Virus from Animals: జంతువుల్లో వచ్చే రోగాలు ఇకపై మనుషులకు, స్టడిలో షాకింగ్ విషయాలు వెల్లడి
‘కోవిడ్’ మాత్రమే కాదూ ఇంకా చాలా వైరస్‌లు క్యూలో ఉన్నాయట. దీని కారణం మానవుడి తప్పిదాలే. ఆ వైరస్‌లకు ఇండియా కూడా ఒక హాట్‌స్పాట్ అని అధ్యయనంలో పేర్కొన్నారు.
Viruses From Animals | ఇప్పటికే మనం గబ్బిలాల నుంచి మనుషులకు సోకిందని భావిస్తున్న ‘కోవిడ్-19’ వైరస్‌తో ముప్పుతిప్పలు పడుతున్నాం. ఇక భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని వైరస్‌లతో పోరాడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో మనం జంతువులను తప్పుబట్టలేం. ఎందుకంటే.. మనిషి చేసే తప్పిదాల ఫలితంగానే ఈ సమస్య మానవళికి శాపంగా మారనుంది. అదెలా అనుకుంటున్నారా? అయితే, మీరు ఈ తాజా స్టడీ గురించి తెలుసుకోవల్సిందే.
జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు జరిపిన అధ్యయనంలో ఓ షాకింగ్ విషయం తెలిసింది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో క్రాస్-స్పీసీస్ ట్రాన్స్‌మిషన్ (జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే కీటకాలు) పెరుగుతాయని స్టడీలో పేర్కొన్నారు. ఇందుకు ప్రధాన కారణం వాతావరణ మార్పులు. రానున్న దశాబ్దంలో జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధులతో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Also Read: మగాళ్లు జాగ్రత్త! మొబైల్ అతిగా వాడితే ‘అది’ మటాష్, షాకింగ్ న్యూస్ చెప్పిన నిపుణులు
ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో జంతువుల నుంచి మనుషులకు సోకే వైరస్‌లు త్వరలో కనిపించవచ్చని ఈ అధ్యయనం వెల్లడించింది. గ్లోబల్ వార్మింగ్ ఇలాగే పెరిగితే రానున్న రోజుల్లో వ్యాధుల నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కోవల్సి వస్తుంది. 2070 నాటికి ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే కనీసం 15,000 కొత్త వైరల్ ఇన్‌ఫెక్షన్‌లు జంతువుల నుంచి మానవులకు బదిలీ అవుతాయని అంచనా నిపుణులు అంచనా వేశారు.
Also Read: ఫోన్ మాట్లాడుతూ లోకం మరిచింది, రెప్పపాటులో ప్రమాదం - ఇదిగో వీడియో
పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా, మారుతున్న వాతావరణాలకు అనుగుణంగా గబ్బిలాలు వంటి క్షీరద జాతులు తమ ప్రదేశంలో భౌగోళిక మార్పును చూస్తాయని అధ్యయనం పేర్కొంది. అంటే ఈ జంతువులు ప్రమాదకర పరాన్నజీవులను కొత్త ప్రాంతాలకు తీసుకెళ్తాయి. ‘‘ఎత్తైన ప్రదేశాలు, జీవవైవిధ్య ప్రాంతాలు, ఆసియా, ఆఫ్రికాలో అధిక జనాభా కలిగిన ప్రాంతాల్లో సుమారు 4 వేల రెట్లు వైరస్‌ల వ్యాప్తి ఉంటుంది’’ అని తెలిపారు. ఆఫ్రికాలోని సాహెల్, ఇథియోపియన్ వంటి ఎత్తైన ప్రాంతాలు, ఇండియా, తూర్పు చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో మొదటిసారిగా మానవులకు ఈ వైరస్‌లు సోకే ప్రమాదం ఉందని వెల్లడించారు. వైరస్ వ్యాప్తికి ఆయా ప్రాంతాలు హాట్ స్పాట్లు కావచ్చని పేర్కొన్నారు. కాబట్టి, అలాంటి వ్యాధులను మన ముందు తరాలకు వెళ్లకుండా మనవంతు ప్రయత్నం చేయాలి. అడవులను కాపాడాలి. పర్యావరణాన్ని పరిరక్షించాలి. అప్పుడే మనమంతా సేఫ్.. లేకపోతే ‘కోవిడ్’ కంటే మరిన్ని ప్రమాదకర వైరస్‌లను ఎదుర్కోవలసి వస్తుంది.