Christmas Special Cake Recipe : క్రిస్మస్ స్పెషల్ డార్క్ చాక్లెట్ హాజెల్ నట్ కేక్.. టేస్టీ రెసిపీ ఇదే
Dark Chocolate Hazelnut Cake Recipe: క్రిస్మస్ సమయంలో స్వీట్స్ కన్నా.. కేక్స్కే డిమాండ్ ఎక్కువ. దానిని బయట కొనకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసేయండి.
Christmas Cake Recipe : క్రిస్మస్ కేక్ అంటే ఓ ప్రత్యేకమైన ఫీల్ ఉంటుంది. అందుకే చాలా హోటల్స్ కేక్ మిక్సింగ్ కోసం ప్రముఖలను ఆహ్వానించి మరీ.. క్రిస్మస్ వైబ్స్ పెంచుతారు. అలాగే చాలామంది ఇళ్లల్లో కేక్స్ కట్ చేస్తారు. కేవలం క్రిస్మస్ అనే కాదు.. న్యూ ఇయర్లో కూడా కేక్స్‌కి మంచి గిరాకీ ఉంటుంది. అయితే బయటి కేక్స్ తెచ్చుకోవడం ఇష్టం లేనివారు ఇంట్లోనే టేస్టీ కేక్ తయారు చేసుకోవచ్చు.
డార్క్ చాక్లెట్ హాజెల్ నట్ కేక్. పేరు వింటుంటేనే నోరు ఊరిపోతుంది కదా. కేక్స్ రుచిగా ఉంటాయనుకంటే.. డార్క్ చాక్లెట్ కేక్ మరింత రుచిగా ఉంటుంది. హాజెల్ నట్ క్రంచీగా నోటికి తగులుతుంటే ఈ రుచి మరింత రెట్టింపు అవుతుంది. పైగా చాక్లెట్ కంటే.. డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ క్రిస్మస్కి ఈ స్పెషల్ టేస్టీ కేక్ రెసిపీతో ట్రీట్ ఇచ్చేయండి. దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
డార్క్ చాక్లెట్ - 85 గ్రాములు
బటర్ - 85 గ్రాములు
గోధుమ పిండి - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - చిటికెడు
గుడ్లు - 2
చక్కెర - 75 గ్రాములు
వెనిలా ఎసెన్స్ - అర స్పూన్
హాజెల్ నట్స్ - 3 టేబుల్ స్పూన్లు
టాపింగ్ కోసం
పంచదార - 200 గ్రాములు
నీళ్లు - 120 మి.లీ
హాజెల్ నట్స్ - 100 గ్రాములు
తయారీ విధానం
ఓవెన్‌ను 180 డిగ్రీలు వేడి చేయండి. ఆరు అంగుళాల కేక్ టిన్‌కు బటర్ రాసి రెడీ చేసుకోండి. ఇప్పుడు డబుల్ బాయిలర్‌లో చాక్లెట్, బటర్ వేసి కరిగించండి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండిలో సాల్ట్ వేసి కలిపి.. జల్లెడ పట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు గుడ్డలోని పచ్చసొన తీసుకుని దానిలో చక్కెర వేసి.. వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలపండి. అది క్రీమ్ మాదిరిగా మారేవరకు గిలకొట్టండి.
ఇప్పుడు మరో గిన్నె తీసుకుని దానిలో గుడ్డులోని తెల్లసొన వేసి బాగా కలపండి. దానిలో మిగిలిన చక్కెర వేసి కలపండి. అది గట్టిపడేవరకు మీరు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పిండి మిశ్రమాన్ని.. హాజెల్ నట్స్‌తో కలిపి.. చాక్లెట్ మిశ్రమాన్ని కూడా వేసి.. వెనీలా ఎసెన్స్‌తో కూడిన మిశ్రమంలో కలపండి. అన్ని పదార్థాలు బాగా మిక్స్ అయ్యేలా కలుపుతూనే ఉండండి. ఈ మిశ్రమాన్ని.. ముందుగా రెడీ చేసుకున్న కేక్ టిన్‌లో వేసి అరగంట బేక్ చేయండి. కేక్ ఉడికిన తర్వాత ఓవెన్ నుంచి తీసి.. డిమోల్డ్ చేయండి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టండి. దానిలో చక్కెర వేసి కరగనివ్వండి. అది తీగ పాకం అవుతున్న క్రమంలో రోస్ట్ చేసిన హాజెల్ నట్స్ వేయండి. ఇవి బంగారు గోధురంగులోకి మారిన తర్వాత డిమోల్డ్ చేసిన కేక్ మీద టాపింగ్ లేయర్ వేయండి. అంతే టేస్టీ, టేస్టీ డార్క్ చాక్లెట్ హాజెల్ నట్ కేక్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీ క్రిస్మస్ను ఈ కేక్‌తో సెలబ్రేట్ చేసుకోండి.
Also Read : పిల్లలకు నచ్చే ప్లమ్ పుడ్డింగ్.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేసేయండి