New Research on Alcohol: విమానంలో ఆల్కహాల్ తాగుతున్నారా? జరిగేది ఇదే.. జర భద్రం!
New Research on Alcohol: విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మద్యం సేవిస్తే తీవ్రమైన గుండె సమస్యలు తప్పవని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది.
Alcohol in Flight: మీరు తరచుగా విమాన ప్రయాణాలు చేస్తుంటారా? అయితే, మీరు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవల్సిందే. విమానాల్లో ప్రయాణించేవారికి ఫుడ్ నుంచి టీ, కాఫీ.. ఆల్కహాల్ వరకు ఏది కావాలన్నా దొరుకుతుంది. కొన్నివిమానయాన సంస్థలు వీటిని ఉచితంగా ఇస్తుంటే.. మరికొన్ని డబ్బులు వసూళ్లు చేస్తున్నాయి. ఒక వేళ మీరు విమానంలో ఆల్కహాలు తీసుకుంటున్నట్లయితే.. తప్పకుండా ఈ తాజా స్టడీ గురించి తెలుసుకోవల్సిందే.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక విమానయాన సంస్థలు విమానాల్లో ఆల్కహాలిక్ డ్రింక్స్ ను అందిస్తాయి. అయితే విమాన ప్రయాణంలో ఆల్కహాల్ సేవించడం ఆరోగ్యానికి ప్రమాదకరమని కొత్త అధ్యయనంలో తేలింది. సుదీర్ఘ విమాన ప్రయాణంలో ఆల్కహాల్ సేవించి.. నిద్రపోతే గుండెకు హాని కలుగుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది.
ఎందుకు ఆల్కహాల్ తాగకూడదు?
థొరాక్స్ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో.. ఫ్లైట్ జర్నీలో మద్యం సేవించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని తేలింది. వాస్తవానికి, విమానంలో గాలి పీడనం తగ్గుతుంది. అలాంటి స్థితిలో, మద్యం సేవించిన తర్వాత నిద్రించడం వల్ల వ్యక్తి రక్తంలో ఆక్సిజన్ పరిమాణం కూడా తగ్గుతుంది. దీంతో వారి గుండె చప్పుడు పెరగడంతో పాటు గుండెపై భారం పడుతుంది. హైపోబారిక్ స్థితిలో ఆల్కహాల్ తాగిన తర్వాత నిద్రపోవడం కార్డియాక్ సిస్టమ్‌పై చాలా ఒత్తిడిని కలిగిస్తుందని అధ్యయనంలో పేర్కొన్నారు. దీని కారణంగా గుండె, పల్మనరీ వ్యాధి రోగులు చాలా సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. రోగులే కాకుండా ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఆల్కహాల్ సేవిస్తే గుండె ఆరోగ్యానికి హాని కలుగుతుందని అధ్యయనం పేర్కొంది.
ఎవరికి ఎక్కువ హానికరం?
విమాన ప్రయాణంలో అతిగా మద్యం సేవించడం వల్ల ఒక్కసారిగా ఆరోగ్యం పాడవుతుందని పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా వృద్ధులకు, ఇప్పటికే అనేక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి అలాంటి వారు విమాన ప్రయాణ సమయంలో మద్యం సేవించకూడదని సూచిస్తున్నారు. పరిమితి మేరకు మాత్రమే మద్యం తాగాలని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో, పరిశోధకులు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల 48 మంది ఆరోగ్యవంతులపై టెస్టు చేశారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులోని వ్యక్తులు నేలపై కూర్చొని మద్యం సేవించగా, రెండో గ్రూపులోని వ్యక్తులు విమాన ప్రయాణంలో మద్యం సేవించారు.
పరిశోధన ఫలితాలు - నింగి.. నేలకు తేడాలివే!
నిద్రపోయే ముందు విమానంలో ఆల్కహాల్ సేవించిన వారి రక్తంలో ఆక్సిజన్ 85 శాతం కంటే తక్కువగా పడిపోయింది. వారి గుండె కొట్టుకోవడం నిమిషానికి సగటున 88 బీట్‌లకు పెరిగిందని అధ్యయనం వెల్లడించింది. అయితే నేలపై ఆల్కహాల్ తాగిన వారి రక్తంలో ఆక్సిజన్ 95 శాతానికి పెరిగింది. వారి గుండె కొట్టుకోవడం నిమిషానికి 77 బీట్‌లకు పెరిగింది. అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, ఆరోగ్యవంతమైన వ్యక్తులు సాధారణంగా 95శాతం నుంచి 100 శాతం వరకు ఆక్సిజన్ సంతృప్తతను కలిగి ఉంటారు. 90 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ సంతృప్తత ఆందోళన కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది గుండె దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుందని వెల్లడించారు.
Also Read : డయేరియా డేంజర్ బెల్స్.. ఈ లక్షణాలు గుర్తిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి.. లేదంటే కష్టమే