Brij Raj Bhavan: సిపాయిల తిరుగుబాటులో ప్రాణాలు కోల్పోయిన ఓ బ్రిటిష్ ఆఫీసర్... అతని ఆత్మ ఇంకా అక్కడే ఉందుంటున్న స్థానికులు
బ్రిజ్ రాజ్ భవనాన్ని ఇప్పటికీ స్థానికులు దెయ్యాల భవనంగా భావిస్తారు.
ఆనాటి చరిత్రకు సాక్ష్యాలుగా ఎన్నో రాజ మందిరాలు మనదేశంలో ఇప్పటికీ నిలిచే ఉన్నాయి. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే రాజస్థాన్లో ప్యాలెస్‌ల సంఖ్య మరీ ఎక్కువ. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆ రాష్ట్రంలోని కోటా పట్టణంలో ఉన్న ‘బ్రిజ్ రాజ్ భవనం’గురించి. చూడటానికి అందమైన భవనం... నివసించేందుకు విలాసవంతమైన విశాల భవంతి. కానీ రాత్రయితే మాత్రం మనిషి కనిపించకుండా చెవిలో ఏవో మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఒక్కోసారి మనిషి ఆకారం కూడా మసకమసకగా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన వాళ్లు, విన్న వాళ్లు చెబుతున్నదే. ఆ ఆకారం ఎవరిది? ఆ మాటలు ఏ భాషకు చెందినవి? అసలు బ్రిజ్ రాజ్ భవనం వెనుక ఉన్న విషాద కథ ఏంటి?
ఓ విషాద ఘటన...
భారత స్వాతంత్య్రోద్యమంలో 1857 మరిచిపోలేని సంవత్సరం. సిపాయిల తిరుగుబాటుతో ఉద్యమానికి ఎనలేని ఊపొచ్చింది. ఆ ఊపు 1947లో స్వతంత్ర భారతావనికి దారి చూపింది. సరిగ్గా 1857లోనే బ్రిజ్ రాజ్ భవనంలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. అప్పట్లో భారతదేశాన్ని ఆక్రమించిన బ్రిటిషర్లు ఈ బ్రిజ్ రాజ్ భవనాన్ని తమ గెస్ట్ హౌస్‌లా వాడుకునే వారు. వీవీఐపీలు లండన్ నుంచి ఎవరు వచ్చినా ఇదే భవనంలో వసతి కల్పించేవారు. అలా బ్రిటన్ ఆర్మీకి చెందిన అధికారి మేజర్ చార్లెస్ బుర్టన్ తన కుటుంబంతో సహా ఓసారి ఈ భవనాన్ని చూడటానికి వచ్చాడు. భవంతి నచ్చడంతో ఇందులోనే నివసించసాగాడు. 1857లో సిపాయిల తిరుగుబాటు మొదలైంది. అంతవరకు తమను హింసించిన బ్రిటిష్ ఆర్మీపై పగతీర్చుకోవడం మొదలుపెట్టారు భారత సిపాయిలు. కొంతమంది భారత సిపాయిల్ బ్రిజ్ రాజ్ భవనంపై కూడా దాడి చేశారు. చార్లెస్ తన ఇద్దరు కొడుకులతో కలిసి భయంతో భవంతిలోనే ఓ మూల దాక్కున్నాడు. అతడిని వెతికి వెతికి చంపేశారు సిపాయిలు. అతని ఇద్దరు కొడుకులను కూడా వదిలిపెట్టలేదు. ఆ తరువాత వారిని ఆ ప్యాలెస్ లోని లివింగ్ రూమ్ మధ్యలో సమాధి చేశారు. అప్పట్నించి ఆ ప్యాలెస్ నివసించే వారికి, పనిచేసేవారికి, కాపలాదారులకు మేజర్ చార్లెస్ మాటలు వినిపించడం, అప్పుడప్పుడు అతడు కనిపించడం జరిగేదని చెబుతున్నారు.
కాపలాదారులు రాత్రిపూట మెలకువగా ఉండకుండా కునుకుపాట్లు పడుతుంటే చెంపదెబ్బలు కూడా కొట్టేదంట మేజర్ చార్లెస్ ఆత్మ. అంతేకాదు ఆత్మ ఇంగ్లిష్ లో మాట్లాడుతూ ఉండేదని.. తమకు ఆ మాటలు వినిపించేవాని చెప్పారు చాలా మంది కాపలాదారులు. అలాగే 1980లో ఆ కోటకు చెందిన మహారాణి ఓ బ్రిటిష్ జర్నలిస్టుకు ఇంటర్య్వూ ఇచ్చింది. అందులో ఓసారి తనకు చార్లెస్ ఆత్మ కనిపించిందని చెప్పింది. స్టడీరూమ్‌లో నెరిసిన జుట్టుతో, చేతిలో ఊతకర్రతో చార్లెస్ కనిపించాడని ఆమె పేర్కొంది. అయితే చార్లెస్ ఆత్మ ఇంతవరకు ఎవరికీ ఎలాంటి హాని కలిగించలేదు కాబట్టి... భవనాన్ని చూసి భయపడే వాళ్లు తక్కువ. అయితే ఆ భవనం సెంట్రల్ హాల్‌లో, కొన్ని ప్రదేశాల్లో ఊపిరి ఆడడం లేదని, ఇబ్బందిగా ఉందని చెప్పే వాళ్లు ఉన్నారు. అలాగే రాత్రయితే గదుల్లోనే ఉండమని టెర్రస్ మీద తిరగడం, గార్డెన్ లో పచార్లు కొట్టడం చేయద్దంటూ చెబుతారు అక్కడి స్థానికులు. బ్రిటిష్ ఆఫీసర్ ఆత్మ ఇంతవరకు ఎవరికీ హాని తలపెట్టకపోయినా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తారు. సైన్సును నమ్మేవాళ్లు మాత్రం అదంతా స్థానికుల భ్రమేనని, ఆత్మలు ఉండే అవకాశమే లేదని తేల్చి చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ భవనాన్ని హోటల్ గా మార్చి అద్దెకు ఇస్తున్నారు. ఎక్కువ మంది విదేశీయులు ఇందులో అద్దెకు వస్తుంటారు.
Also read: వెండి పట్టీలు... ఆభరణాలే కాదు, ఆరోగ్యాన్నందించే అస్త్రాలు కూడా
Also read: చలికాలపు అనారోగ్యాలకు చెక్ పెట్టే వెల్లుల్లి సూప్ ... వారానికోసారి తాగినా చాలు
Also read: కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం వీరికే ఎక్కువ... ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోవద్దు
Also read: ఫ్యామిలీని, ఫ్రెండ్స్‌ను ఇలా తెలుగులో విష్ చేయండి, మీ కోసం అందమైన కోట్స్ ఇవిగో...