వంటకాలకు చింతచిగురు జతచేరిస్తే ఆ రుచే వేరు
చింతచిగురు ఎక్కడా కనిపించినా కచ్చితంగా కొనుక్కోండి.
భారతీయ వంటకాల్లో చింతచిగురుకు స్థానం ఉంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చింతచిగురును అనేక వంటకాలలో భాగం చేస్తారు. వెజ్ లేదా నాన్ వెజ్.. ఎందులో వేసినా రుచి అదిరిపోతుంది. చింతచిగురు పప్పు గురించి ఎంత చెప్పినా తక్కువే. చింతచిగురులో ఉండే ఆ లేత పులుపు, పప్పుకు ఎంతో రుచిని అందిస్తుంది. అలాగే చింతచిగురుతో చికెన్ లేదా మటన్ కలిపి వండుతారు. ఆ రుచి అదిరిపోతుంది. ముఖ్యంగా చింతచిగురు రొయ్యలు ఎంతోమందికి ఇష్టమైన కాంబినేషన్. ఆ కూరలు గుర్తుకొస్తేనే నోరూరిపోతుంది. చింతచిగురు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎక్కడైనా మీకు ఈ చింతచిగురు కనిపిస్తే కచ్చితంగా ఇంటికి తెచ్చి వండుకోండి.
చింతచిగురులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తరచూ తినడం వల్ల రక్తహీనత సమస్య రాదు. ముఖ్యంగా మహిళలు, పిల్లల్లో రక్తహీనత సమస్య బాధిస్తుంది. అందుకే పిల్లలకు కచ్చితంగా చింతచిగురును తినిపించాలి. చింతచిగురుకు ఒక అద్భుతమైన గుణం ఉంది. కామెర్ల వ్యాధిని నయం చేసే శక్తి దీనికి ఉంది. చింతచిగురు రసాన్ని తీసి పటిక బెల్లాన్ని కలిపి తాగితే కామెర్ల వ్యాధి అదుపులో ఉంటుంది. చింతచిగురును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వాతం సమస్యలు రావు. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. కాబట్టి ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు చింతచిగురును కచ్చితంగా తినండి.
దీన్ని తరచూ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటివి తరచూ దాడి చేయకుండా ఉంటాయి. అలాగే గొంతు నొప్పికి కూడా చింతచిగురు ఔషధంలా పనిచేస్తుంది. నీటిలో చింతచిగురును వేసి బాగా మరిగించి వడకట్టి ఆ నీటిని కాస్త తాగడం లేదా నోట్లో వేసుకుని పుక్కిలించడం చేస్తే మంచిది. గొంతు నొప్పి, గొంతులో మంట, గొంతు వాపు వంటివి రాకుండా ఉంటాయి. పిల్లలకు చింత చిగురు తినిపించడం వల్ల నులిపురుగుల సమస్య రాదు. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న మహిళలు కూడా చింతచిగురును వారానికి ఒక్కసారైనా కచ్చితంగా తినాలి. దీనికి రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. బరువు తగ్గాలనుకునే వారికి చింతచిగురు మంచి ఆప్షన్. ఇది శరీరంలో చెడు కొవ్వును పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. అలాగే దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అజీర్తి సమస్యలు రాకుండా ఉంటాయి.
Also read: ఈ లడ్డూ పిల్లలకు రోజుకొకటి తినిపించండి చాలు, ప్రొటీన్ లోపమే రాదు
Also read: టీ పదే పదే వేడి చేసి తాగుతున్నారా? అది చాలా డేంజర్