Breast Cancer: మహిళలూ రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలా? ఈ పంచ సూత్రాలు పాటించండి
మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య రొమ్ము క్యాన్సర్. దీని నుంచి బయట పడాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
మహిళలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. భారతదేశంలో ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నాట్టు నివేదకలు వెల్లడిస్తున్నాయి. చాలా మంది మహిళలకి దీని గురించి అవగాహన లేక క్యాన్సర్ చివరి దశ వచ్చేంత వరకి గుర్తించలేకపోతున్నారు. అందుకే ఏటా అక్టోబర్ నెలని రొమ్ము క్యాన్సర్ అవేర్ నెస్ మంత్ గా పరిగణిస్తారు. మహిళలకి రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు పలు స్వచ్చంద సంస్థలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటాయి.
చెడు అలవాట్లతో పలు రకాల క్యాన్సర్లు
ధూమపానం, పొగాకు నమలడం వంటివి చేయడం వల్ల కాలేయం, తల, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలుసు. కానీ రొమ్ము క్యాన్సర్ విషయంలో మాత్రం అది ఎందుకు వస్తుంది అనేందుకు స్పష్టమైన కారణాలు ఏవి లేవని వైద్యులు వెల్లడించారు. అలా అని రొమ్ము క్యాన్సర్ వస్తే తగ్గించలేని స్థితి కాదని చెప్పుకొచ్చారు. అయితే క్యాన్సర్ వచ్చిన వెంటనే చికిత్స ద్వారా దీన్ని పరిష్కరించవచ్చు. లేదంటే రొమ్ము భాగం తొలగించాల్సి వస్తుంది. అందుకే ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటంటే..
ఊబకాయాన్ని నివారించాలి: ప్రస్తుతం చాలా మంది ఊబకాయం, అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఊబకాయం ఉన్న మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అందుకే బరువు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆహారం విషయంలో డైట్ పాటిస్తూ బరువు పెరగకుండా చూసుకోవాలి.
సమతుల్య ఆహారం తీసుకోవాలి: ఆహారంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు సమతుల్యంగా ఉండే విధంగా చూసుకోవాలి. ప్రాసెస్ చేయబడిన ఆహారానికి దూరంగా ఉండాలి. ఉప్పు, చక్కెర అధిక వినియోగం తగ్గించాలి. తప్పనిసరిగా దినచర్యలో భాగంగా పండ్లు తీసుకోవడం, ఆకుకూరలు సైతం తీసుకోవాలి. కొన్ని రకాల కార్బో హైడ్రేట్స్ తగ్గించి తీసుకోవడం వల్ల క్యాన్సర్ ని నిరోధించవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారం ఎంచుకోవాలి.
జీవనశైలిలో మార్పులు: ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా రోజుకి కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చెయ్యాలి. జిమ్ కి వెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే సొంత పనులు చేసుకోవడం, నడక, ఒళ్లు వంచి పనులు చేసుకోవడం వంటివి చెయ్యొచ్చు. లిఫ్ట్ వాడకానికి బదులుగా మెట్లు ఎక్కడం, చిన్న చిన్న దూరాలకి వాహనాలు వినియోగించకుండా కాలి నడకకి ప్రాధాన్యత ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. ఇవే కాకుండా యోగా, మెడిటేషన్, పలు రకాల ఎక్సర్ సైజ్ లు చేయడం అలవర్చుకుంటే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
లేట్ ప్రెగ్నెన్సీ వద్దు: 30 ఏళ్ల తర్వాత ప్రసవం లాంటి కారణాలతో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే వీలైనంత వరకు 30 ఏళ్లలోపు కనీసం ఒకసారి గర్భం ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.
చనుబాలు ఇవ్వాలి: అందం తరిగిపోతుంది కదా అని తల్లి పాలకి బదులుగా డబ్బా పాలు పడుతుంటారు కొందరు మహిళలు. కానీ తల్లి బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల ఇద్దరికీ మేలు జరుగుతుంది. తల్లిపాలు రొమ్ము క్యాన్సర్ కి రక్షణగా నిలుస్తాయి. అందుకే బిడ్డకి కనీసం పుట్టిన తర్వాత నుంచి 6 నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని వైద్యులు సిఫార్సు చేస్తారు.
రొమ్ము క్యాన్సర్ ని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవచ్చు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ రొమ్ము క్యాన్సర్ కి సంబంధించి మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: ‘లివర్ సిర్రోసిస్’ అంటే ఏమిటీ? అది కాలేయ క్యాన్సర్‌గా మారకూడదంటే ఏం చేయాలి?