Carrot Dosa: నోరూరించే క్యారెట్ దోశ, పిల్లలకు ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్
క్యారెట్ దోశె చేయడం చాలా సులువు. పిల్లలకు దీని రుచి చాలా నచ్చుతుంది.
పిల్లలకు ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ క్యారెట్ దోశె. కాస్త స్పైసీగా చేస్తే పెద్ద వారికి కూడా దీని రుచి బావుంటుంది. చేయడం చాలా సులువు. క్యారెట్లు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. దీనిలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. పిల్లల్లో ఏకాగ్రత పెంచేందుకు సహకరిస్తుంది.
కావాల్సిన పదార్థాలు
బియ్యం - ఒక కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
మినపప్పు - ఒక కప్పు
తురిమిన క్యారెట్ - ఒక కప్పు
కారం - ఒక టీస్పూను
జీలకర్ర - ఒక టీస్పూను
నూనె - సరిపడా
తయారీ ఇలా
1. బియ్యం, మినపప్పును నీటిలో నానబెట్టాలి. కనీసం నాలుగ్గంటలు నానబెట్టాలి.
2. బియ్యం, పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. ఆ పిండిని గిన్నెలో వేసి ఒక రాత్రంతా ఉంచాలి. ఇలా చేయడం వల్ల పిండి పులుస్తుంది.
3. మరుసటి రోజు ఉదయం అవసరం అయితే కాస్త నీళ్లు పోసి కలుపుకోవాలి. ఉప్పు వేసి కలపాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేసి క్యారెట్ వేసి వేయించాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టే, కారం, జీలకర్ర కూడా వేసి కలపాలి.
5. క్యారెట్ కాస్త వేగాక స్టవ్ కట్టేయాలి. చల్లారాక మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
6. ఆ మిశ్రమాన్ని దోశె పిండిలో వేసి బాగా కలిపేయాలి.
7. స్టవ్ పై పెనం పెట్టి, నూనె వేయాలి.
8. పిండిని దోశెలా పలుచగా వేసుకోవాలి. పైన నూనె చల్లుకోవాలి.
9. క్రిస్పీగా దోశెలు వస్తాయి. ఈ దోశెలు కొబ్బరి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
క్యారెట్లో బీటా కెరాటిన్ ఉంటుంది. ఇది కంటిచూపును కాపాడుతుంది. దీనిలో విటమిన్లు, కార్భైడ్స్ జుట్టును పొడిబారకుండా చేస్తాయి. క్యారెట్లో పొటాషియం ఉంటుంది. ఇది రక్తనాళాల్లో రక్తం సాఫీగా ప్రవహించేలా చేస్తుంది. దీని వల్ల అధిక రక్తపోటు రాదు. కాబట్టి గుండెకు ఎంతో ఆరోగ్యం. చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో క్యారెట్ ముందుంటుంది. రక్తహీనతను పొగొట్టే సత్తా క్యారెట్‌కుంది. అందుకే ప్రత్యేకంగా పిల్లలు, మహిళలు కచ్చితంగా క్యారెట్లను తినాలి.
క్యారెట్లో విటమిన్ ఎ తో పాటూ, పొటాషియం, బయోటిన్, విటమిన్ బి6, విటమిన్ కె వంటి పోషకాలు ఉంటాయి. శరీరానికి అత్యవసరమైనవి. క్యారెట్లను అధికంగా పండించే దేశం చైనా. దాదాపు 90 శాతం చైనాలోనే పండుతాయి. ఈ దేశం మిగతా దేశాలకు క్యారెట్లను ఎగుమతి చేస్తుంది.
Also read: నా భార్య రోజంతా టీవీ చూస్తూ నా చేతే పనులు చేయిస్తోంది, నాకేమో చెప్పే ధైర్యం లేదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.