Weight Loss: బరువు తగ్గాలా? ఈ ఆహారాలను కలిపి తీసుకోండి
బరువు తగ్గడానికి ఈ ఆహర పదార్థాల కాంబినేషన్ ట్రై చేసి చూడండి. అద్భుతమైన ఫలితాలు పొందుతారు.
చాలామంది బరువు తగ్గేందుకు అకస్మాత్తుగా తిండి మానేస్తారు. కానీ అది అపోహ మాత్రమే. బరువు తగ్గడానికి ఆహారాన్ని విలన్ గా భావించే బదులు సరైన ఆహార పదార్థాలు ఎంచుకుని తినడం మంచిది. అలా చెయ్యడం వల్ల మీరు బరువు తగ్గుతారు, హెల్తీగా కూడా ఉంటారు. ఎటువంటి ఆహారం తీసుకుంటే ఏం జరుగుతుంది? దాని ప్రభావం మన శరీరం మీద ఏ విధంగా ఉంటుందనే అవగాహన ఉంటే సరిపోతుంది. వాటితో పాటు వ్యాయామం కూడ చాలా అవసరం. దానివల్ల మరింత వేగంగా బరువు తగ్గుతారు.
కొన్ని ఆహార పదార్థాలను పానియాలతో కలిపి తీసుకోవడం వల్ల మీరు చురుగ్గా ఉంటారు. అలాగే బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. అల్పాహారంలో పండ్లు చేర్చుకోవడం ఉత్తమమైన ఎంపిక. అలాగే లంచ్, డిన్నర్ లో ఏం తినాలి దానికి కాంబినేషన్ గా ఏది తీసుకోవాలి అనే దాని మీద అవగాహన ఉండాలి? అలా చేస్తే మెరుగైన ఫలితాలను పొందుతారు.
అల్పాహారంలో గుడ్లు, బ్లాక్ కాఫీ
రోజును ప్రారంభించేటప్పుడు తీసుకునే ఆహరం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ ఆహార ప్రభావం రోజంతా మన మీద ఉంటుంది. అందుకే అల్పాహారంగా గుడ్లు ఎంచుకుంటే మంచిది. ఇది జీవక్రియని పెంచుతుంది. గుడ్లు జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం శక్తి తీసుకుంటుంది. అందువల్ల పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ మనకి వచ్చేలా చేస్తుంది. దీని వల్ల అతిగా తినే అవకాశం ఉండదు. గుడ్లుతో పాటు కాఫీ మంచి కాంబినేషన్. కొవ్వును కరిగించి బరువు తగ్గించడంలో కాఫీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే కాఫీలో పాలు, క్రీమ్ లేదా చక్కెర జోడించకుండా బ్లాక్ కాఫీ తీసుకోవడం మంచిది. గుడ్లు కూడా రుచిగా ఉండాలని చెప్పి చీజ్, వెన్న వంటి వాటిని జోడించకుండా తినాలి.
లంచ్ లో కాల్చిన చేపలు, గ్రీన్ టీ
గుడ్లు తరహాలోనే కాల్చిన చేపలు కూడా అరిగేందుకు ఎక్కువ సమయం తీసుకుంటాయి. గ్రీన్ టీ శక్తిని పెంచి బరువు తగ్గడానికి ప్రోత్సహిస్తుంది. వ్యాయామం చేసేటప్పుడు మీ పనితీరుని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వును కరిగించేందుకు సహాయపడతాయి. జీవక్రియను పెంచుతుంది.
స్నాక్స్ గా పెరుగు, బెర్రీస్, చల్లటి నీళ్ళు
పెరుగులో బెర్రీలు వంటి పండ్లు వేసి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీని ద్వారా ప్రోటీన్స్ పుష్కలంగా అందుతాయి. మంచి బ్యాక్టీరియాని వృద్ధి చేసి పేగులను శుద్ది చెయ్యడానికి సహాయపడుతుంది. బెర్రీలు ఫైబర్ ని అందిస్తాయి. శరీరాన్ని హైడ్రేట్ చెయ్యడానికి చల్లని నీటిని జత చేయాలి. దోసకాయ ముక్కలు లేదా పుదీనా ఆకులు నీటిలో జోడించడం వల్ల ఆ నీటికి రుచి వస్తుంది.
డిన్నర్ లో నట్స్, బీన్స్ సలాడ్ విత్ అల్లం టీ
నట్స్, సోడియం తక్కువగా ఉండే బ్లాక్ బీన్స్ తో చేసిన సలాడ్ లో ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. రాత్రి పూట ఇది తీసుకోవడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది. బ్లాక్ బీన్స్ లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియకి బాగా సహాయపడుతుంది. బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ సలాడ్ కి కాంబోగా అల్లం టీ మంచి ఎంపిక. అల్లం ఆకలిని తగ్గిస్తుంది. దీనివల్ల అతిగా తినడం కంట్రోల్ అవుతుంది.
Also Read: పిల్లలకి జలుబు చేసిందని నెబులైజర్ పెడుతున్నారా? అయితే జర జాగ్రత్త
Also read: అరటి పండ్లను రోజుకు ఎన్ని తింటే ఆరోగ్యమో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.