Recipes for Kids: తియ్యటి అరటిపండు అట్లు, పిల్లలకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ
పిల్లల కోసమే ప్రత్యేకమైన బ్రేక్ ఫాస్ట్ రెసిపీ ఇది.
దోశ, ఉప్మా, ఇడ్లీ... ఇవే టిఫిన్లు పిల్లలకు పెడుతుంటారు చాలా మంది తల్లులు. లేదంటే లెమన్ రైస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పిల్లలకు అవి తిని తిని బోరు కొట్టేసి ఉంటుంది. ఇలా అరటిపండు, గోధుమపిండి కలిపి అట్లు వేసి పెడితే వారు ఆనందంగా తింటారు. అంతేకాదు ఇందులో పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి కనుక శక్తిని కూడా ఇస్తాయి. చేయడం కూడా చాలా సులువు. దీన్ని ‘బనానా చీలా’ అని పిలుస్తారు ఉత్తర భారతీయులు. మనం అరటిపండ్లు అట్లు అని పిలుచుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు
అరటి పండ్లు - రెండు
గోధుమపిండి - ఒక కప్పు
పాలు - అరకప్పు
నెయ్యి - ఒక స్పూను
తేనె - రెండు స్పూనులు
తయారీ విధానం
1. పండిన అరటిపండ్లను వీటి కోసం ఎంచుకోవాలి.
2. మిక్సీలో అరటిపండ్ల ముక్కలు, పాలు వేసి మెత్తటి పేస్టులాగా చేసుకోవాలి.
3. ఒక గిన్నెలో ఈ మెత్తటి పేస్టును వేసి తేనె వేసి కలపాలి.
4. గోధుమపిండి కూడా వేసి బాగా కలపాలి.
5. అట్లులా పోసుకోవడానికి వీలుగా జారేలా వచ్చేలా గోధుమపిండిని కలుపుకోవాలి.
6. కావాలంటే పాలు లేదా నీళ్లు కలుపుకోవచ్చు.
7. ఇప్పుడు పెనంపై కాస్త నెయ్యి రాసి అట్లులా పోసుకోవాలి.
8. రెండు వైపులా బంగారు రంగు వర్ణంలోకి వచ్చేలా కాలాక తీసి పిల్లలకు పెట్టండి. ఈ అట్లు తీపిగా ఉంటాయి కనుక ఎలాంటి చట్నీలు కూడా అవసరం లేదు. పిల్లలు ఇష్టంగా తినేస్తారు.
పోషకాలెన్నో...
అరటిపండ్లు తినడం వల్ల పిల్లలకు ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి ఎముకలు, దంతాలు గట్టిగా మారతాయి. గుండె ఆరోగ్యానికి కూడా పొటాషియం చాలా అవసరం. ఈ పండులో విటమిన్ బి6, విటమిన్ సి, డైటరీ ఫైబర్ కూడా లభిస్తాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అధిక బీపీ ఉన్నవారికి అరటిపండ్లు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. అరటిపండు తినడం వల్ల చర్మానికి చాలా మేలు జరుగుతుంది.మెరుపు సంతరించుకుంటుంది. వెంటనే శక్తినివ్వడంలో అరటిపండు ముందుంటుంది. దీనిలో గోధుమ పిండి, పాలు, తేనె, నెయ్యి కూడా వాడతాం. వీటన్నింటి వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. తేనె వానాకాలంలో తినడం చాలా అవసరం. పాలు పిల్లలకు కాల్షియాన్ని అందిస్తాయి.
Also read: మీ పిల్లలు తొమ్మిది గంటలకన్నా తక్కువ నిద్రపోతున్నారా? ఈ నష్టాలు తప్పవంటున్న కొత్త అధ్యయనం
Also read: మీల్ మేకర్‌ను ఇలాగే తయారుచేస్తారు, తింటే ఎంతో ఆరోగ్యం