పుడు తిన్నట్టే, ఏడుపొచ్చినప్పుడు ఏడ్చేయండి. ఏడుపొస్తున్నా ఆపుకుని సాధించేదేం లేదు, అనారోగ్యం తప్ప. అదే మనస్పూర్తిగా ఏడ్చేస్తే శరీరంలోని కొన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా మానసిక ప్రశాంతత దక్కుతుంది. కొందరికి ఇట్టే ఏడుపొస్తుంది, చిన్న చిన్న విషయాలకే కంట నీరు పెట్టేసుకుంటారు. వాళ్లకి క్రై బేబీ అని నిక్ నేమ్‌లు పెడతారు కొంతమంది. నిజానికి వాళ్లే మానసికంగా హ్యాపీగా, ప్రశాంతంగా ఉంటారు. ఏడుపు ద్వారా ఒత్తిడంతా బయటికి పోతుంది. మానసికంగా తేలిక పడతారు. సంతోషంగా ఉంటారు. అలాగే ఎవరికైనా ఏడుపొస్తే ఏడ్చేయడం చాలా ముఖ్యం. ఏడ్వడం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇవిగో...
నరాలకు ఆరోగ్యం
ఏడుపు నాడీ వ్యవస్థపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. చాలా ఓదార్పును ఇస్తుంది. ఇది శరీరం, మనసుకు విశ్రాంతిని అందిస్తుంది. తనివి తీరా ఏడ్చాక చాలా మందికి మనసు తేలిక పడుతుంది. కన్నీళ్లు నరాలు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. మానసిక స్థితిని మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
చూపుకు మంచిది
కనురెప్పలు కొట్టుకోవడం ఎంత ముఖ్యమో, కన్నీళ్లు కార్చడం అంతే ముఖ్యం. కళ్లలో పడ్డ దుమ్ము ధూళి, కణాలను వదిలించుకోవడానికి ఏడుపు మంచి మార్గం. కళ్లు తేమగా ఉండడం చాలా ముఖ్యం. అందుకే ఏడుపు అవసరం. ఏడ్వడం వల్ల ‘డ్రై ఐ సిండ్రోమ్’ (పొడి కళ్ల సమస్య) రాకుండా అడ్డుకోవచ్చు. చూపు స్పష్టంగా ఉండేలా చూస్తుంది.
ఒత్తిడి తగ్గుతుంది
ఏడుపు భావోద్వేగాలు అనేవి మన ఆరోగ్యం కోసం ఇచ్చినవే. శరీరంలో ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్లు విడుదలవ్వడం వల్ల శారీరక నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఏడ్వడం పూర్తయ్యాక మీకు తేలికగా అనిపించేంది ఈ హార్మన్లు విడుదలవ్వడం వల్లే. ఏడుపు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కంటి శుభ్రత
కళ్లను శుభ్రపరచడంలో ఏడుపు ముందుంటుంది. కళ్లల్లో ఎలాంటి టాక్సిన్లు లేకుండా ఇది చేస్తుంది. అలాగే బ్యాక్టిరియాను చంపే లైసోజైమ్ అనే ద్రవాన్ని విడుదల చేస్తుంది.
కాబట్టి ఏడుపు అనేది శారీరక, మానసిక ఆరోగ్యాలకు చాలా ముఖ్యం. అందుకే ఏడుపు వచ్చినప్పుడల్లా మనస్పూర్తిగా ఏడ్చేయండి. మగవారైనా, ఆడవారైనా ఏడుపును ఆపుకోవడం వల్ల నష్టాలే తప్ప ఆరోగ్య లాభాలు ఏమీ లేవు.
Also read: గర్భం ధరించాక వీటిని తినకపోవడమే ఉత్తమం, తెలియక తినేసేవాళ్లే ఎక్కువ
Also read: గుండెపోటు వచ్చిన తరువాత ఆ వ్యక్తికి ఎలాంటి ఆహారాన్ని పెట్టాలి?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.