Breakfast: ఉదయం తినే అల్పాహారంలో ఇవి లేకుండా చూసుకోండి
ఉదయం తినే అల్పాహారం రోజంతా శక్తినిస్తుంది.
రోజంతా మనం తినే ఆహారంలో ఉదయం తినే బ్రేక్ ఫాస్ట్ అతి ముఖ్యమైనది. బ్రేక్ ఫాస్ట్‌లో ఏం తింటామో అది ఆ రోజు మొత్తం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అందుకే అల్పాహారాన్ని మానేయవద్దని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినమని చెబుతూ ఉంటారు పోషకాహార నిపుణులు. అల్పాహారంలో తినే ఆహారాన్ని బట్టి ఆరోజు మనం ఆనందంగా, ఉత్సాహంగా, చురుగ్గా ఉండే అవకాశం ఆధారపడి ఉంటుంది. అందుకే సరైన ఆహారాన్ని తీసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల రోజంతా మందకొడిగా పని చేసే అవకాశం ఉంది. అలాగే బరువు పెరిగే ఛాన్సులు కూడా ఉంటాయి. పోషకాలు లేని కొవ్వులు, చక్కెర, అధిక కార్బోహైడ్రేట్లు నిండిన ఆహారాలను తినడం వల్ల శక్తిహీనంగా అనిపిస్తుంది. రోజంతా నీరసంగా ఉంటారు. చక్కెర స్థాయిలను, అధిక రక్తపోటును పెంచే ఆహారాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆహారాలను తింటే ఆ రోజంతా ప్రశాంతంగా, ఆనందంగా సాగుతుంది. అల్పాహారంలో తినకూడని కొన్ని పదార్థాలు ఉన్నాయి. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు వాటిని బ్రేక్ ఫాస్ట్ లో తింటూ ఉంటారు.
ఖాళీ పొట్టతో ఉదయాన టీ, కాఫీలు తాగడం మానేయండి. ఇలా చేయడం వల్ల హార్మోన్ అసమతుల్యత వచ్చే అవకాశం ఉంది. కాఫీలో ఉండే కెఫిన్ శరీరంలో కార్టిసాల్ హార్మోన్ల స్థాయిలను పెంచుతుంది. కార్టిసాల్ అనేది ఒత్తిడిని కలిగించే హార్మోన్. ఇది అధికంగా ఉత్పత్తి కావడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. రక్తపోటు పెరుగుతుంది. ఇతర సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఉదయాన్నే కెఫిన్ నిండిన పదార్థాలను తినడం మంచి పద్ధతి కాదు.
పండ్ల రసాలు చాలా ఆరోగ్యకరమైనవి, కానీ ఉదయాన్నే ఖాళీ పొట్టతో తీసుకుంటే మాత్రం అవి అనారోగ్యాలనే తెచ్చిపడతాయి. రక్తంలో చక్కర స్థాయిలను అదుపులో ఉంచాలంటే పండ్ల రసాలను ఖాళీ పొట్టతో తీసుకోకూడదు. ముఖ్యంగా మధుమేహం, జీవక్రియ సమస్యలు ఉన్నవారు పండ్ల రసాలను దూరం పెట్టాలి. వాటికి బదులుగా పండ్లు తినాలి. నిమ్మరసం వంటివి తాగితే మాత్రం ఆరోగ్యకరంగా ఉంటారు. అయితే పంచదార వేసుకోకుండా తాగడం చాలా ముఖ్యం.
ప్రాసెస్ చేసిన తృణధాన్యాలతో చేసిన అల్పాహారాలను కూడా తినకూడదు. ఇలా అధిక ప్రాసెస్ చేసిన పదార్థాల్లో చక్కెర కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో చేరి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల ఆ రోజంతా మీరు శక్తిహీనంగా ఉండే అవకాశం ఉంది. అలాగే అల్పాహారంలో పాన్ కేకులు వంటివి తినకూడదు. బ్రెడ్ కు జామ్ రాసుకొని తినే వాళ్ళు కూడా ఎంతోమంది. ఇలాంటివి దూరం పెట్టాలి. జామ్ లో చక్కెర కంటెంట్ విపరీతంగా ఉంటుంది. ఇవి ఆకలి బాధలను పెంచుతాయి. అలాగే అనారోగ్యాలను తెచ్చిపెడతాయి. కాబట్టి ఇడ్లీ, దోశ, గారెలు వంటివి తినడం అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ కూడా శరీరానికి శక్తిని ఇస్తాయి.
Also read: తీపి పదార్థాలు తినే వారి కన్నా, కారం తినే వారే ఎక్కువ కాలం జీవిస్తారు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.