Karam Podi: చింత చిగురు కారం పొడి ఇలా చేసుకున్నారంటే రుచి అదిరిపోవడం ఖాయం
చింత చిగురుతో టేస్టీగా కారం పొడి చేసుకుంటే ఆ రుచే వేరు.
చింతచిగురు వంటకాలు చాలా టేస్టీగా ఉంటాయి. చింతచిగురు పప్పు రుచి మర్చిపోవడం చాలా కష్టం. చింతచిగురులో ఎన్నో పోషకాలు ఉంటాయి. చింతాకును తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. చింత చిగురు కారం పొడిని ఇడ్లీలో తింటే నోరూరిపోవడం ఖాయం.
కావాల్సిన పదార్థాలు
చింత చిగురు – ఒక కప్పు,
ఎండు మిర్చి - పన్నెండు
జీలకర్ర - ఒక స్పూను
ధనియాలు - రెండు స్పూన్లు
కరివేపాకులు - గుప్పెడు
వెల్లుల్లి రెబ్బలు - పది
నూనె - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ ఇలా
చింతచిగురును శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. వాటిని ఎర్రటి ఎండలో ఆరబెట్టాలి. చింతచిగురు ఎండిపోయాక స్టవ్ మీద కళాయి పెట్టి వేయించాలి. ఆ వేయించిన చింత చిగురును తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో జీలకర్ర, ధనియాలు వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఎండు మిర్చి వేసి వేయించాలి. కరివేపాకును కూడా వేయాలి. ఇప్పుడు మిక్సీలో వేయించిన చింత చిగురు, కరివేపాకులు,ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ పొడిని గిన్నెలో వేయాలి. దీన్ని గాలి చొరబడని సీసాలో వేసి దాచుకోవాలి. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. నెయ్యి వేసుకుంటే మరీ బావుంటుంది.
చింత చిగురులో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ఇవన్నీ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. చింత చిగురు తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. డయాబెటిస్ ఉన్న వారు చింత చిగురు తినడం చాలా ముఖ్యం. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కాబట్టి వారానికి రెండు సార్లు చింత చిగురుతో చేసిన వంటకాలు తినడం చాలా ముఖ్యం. చింత చిగురు తినడం వల్ల ఎముకలు గట్టిగా మారతాయి. గుండె జబ్బులను తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది. శరీరంలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తిని కూడా చింత చిగురు పెంచుతుంది. రక్త హీనత సమస్య ఉన్న వారు దీన్ని తినడం చాలా ముఖ్యం. పిల్లలు, మహిళల్లో రక్త హీనత సమస్య అధికంగా ఉంటుంది. కాబట్టి వీరు కచ్చితంగా చింత చిగురును తినాలి. మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా ఇవి ముందుంటాయి. కాబట్టి కచ్చితంగా చింత చిగురు తినాలి.
Also read: పుట్టగొడుగుల పండుగ, ఈ వేడుకలో నోరూరించే మష్రూమ్ వంటకాలను రుచి చూడొచ్చు
Also read: ప్రోటీన్ పౌడర్ రోజూ తీసుకుంటే మొటిమలు వచ్చే అవకాశం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.