Covid-19: తీపి తినకుండానే మీకు డయాబెటిస్ వచ్చేసిందా? కారణం.. కరోనా అంటే నమ్ముతారా? ఇదిగో కొత్త ముప్పు!
కోవిడ్-19 సోకిన వారికి డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. కరోనా టీకా వేసుకున్న వారిలో ఈ ముప్పు అంతగా లేదని తేలింది.
కోవిడ్-19 ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. 2020లో ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలో మొదలైన ఈ మహమ్మారి ప్రపంచాన్ని చావు దెబ్బకొట్టింది. అమెరికా లాంటి అగ్రదేశాల్లోనూ కరోనా మరణ మృదంగం మోగించింది. కరోనా ఫస్ట్ వేవ్ తో పాటు సెకెండ్ వేవ్ లోనూ ఎంతో మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత కరోనా వ్యాక్సీన్ రావడంతో నెమ్మదిగా వైరస్ తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు కరోనా వైరస్ పేరు వినిపించడం లేదు. కానీ, కరోనా సోకిన వారిలో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి.
కరోనా సోకిన వారికి డయాబెటిస్ ముప్పు
కరోనా సోకిన వారికి డయాబెటిస్ ముప్పు అధికంగా ఉందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. కోవిడ్-19 నిర్ధారణ తర్వాత టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. కరోనా వైరస్‌తో ఆసుపత్రిలో చేరిన వారిలో చాలా మందికి డయాబెటిస్ వచ్చినట్లు వెల్లడించారు. అయితే, కోవిడ్-19 టీకాలు తీసుకున్న వ్యక్తులలో ఈ ప్రమాదం చాలా తక్కువగా కనిపిస్తుందని పరిశోధకులు గుర్తించారు.
లండన్ పరిశోధకుల స్టడీలో కీలక విషయాలు వెల్లడి
ఇంగ్లాండ్ లో కోవిడ్-19 సోకిన వారిపై కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకులు అధ్యయం నిర్వహించారు. కరోనా వచ్చిన 18 ఏండ్ల వ్యక్తుల నుంచి 110 సంవత్సరాల మధ్య వయస్సు గల 16 మిలియన్ల మందిపై ఈ స్టడీ కొనసాగించారు. కోవిడ్-19 టీకాలు అందుబాటులోకి రాకముందు కరోనా బారిన పడిన వ్యక్తులలో మొదటి నాలుగు వారాల్లో టైప్ 2 మధుమేహం సోకే ప్రమాదం నాలుగు రెట్లు పెరిగినట్లు గుర్తించారు. కరోనా సోకిన రోగుల్లో మధుమేహం, గుండె జబ్బుల ముప్పు అధికంగా ఉందని ఈ అధ్యయనం వెల్లడించింది. ఇన్ఫెక్షన్ సోకిన 23 వారాల తర్వాత మధుమేహ స్థాయిలు తగ్గుముఖం పట్టగా, ఏడు వారాల్లో గుండె సంబంధ వ్యాధుల ముప్పు తగ్గుతున్నట్లు పరిశోధకులు తెలిపారు.
కరోనా వైరస్ సోకిన వారిలో దీర్ఘకాల ఆరోగ్య ప్రభావాలు ఉంటాయని తాజా అధ్యయనం తేల్చింది. కొవిడ్-19 వచ్చిన 12 వారాల్లో మధుమేహ స్ధాయిలు పెరిగాయని, ఆ తర్వాత క్రమంగా మధుమేహం కేసులు అదుపులోకి వచ్చాని పరిశోధకులు తెలిపారు. కొవిడ్-19తో బాధపడిన వారిలో ముందే డయాబెటిస్, గుండె జబ్బులు ఉంటే వారి ప్రమాదం మరింత పెరిగినట్లు తేలిందన్నారు. ఒకవేళ లేకుంటే వారిలో ఈ పరిస్థితి దీర్ఘకాలంలో పెరిగే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు వెల్లడైందన్నారు. కరోనా వైరస్ కారణంగా గుండె సంబంధ సమస్యలు ఆరు రెట్లు పెరిగినట్లు తెలిపారు. లంగ్స్ లో బ్లడ్ క్లాట్స్, హృదయ స్పందనలో మార్పుల కారణంగా గుండె సంబంధ ముప్పు పెరిగినట్టు వెల్లడించారు. ఇన్ఫెక్షన్ సోకిన 5 వారాల తర్వాత గుండె సంబంధ ముప్పులు తగ్గి 12 వారాల నుంచి ఏడాది లోపు ఏడాదికి సాధారణ స్ధితికి చేరుకున్నట్టు తెలిపారు. డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించేందుకు కొవిడ్-19 సోకిన రోగులకు కనీసం 3 నుంచి 4 నెలల వరకూ ప్రత్యేక శ్రద్ధ అవసరం అని పరిశోధకులు వెల్లడించారు.
Also Read : డిజిటల్ యుగం.. ప్రమాదంలో పిల్లల ‘నిద్ర’ - ఈ పాపం పెద్దవాళ్లదే!