ఆ పానీయాలతో క్యాన్సర్ వచ్చే అవకాశం - ఎందుకొస్తుందో వివరించిన అధ్యయనం
మనం తీసుకునే ఆహారాల వల్లే శరీరం రోగాల బారిన పడుతుంది.
క్యాన్సర్ ఒక్కసారి వచ్చిందా జీవితాంతం వేధిస్తుంది. దీనికి చేసే చికిత్స కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి పుండు మానిపోయినప్పటికీ మళ్లీ రీలాప్స్ అవుతాయి. క్యాన్సర్ చికిత్సకు అయ్యే ఖర్చు కూడా అధికమే. అందుకే క్యాన్సర్‌కు కారణమయ్యే అలవాట్లను, ఆహారాన్ని దూరం పెట్టాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక కొత్త అధ్యయనంలో మద్యపానం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని తేలింది. అది కూడా అన్ని రకాల మద్యాల వల్ల కూడా వస్తుందని, కొన్నింటి వల్ల రాదు అనేది అపోహేనని చెప్పింది.
వైన్‌తో సహా అన్ని రకాల ఆల్కహాలిక్ పానీయాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి, కానీ ప్రజలకు ఈ అంశంపై అవగాహన లేదు... అని వివరించింది అధ్యయనం. మితంగా తాగడం వల్ల కొన్ని రకాల మద్య పానీయల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కానీ, అతిగా తాగితే ఆ ప్రయోజనాలేవీ దక్కవని, పైగా భవిష్యత్తుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచేస్తాయని చెబుతోంది అధ్యయనం.
వైన్, బీర్, మద్యం వంటి వాటిలో ఇథనాల్ ఉంటుంది, ఇలా ఇథనాల్ కలిగిన అన్ని రకాల పానీయాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
ఎలాంటి క్యాన్సర్లు?
మద్యపానం అతిగా చేయడం వల్ల రొమ్ము, నోరు, పెద్దపేగు, కాలేయం సహా ఏడు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో కొన్ని రకాల క్యాన్సర్ కేసులు పెరగడానికి మద్యపానమే ప్రధాన కారకమని తేలింది. ఆల్కహాల్ - మద్యపానానికి మధ్య ఉన్న అనుబంధంపై ప్రజలకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అభిప్రయాపడ్డారు. క్యాన్సర్ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, మద్యపానీయాలు క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలియదని 50 శాతం కంటే ఎక్కువ మంది పెద్దలు చెప్పారు.
వైన్ కూడా...
చాలా మందికి వైన్ ఎంతో ఆరోగ్యకరమని, ఎంతైనా తాగవచ్చని అనుకుంటారు. వైన్ మంచిదే, మితంగా తాగేవరకు. కానీ అతి అయితే అది కూడా అనర్థమే చేస్తుంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రజలుకు క్యాన్సర్‌కు, మద్యానికి ఉన్న అనుబంధంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. అధిక ఆల్కహాల్ వినయోగాన్ని తగ్గిస్తేనే క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. మద్య వినియోగం పెరిగితే క్యాన్సర్ కారణంగా కలిగే మరణాల శాతం పెరిగే అవకాశం ఉంటుందని అధ్యయన కర్తలు వివరించారు.
Also read: పాలక్ పనీర్ కాంబో చాలా ఫేమస్, కానీ ఆ కాంబినేషన్ తినకపోవడమే మంచిది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.