మీ ఇంట్లో ఈ మొక్క ఉంటే హెల్త్ బెనిఫిట్స్ కోసం ఆ వంటల్లో వాడేయండి
మీకు వాము ఆకుల గురించి తెలుసా? అయితే వాటిని ఈ వంటల్లో కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
దాదాపు ప్రతి ఇంటిలో వంటగదిలో ఉండే మూలికల్లో వాము ఒకటి. ఇది ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు అందిస్తుంది. అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్న దీనిని పలు చికిత్సల్లో ఉపయోగిస్తారు. సుగంధ లక్షణాలు కలిగి ఉన్న వాము.. వంటల్లో రుచిని రెట్టింపు చేస్తుంది. అందుకే వీటిని పలు డ్రింక్స్, కూరలు, వంటకాల్లో ఉపయోగిస్తారు. కొందరు దీనిని పొడి చేసుకుని.. నేరుగా కూడా తింటూ ఉంటారు. అయితే చాలామందికి వాము గురించి తెలిసినంతగా.. వాము ఆకుల గురించి తెలియదు.
వాము మొక్కను మీరు ఇంటి పెరట్లోనే సులువుగా పెంచుకోవచ్చు. వాము లాగానే ఇది ఎన్నో ఔషద గుణాలు కలిగి ఉంటుంది. కాబట్టి మీ కిచెన్ గార్డెన్లో దీనికి చోటు ఇవ్వొచ్చు. ఈ మొక్క ఆకులతో మీరు ఎన్నో వంటకాలు ట్రై చేయవచ్చు. కేవలం దాని ఆకును తెంపి.. చిన్నగా నులిమితే దాని నుంచి వచ్చే వాసన కూడా మీకు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. వాముకి, వాము ఆకులు పూర్తిగా వేరు అయినా.. ఇవి వాటి వాసనను పోలి ఉంటాయి. నేరుగా ఈ ఆకులతో పలు వంటకాలు చేసుకుని.. వాటి ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సీజనల్ వ్యాధులకై..
చలికాలంలో సీజనల్ వ్యాధులు తరచూ అటాక్ చేస్తాయి. ఆ సమయంలో జలుబు, దగ్గను నయం చేయడానికి వాము ఆకులను ఉపయోగించవచ్చు. చెట్టు నుంచి వాము ఆకులను తెంపి.. నీటిలో వేసి ఉడకబెట్టాలి. మీకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు వాము ఆకులను బాగా కడిగి.. ఓ గ్లాస్ నీటిలో వేసి ఉడకనివ్వాలి. నీరు సగం మరిగి కషాయం అవుతుంది. దీనిని దించి.. కాస్త చల్లారిన తర్వాత తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. కావాలంటే దీనిలో కాస్త తేనే కలుపుకోవచ్చు.
జ్యూస్‌ల్లో..
మీరు ఉదయాన్నే హెల్తీ జ్యూస్ తాగాలనుకుంటే మీరు వీటిని స్మూతీల్లో, జ్యూస్‌లలో వేసుకోవచ్చు. ఇది జ్యూస్‌లకు మంచి రుచిని అందిచడంతో పాటు.. పోషణను కూడా అందిస్తుంది. పండ్లు, కూరగాయలతో చేసే ఏ జ్యూస్, స్మూతీల్లోనైనా దీనిని కలిపి తీసుకోవచ్చు. ఫ్రూట్స్, వెజిటెబుల్ సలాడ్స్‌లలో కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని డైట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది బ్లోటింగ్ సమస్యలను కూడా దూరం చేస్తుంది.
పకోడీలలో..
జ్యూస్‌లు, కషాయాలే కాదు.. చిరుతిళ్లు, ఈవెనింగ్ స్నాక్స్‌లలో కూడా దీనిని చేర్చుకోవచ్చు. వేడి వేడి పకోడీల్లో కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఆలు బజ్జీలు, మిర్చి బజ్జీల టైప్‌లో వాము ఆకులతో బజ్జీలు చేసుకోవచ్చు. శనగపిండిలో ఉప్పు వేసి బాగా కలిపి.. వాటిలో కడిగిన వాము ఆకులు వేయాలి. ఒక్కో ఆకు పిండితో పూర్తిగా ఉండేలా చూసి.. వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. అంతే రుచికరమైన, సువాసన కలిగిన పకోడీలు మీ ముందు ఉంటాయి. దీనిని కెచప్ లేదా పెరుగుతో కలిపి తీసుకోవచ్చు. వేడి వేడిగా తింటే దీని రుచి మరింత బాగుంటుంది.
చట్నీలలో..
చట్నీలు లేదంటే ఏమైనా స్నాక్స్ కోసం తయారు చేసే డిప్స్ కోసం వీటిని ఉపయోగించవచ్చు. ఈ ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి.. దీనిని వైట్ క్రీమ్‌లో కలపాలి. ఇది మీకో రుచికరమైన, సువాసన కలిగిన డిప్ అవుతుంది. మీకు నచ్చిన మసాలా దినుసులతో పాటు ఈ ఆకులను ఉపయోగించి చట్నీలు తయారు చేసుకోవచ్చు.
ఇన్ని ప్రయోజనాలు కలిగిన వాము ఆకులను మీ డైట్లో చేర్చుకోవచ్చు. ఇది మీ జీర్ణసమస్యలను దూరం చేయడంతో పాటు.. కడుపులోని నులిపురుగులను దూరం చేస్తుంది. మెరుగైన ఆకలిని అందిస్తుంది. రుచితో పాటు.. ఆరోగ్యప్రయోజనాలు పొందేందుకు మీరు వివిధ వంటల్లో దీనిని చేర్చుకోవచ్చు.
Also Read : ఏవండోయ్.. చలికాలంలో మీరు తాగే టీలో ఆ ఒక్కటి వేస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.