Cataracts symptoms: షాకింగ్.. చిన్న వయస్సులోనే కంటిశుక్లాల ముప్పు - కాటరాక్ట్‌కు ముందు కనిపించే లక్షణాలివే
క్యాటరాక్ట్ అనగానే నిన్నమొన్నటి వరకు వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యగానే తెలుసు. కానీ మారిన జీవన పరిిస్థితులు ఇప్పుడు నడివయస్కులు, యువకుల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది. ఈ సమస్యకు గురించి అవగాహన కలిగి ఉండాలి
కంటి శుక్లాలు అంటే కాటరాక్ట్ (Cataract). సాధారణంగా ఇది పెద్ద వయసు వారికే వచ్చేది. కానీ, ఇప్పుడు రోజులు మారాయ్. చిన్న వయస్సులో కూడా ఈ సమస్య వస్తుందని, ముఖ్యంగా యంగ్ అడల్ట్స్‌లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యను త్వరగా గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా అవసరం. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం, చూపులో వస్తున్న మార్పులను గమనించడం వల్ల సమస్యను త్వరగా గుర్తించవచ్చు.
కంటి శుక్లాలు మామూలుగా 50 వయసు దాటిన తర్వాతే కనిపించే కంటి సమస్య. కానీ ఈ మధ్య కాలంలో యువకుల్లోనూ తరచుగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 50 సంవత్సరాల లోపు వారిలోనూ మిలియన్ల సంఖ్యలో ఈ సమస్య కనిపిస్తోందట. సమస్య ప్రారంభంలోనే గుర్తించడం, సకాలంలో చికిత్స తీసుకోవడం వల్ల దృష్టి లోపాలను సవరించుకోవచ్చు. జీవితనాణ్యతను కాపాడుకోవచ్చు.
కంటి శుక్లం అంటే?
కంటిలో ఉండే సహజమైన లెన్స్ మీద మబ్బులా ఒక పొర ఏర్పడుతుంది. ఇది సాధారణంగా వృద్ధుల్లో కనిపించే సమస్య. కానీ ఈ మధ్య రకరకాల కారణాలతో తక్కువ వయసులోనే కాటరాక్ట్ సమస్య బారిన పడుతున్నారు. ఈ పరిస్థితిని వీలైనంత త్వరగా సరిచేయకపోతే దృష్టి లోపాలు ఏర్పడుతాయి.
కారణాలు
- కంటి శుక్లాలకు సాధారణంగా జెనెటిక్స్ కారణం కావచ్చు. వంశ పారంపర్యంగా సంక్రమించవచ్చు.
- కంటికి తగిలే గాయల వల్ల కూడా కంటిలో శుక్లాలు ఏర్పడవచ్చు.
- అతినీలలోహిత కిరణాల ప్రభావానికి ఎక్కువ కాలం పాటు లోనయిన వారిలో కూడా కంటి శుక్లాల సమస్య రావచ్చు.
- కొన్ని రకాల మందులు వాడినపుడు వాటి దుష్ప్రభావంగా కూడా కంటి శుక్లాలు ఏర్పడవచ్చు.
- డయాబెటిస్ వంటి లైఫ్ స్టయిల్ వ్యాధుల వల్ల కంటిలో శుక్లాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
లక్షణాలు
- దృష్టి స్పష్టంగా లేకపోవడం, కంటి చూపు మసకగా మబ్బు పట్టినట్టుగా ఉంటుంది.
- ఎక్కువ ప్రకాశవంతమైన లైటు కంటికి ఇబ్బందిగానూ కొంత మందిలో నొప్పిగా నూ అనిపించవచ్చు.
- కాంతి చుట్టూ వలయాకారంలో హాలోస్ కనిపిస్తాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో ఇది మరింత స్పష్టంగా గుర్తించే వీలుంటుంది.
- తరచుగా కంటి అద్దాలు మార్చుకోవాల్సి వస్తుంది.
- రాత్రిపూట చూపు స్పష్టత తగ్గుతుంది.
వయసు పైబడిన వారిలో శుక్లాలకు సంబందించిన లక్షణాలు చాలా నెమ్మదిగా క్రమక్రమంగా వృద్ధి చెందుతాయి. కానీ యువకుల్లో అట్లా జరగదు. ఒక రోజు అకస్మాత్తుగా చూపులో మార్పు గమనిస్తారు. ఇక రోజువారీ జీవితంలో చూపు ఇబ్బందులు వేధిస్తాయి.
చికిత్స
కంటి శుక్లాల చికిత్సకు తప్పకుండా కంటికి సర్జరీ చెయ్యల్సి ఉంటుంది. మబ్బుపట్టిన కంటి లెన్స్‌ను తీసేసి దాని స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంట్రాకోక్యులర్ లెన్స్‌ను అమరుస్తారు. ఇదొక చిన్న సర్జరీ. దీనికి హాస్పిటల్ లో చేరాల్సిన అవసరం లేదు. ఇబ్బంది కూడా చాలా తక్కువగా ఉంటుంది. త్వరగా కోలుకుంటారు కూడా.
నివారించవచ్చా?
- కొద్దిపాటి జాగ్రత్తలతో ఈ సమస్యను నివారించడం సాధ్యమే.
- యూవీ కిరణాల నుంచి రక్షించుకునేందుకు సన్ గ్లాసెస్‌ను ధరించాలి.
- ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవాలి. యాంటీ ఆక్సడెంట్లు ఎక్కువ కలిగిన ఆహారం మీద దృష్టి సారించాలి.
- డయాబెటిస్ అదుపులో ఉంచుకోవాలి. అందుకు తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.
- సిగరెట్, ఆల్కహాల్ అలవాట్లు మానుకుంటే కంటి ఆరోగ్యం బాగుంటుంది.