దేవతల ఆహారమంటూ కీటకాల గుడ్లను తినేస్తున్న జనం, ఎక్కడో తెలుసా?
మెక్సికోలో వేలాది సంవత్సరాలుగా ఒక రకమైన నీటిలో పెరిగే కీటకాల గుడ్లను 'దేవతల ఆహారం'గా పరిగణిస్తున్నారు. వీటిని మెక్సికన్ కేవియర్ అంటారు.
మీకు గుడ్లంటే ఇష్టమా? అని అడిగితే మీరు ఏం చెబుతారు? వెంటనే ‘కోడి గుడ్లు’ అని ఆన్సర్ ఇస్తారు. లేదా మీరు బాతు లేదా ఏదైనా పక్షి గుడ్లను రుచి చూసి ఉంటే.. వాటి పేర్లు చెబుతారు. కానీ, ఇదే ప్రశ్న మెక్సికో ప్రజలను అడిగితే.. దిమ్మ తిరిగే జవాబు చెబుతారు. వారి ఆన్సర్ విన్న తర్వాత బిక్క ముఖం వేసినా, ఛీ అని ముఖం చిట్లించినా.. మీకు నెక్ట్స్ బర్త్ డే ఉండదు. ఎందుకంటే.. అది వారికి ఎంతో ఇష్టమైన ఫుడ్. పైగా.. వారు ఆ ఆహారాన్ని ‘దేవతల ఆహారం’గా భావిస్తారు. ఎందుకలా? అని తెలుసుకోవాలని ఉందా? అయితే.. చూడండి.
కొన్ని ప్రదేశాలలో కొన్ని రకాల ఆహారపదార్థాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అవి మనకు తప్పకుండా నచ్చాలనే రూల్ ఏమీలేదు. అవి ఆ ప్రాంత ప్రత్యేకతలతో.. ప్రత్యేక రుచితో ప్రాచూర్యంలో ఉంటాయి. అలాంటి ఆహార పదార్థాలలో ఒకటి మెక్సికోకు చెందిన అహుఆటిల్. పేరు భలే చిత్రంగా ఉంది కదా. అసలు విషయం తెలిస్తే.. ఇంకా చిత్రంగా ఉంటుంది. అహుఆటిల్ అంటే మరేంటో కాదు.. నీటిలో పెరిగే ఒక చిత్రమైన కీటకం గుడ్లు. వీటి రుచికి మెక్సికన్లు అడిక్ట్ అయిపోయారు. వేల సంవత్సరాలుగా తింటున్న ఈ సాంప్రదాయ ఆహారాన్ని.. వారు ‘దేవతల ఆహారం’గా పరిగణిస్తున్నారు. వీటిని మెక్సికన్ కేవియర్ అని కూడా అంటారు.
మెక్సికో సిటీ శివార్లలోని టెక్స్‌కోకో సరస్సులో కొరిక్సిడే కుటుంబానికి చెందిన జలచరాలు ఉంటాయి. వాటిని ఒక రకమైన దోమగా పరిగణించవచ్చు. వీటిని అహుఆటిల్ అని అంటారు. అంటే సీడ్సఫ్ జాయ్ - ఆనందపు గింజలు లేదా విత్తనాలు అని అర్థం. క్వినోవా గింజల పరిమాణంలో లేత బంగారు రంగును కలిగి ఉంటాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయట. అజ్టెక్ సామ్రాజ్యం కాలం నుంచి కూడా వీటిని ఆహారంలో వినియోగిస్తున్నారట. ప్రస్తుతం కొంతమంది మత్స్యకారులు మాత్రమే వీటిని సాగు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రత్యేకమైన గుడ్ల పెంపకం గురించి గురించి కొంతమందికి మాత్రమే తెలుసు.
ఇలా సాగు చేస్తారు: మన ఊర్లలో చేపలు, రొయ్యలను పెంచినట్లే.. ఇక్కడ కూడా ఈ కీటకాల గుడ్లను సాగు చేస్తుంటారు. చేతితో తయారు చేసిన రెల్లు వలలను నీటి ఉపరితలం కింద మూడు వారాల పాటు ఉంచడం ద్వారా ఆహుఆటిల్‌ను పండిస్తారు. ఈ సమయంలో ఈ రెల్లు వలల మీద వేలాదిగా గుడ్లు పెడతాయి. వాటిని బయటికి తీసి అవి పూర్తిగా ఆరిపోయే వరకు ఎండలో ఉంచుతారు. వీటిని పిండి గుడ్లతో కలిపి నూనెలో వేయించి క్రొక్వేట్స అనే వంటకంగా వడ్డిస్తారు. మెక్సికన్ వంటకాల్లో ఈ డిష్ చాలా రుచికరమైంది. కొన్ని రెస్టారెంట్లలో ప్రత్యేకంగా వీటిని వడ్డిస్తారు.
అయితే.. నేటి తరంలో చాలామందికి ఇలాంటి ఆహారం ఒకటి ఉందని తెలియదట. అందుకే, ఈ వార్త బయటకు వచ్చేసరికి అంత వైరల్ అవుతోంది. పైగా వీటిని సాగు చేయడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదట. అందుకే, రెస్టారెంట్ల నిర్వాహకులకు వీటిని సేకరించడం కష్టంగా మారిందట. కొంత మంది మెక్సికన్ కుటుంబాలకు ఆహాుఆటిల్‌ను సాగు చెయ్యడం అనావాయితీగా వస్తోంది. ప్రస్తుతం వారి నుంచి మాత్రమే కీటకాల గుడ్లు ఎగుమతి అవుతున్నాయి. నెమ్మదిగా ఈ ప్రక్రియ అంతరించి పోతుండడం వల్ల వీటి ధర ఆకాశాన్నంటింది. కిలో బీఫ్ ధర కంటే దాదాపు నాలుగు రెట్ల ధర పలుకుతోందట. ఇది చిన్న ఎండు రొయ్యల రుచి మాదిరిగానే ఉంటుందని ఆహార ప్రియులు చెబుతున్నారు. మీరు ఎప్పుడైనా మెక్సికో వెళ్తే.. రుచి చూడటం మరిచిపోవద్దు.
Also Read: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే రోగనిరోధక శక్తి తగ్గినట్టే