Automatic vs Manual Geyser : గీజర్ తీసుకోవాలనుకుంటున్నారా? ఆటోమేటిక్ vs మాన్యువల్.. ఏది మంచిదంటే
Choosing the Right Geyser in Winter : చలికాలంలో ఎక్కువమంది గీజర్ వాడుతారు. అయితే మీరు కొత్తగా గీజర్ కొనుక్కోవాలంటే ఆటోమేటిక్ బెటరా? లేదా మాన్యువల్ గీజర్ వాడితే ఖర్చు తక్కువ అవుతుందో చూసేద్దాం.

Best Geyser for Winter : చలికాలంలో వేడి నీటిని చాలామంది ఉపయోగిస్తారు. పైగా రోజురోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చన్నీటి స్నానం ఎవరూ ప్రిఫర్ చేయరు. అలాంటివారు వేడి నీళ్లే కోరుకుంటారు. వేడినీళ్ల కోసం హీటర్లు, గీజర్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే మీరు గీజర్ తీసుకోవాలనుకుంటున్నట్లయితే కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. ఎందుకంటే మీ అవసరాలకు తగ్గట్లు సరైన గీజర్ ఎంచుకోవడం ముఖ్యం.
మార్కెట్లో రెండు రకాల గీజర్లు అందుబాటులో ఉన్నాయి. ఆటోమేటిక్, మాన్యువల్ గీజర్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ రెండూ వేర్వేరుగా పనిచేస్తాయి. అలాగే వాటి ప్రయోజనాలు, లోపాల్లో కూడా కొన్ని తేడాలు ఉంటాయి. మరి ఈ సందర్భంలో ఎలాంటి గీజర్ ఎంచుకుంటే మంచిదో ఇప్పుడు చూసేద్దాం.
ఆటోమేటిక్ గీజర్
ఆటోమేటిక్ గీజర్లను తరచుగా "స్మార్ట్ హీటర్లు" అని పిలుస్తారు. ఎందుకంటే ఉష్ణోగ్రతను సెట్ చేసిన తర్వాత.. వాటంతటా అవే నీటిని వేడి చేస్తాయి. నిర్దేశిత స్థాయికి చేరుకున్న తర్వాత అదే ఆగిపోతుంది కూడా.
ఆటోమేటిక్ గీజర్ బెనిఫిట్స్
ఆటోమేటిక్ గీజర్లో నీరు వేడెక్కిన వెంటనే యంత్రం స్వయంగా ఆగిపోతుంది. ఇది విద్యుత్ వృథాను నివారిస్తుంది. మిషన్ వేడెక్కే ప్రమాదం తక్కువ. ఇది ప్రమాదాల అవకాశాలను బాగా తగ్గిస్తుంది. కాబట్టి పదేపదే చెక్ చేసుకోవాల్సిన లేదా ఆన్-ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గీజర్లు సౌకర్యం, భద్రత, విద్యుత్ పొదుపు మూడింటిని అందిస్తాయి. ఆ బెనిఫిట్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
మాన్యువల్ గీజర్
మాన్యువల్ గీజర్లు పాత ఇళ్లలో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిలో మీరు ఉష్ణోగ్రత నియంత్రణతో పాటు.. ఆన్-ఆఫ్ రెండింటినీ మీరే చేయాల్సి ఉంటుంది.
మాన్యువల్ గీజర్ బెనిఫిట్స్
మాన్యువల్ గీజర్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆటోమేటిక్ గీజర్ కంటే తక్కువ ధరకు వస్తుంది. కాబట్టి కొనేప్పుడు జేబుపై ఎక్కువ భారం పడదు. ఇందులో ఎక్కువ ఎలక్ట్రానిక్ భాగాలు ఉండవు. కాబట్టి పేలే అవకాశాలు తక్కువ.
మాన్యువల్ గీజర్ లోపాలు
బడ్జెట్ ఫ్రెండ్లీ అయినా మాన్యువల్ గీజర్ ఉపయోగించాలంటే.. నిరంతరం పర్యవేక్షించవలసి ఉంటుంది. అధికంగా వేడయ్యే ప్రమాదం ఉంది. సమయానికి ఆపివేయకపోతే విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా ఉండవచ్చు.
ఏది కొంటే మంచిది?
మీరు భద్రత, సౌలభ్యం, విద్యుత్ పొదుపునకు ప్రాధాన్యత ఇస్తే.. ఆటోమేటిక్ గీజర్ మంచి ఎంపిక. కాకుంటే ఇది కొంచెం ఖరీదైనది. కానీ దీర్ఘకాలంలో విద్యుత్ పొదుపు, భద్రత వల్ల మరింత బెనిఫిట్స్ ఉంటాయి. అదే సమయంలో మీ బడ్జెట్ పరిమితంగా ఉంటే.. గీజర్ను క్రమం తప్పకుండా ఆన్-ఆఫ్ చేసే అలవాటు కలిగి ఉంటే.. మాన్యువల్ గీజర్ కూడా మంచి ఎంపికే అవుతుంది. కాబట్టి మీ అవసరాలకు అనుగుణంగా గీజర్ తీసుకోవచ్చు.






















