Bael Fruit: జీర్ణసమస్యలు తగ్గించే ఈ ప్రత్యేకమైన పండు గురించి తెలుసా?
కడుపులో కాస్త అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే అరుగుదల ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. కానీ ఈ పండు తిన్నారంటే జీర్ణ సమస్యలు ఏవి ఉండవు.
పండ్లు అనగానే మామిడి, అరటి, దానిమ్మ, యాపిల్, జామ కాయ ఇవే ఎక్కువగా వినిపిస్తాయి, కనిపిస్తాయి. కానీ కొన్ని రకాల పండ్లు గురించి చాలా తక్కువ మందికి తెలుసు. సీజన్లను బట్టి వచ్చే కొన్ని రకాల పండ్లు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. వాటిలో ఒకటి బేల్ పండు. రోజూ చూడని ఈ పండు ఆరోగ్య ప్రయోజనాల గురించి అతి తక్కువ మందికి తెలుసు. దీన్నే వుడ్ యాపిల్, కోత్బేల్ అని కూడా పిలుస్తారు. సోహాని ఈట్స్ అనే ఫుడ్ బ్లాగర్ బేల్ పండు తినడం వల్ల జీర్ణసమస్యలు తగ్గుతాయని ఆమె చెప్పుకొచ్చారు. ఈ పండు ఎలా తింటే రుచికరంగా ఉంటుందో కూడా వీడియో పోస్ట్ చేశారు.
బేల్ పండు ప్రయోజనాలు
భారతదేశంలోని అత్యంత ప్రత్యేకమైన పండు ఇది. దీన్ని ఒడియాలో కైతా అని, హిందీలో కోత్బేల్ అని పిలుస్తారు. రుచిలో పుల్లగా ఉంటుంది. భారతీయ మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలతో కలిపి దీన్ని తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందని ఆమె చెప్పారు. ఈ సూపర్ ఫ్రూట్ విరేచనాలు, డయేరియా వంటి జీర్ణ సమస్యలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. మలబద్ధకం సమస్య నుంచి బయట పడేందుకు ఇదొక గొప్ప ఔషధంగా ప్రసిద్ధి చెందింది. ఇందులో భేదిమందు గుణాలు ఉన్నాయి. మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలని బయటకి పంపించేస్తుంది. గుండ్రంగా, మెత్తటి గుజ్జు, పీచుని కలిగి ఉంటుంది ఈ పండు.
బేల్ పండులో లూపియోల్, యూజినాల్, లిమోనెన్, సిట్రల్, రుటిన్, ఆంథోసైనిన్స్ వంటి ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉన్నందున ఇది కెమోప్రివెంటివ్ ఎఫెక్ట్స్ ను ప్రేరేపించవచ్చని ఆమె చెప్పారు. ఇది పేగు జీవసంబంధమైన చర్యకు మద్దతు ఇస్తుంది. పేగు వ్యాధి ఐబీఎస్ లక్షణాలని తగ్గిస్తుంది. ఈ వుడ్ యాపిల్ జీర్ణక్రియాలో సహాయపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలని కలిగి ఉంది. గాయాలు అయిన అవయవాలని నయం చేస్తుంది. ఈ పండులో అధిక ప్రోటీన్ కంటెంట్ కారణంగా గాయాల్ని త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది. బలమైన కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. ఇందులోని బీటా కెరోటిన్ కాలేయ సమస్యల్ని నయం చేస్తుంది. దీనిలో థయామిన్, రిబోఫ్లేవిన్ ఉన్నాయి.
ఇలా తింటే రుచి సూపర్
చాకుతో బేల్ పండు తొక్కని తీసేసుకోవాలి. అందులోని గుజ్జును తీసుకుని మసాలా దినుసులు జోడించుకుని తినొచ్చు. ఈ పండు రుచి తీపి, పులుపు కలగలిపి ఉంటుంది. అందువల్ల పండిన పండు గుజ్జును అలాగే లేదా చక్కెరతో కలిపి తింటారు. రసం, జెల్లీ, చట్నీ తయారీకి ఉపయోగించుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: అరిటాకు మాత్రమే కాదు, ఈ ఆకుల్లో భోజనం తింటే ఆరోగ్యానికి శ్రేయస్కరం
Join Us on Telegram: https://t.me/abpdesamofficial