Brinjal: వంకాయ తరచూ తింటే గుండెపోటును అడ్డుకోవచ్చా?
వంకాయను వారంలో రెండు మూడుసార్లు తినే వారికి గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుంది.
వంకాయ అంటేనే ముఖం మాడ్చుకునే వాళ్ళు ఎంతోమంది. వంకాయ కూరను చాలా తేలికగా తీసుకుంటారు. కానీ ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల కొన్ని రోగాలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మధుమేహం, గుండెపోటు, అధిక రక్తపోటు వంటివి దూరంగా ఉంటాయి. జీర్ణ సమస్యలు కూడా రావు. కాబట్టి వంకాయని వారంలో కనీసం రెండు నుంచి మూడుసార్లు తినడం అలవాటు చేసుకోండి. వంకాయతో ఎన్నో రకాల వంటకాలను చేసుకోవచ్చు. వంకాయ బిర్యానీ, వాంగీ బాత్, వంకాయ వేపుడు, వంకాయ టమోటా కర్రీ... ఇవన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయి.
వంకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి జీర్ణ క్రియ మెరుగ్గా జరుగుతుంది. అలాగే పొటాషియం, విటమిన్, ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. అలాగే రక్తపోటును అదుపులో ఉంచుతాయి. వంకాయ తింటే కొలెస్ట్రాల్ శరీరంలో చేరదు. ముఖ్యంగా దీనిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి మధుమేహం వ్యాధిగ్రస్తులు ఈ కూరని ఎంతైనా తినొచ్చు. పిల్లలకు కూడా వంకాయలు పెట్టడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దీనిలో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. చాలా సులభంగా అరిగిపోతుంది. కాబట్టి చిన్నపిల్లలకు వంకాయ కూరను తినిపిస్తే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా వంకాయ ఎంతో మేలు చేస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారు కచ్చితంగా వంకాయను చేర్చుకోవాలి. దీనిలో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఎనీమియా సమస్య తగ్గుతుంది. మెదడు పనితీరుకు సహాయపడే రసాయనాలు వంకాయలో పుష్కలంగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మానసిక ఆరోగ్యం కోసం వారానికి కనీసం మూడు సార్లు వంకాయతో వండిన ఆహారాలు తినడం అలవాటు చేసుకోండి.
దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి వంకాయ ఎంత తిన్నా కూడా బరువు పెరగరు. బరువు తగ్గాలనుకునే వారికి వంకాయ మంచి ఆప్షన్ అని గుర్తుపెట్టుకోండి. చాలామంది వంకాయ తినడం వల్ల దురద వస్తుందని తినడం మానేస్తారు. నిజానికి గాయాలు, ఇన్ఫెక్షన్లు తగ్గడంలో వంకాయ చాలా సహాయపడుతుంది. ఎందుకంటే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా గాయాన్ని త్వరగా మానిపోయేలా చేస్తాయి. కాబట్టి వంకాయను ఎప్పుడైనా తినవచ్చు. దురద వస్తుందని భయం పెట్టుకోవద్దు. పుండ్లు వచ్చినప్పుడు వంకాయలు తింటే అది త్వరగా మానిపోతుంది.
Also read: దంపుడు బియ్యంతో నిజంగానే బరువు తగ్గుతారా?
Also read: ఈ పండ్లు ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా తినండి, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.