Mental Health with Probiotics: మంచి బ్యాక్టిరియాతో మెదడుకు సంబంధం... వాటి కోసం ఏం తినాలంటే...
గుండె, పొట్ట, పేగులు, ఊపిరితిత్తులు... ఇలా ప్రతి అవయవం మన మనుగడకు ఎంత ముఖ్యమో పొట్టలో కంటికి కనిపించని వ్యవస్థ కూడా అంతే ముఖ్యం. ఆ వ్యవస్థ పేరు మైక్రోబయోమ్.
మన శరీరంలో దాదాపు కోటి కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయని అంచనా. వాటిల్లో బ్యాక్టిరియాతో పాటూ ఫంగస్, వైరస్, ప్రోటోజోవా ఇలాంటివన్నీ ఉంటాయి. వీటిల్లో మంచి బ్యాక్టిరియా వ్యవస్థను మైక్రోబయోమ్ అంటారు. ఈ బ్యాక్టిరియా వల్లే మన జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. తాజాగా హార్వర్డ్ యూనివర్సిటి వారి అధ్యయనం మరొక కొత్త విషయం బయటిపడింది. దాని ప్రకారం మైక్రోబయోమ్ వ్యవస్థ మెదడుపై కూడా పరోక్షంగా ప్రభావం చూపిస్తుంది. మెదడు పనితీరును, ఆరోగ్యాన్ని మంచి బ్యాక్టిరియా మెరుగు పరుస్తుంది. ఈ మంచి బ్యాక్టిరియాని ‘ప్రో బయోటిక్స్’ అని కూడా పిలుస్తారు. కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా ప్రోబయోటిక్స్ ను శరీరానికి అందించవచ్చు.
ప్రో బయోటిక్స్ వల్ల ఉపయోగాలు
మనం తినే ఆహారంలోని విటమిన్లు, ఖనిజాలను శరీరం శోషించుకునేందుకు ప్రోబయోటిక్స్ సాయపడతాయి. అమినోయాసిడ్లను తయారు చేయడం కూడా వీటి ముఖ్య విధి. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఈ బ్యాక్టిరియా పాత్ర అధికం. అంతేకాదు పేగులు గోడలు ఆరోగ్యంగా, బలంగా ఉండేందుకు కూడా ఈ బ్యాక్టిరియా సహకరిస్తుంది.
పేగుల్లోని సూక్ష్మ జీవ వ్యవస్థలో జరిగే మార్పులు చాలా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయని ఇప్పటికే చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. మంచి బ్యాక్టిరియాల సంఖ్య తగ్గితే కడుపునొప్పి, అతిసారం వంటివి కలగవచ్చు.
ప్రోబయోటిక్స్ ను ఇలా పెంచుకోవచ్చు...
చిక్కుళ్లు, బీన్స్, అరటి పండ్లు, ఓట్స్, యాపిల్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. పెరుగును అధికంగా తింటే ప్రోబయోటిక్స్ పుష్కలంగా అందుతాయి. పులియబెట్టిన ఆహారపదార్థాలు తినడం వల్ల లాక్టోబాసిల్లీ అనే మంచి బ్యాక్టిరియా పెరిగి మేలు జరుగుతుంది. పాలిష్ చేయని బియ్యం, పప్పులు తినాలి. గ్రీన్ టీ, డార్క్ చాకోలెట్ కూడా మంచి బ్యాక్టిరియా పెరిగేందుకు సహకరిస్తాయి. చీజ్ లో కూడా ప్రోబయాటిక్స్ పుష్కలంగా ఉంటాయి. రోజూ కొద్దికొద్దిగా ఆహారంలో భాగం చేసుకుంటే చాలా మంచిది. ఊరబెట్టి చేసే పచ్చళ్లు, రాత్రంతా పులియబెట్టి చేసే ఇడ్లీ కూడా ప్రోబయాటిక్స్ ను అందిస్తాయి.
యాంటీ బయోటిక్ మందులను మరీ అత్యవసరమైతేనే తీసుకోవాలి. ఇవి శరీరంలోని చెడు వైరస్ తో పాటూ మంచి బ్యాక్టిరియాను కూడా నాశనం చేస్తుంది.
Also read: సరిగా వండని అన్నం తింటే క్యాన్సర్ ముప్పు... ఇలా వండితే సేఫ్
Also read: అక్కడ ఎవరినైనా విజిలేసి పిలుస్తారు... పేర్లు కూడా ఈల శబ్ధాలే...
Also read: పిల్లలకు రోజుకో అరస్పూను నెయ్యి తినిపించండి... మతిమరుపు దరిచేరదు