Adilabad Tiger News: ఐదేళ్ల తర్వాత కవ్వాల్ అభయారణ్యంలో కాలుమోపిన పెద్దపులి- శాశ్వతంగా ఉండేలా అధికారుల చర్యలు
Adilabad Tiger News:ఐదేళ్ల తర్వాత కవ్వాల్ అభయారణ్యంలో పెద్దపులి కాలుమోపింది. అదే టైంలో తిర్యాణి, కాసిపేట బుగ్గ అటవీ ప్రాంతంలో మరో రెండు ఆడ పులులు సంచరిస్తున్నాయి.

Adilabad Tiger News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యంలో ఎన్నో రోజుల ఎదురు చూపులకు తెరపడింది. ఎట్టకేలకు కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలో పెద్ద పులి కాలుమోపింది. ఆవుపై దాడి చేసి తిరిగి నేనొచ్చానని చెప్పినట్టు కవ్వాల్ అభయ అరణ్యంలోకి వచ్చింది. అయితే.. ఇది ప్రతిసారి చుట్టపుచూపుగా వస్తున్న వ్యాఘ్రం ఈసారైనా స్థిరంగా ఉంటుందా లేదో చూడాలి. ఈసారైనా కవ్వాల్లో స్థిర నివాసం ఏర్పర్చుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో అని స్థానికులు చర్చించుకుంటున్నారు.
మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ పులుల సంరక్షణ కేంద్రం నుంచి వలస వచ్చిందీ పులి. జోడేఘాట్ రేంజ్ అటవీప్రాంతం పరిధిలోని రాజులగూడ ప్రాంతంలో ఇటీవల కనిపించింది. ఇంధన్ పల్లి రేంజ్ పరిధిలో ఆవు పై దాడి చేసిన పులి కూడా ఇదే అయి ఉంటుందని అటవీ అధికారులు భావిస్తున్నారు. తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి జోడేఘాట్ మీదుగా ఇంధన్ పల్లి అటవీ ప్రాంతానికి రావడానికి అనేక గ్రామాలు అడ్డుగా ఉన్నాయి. అయినా సరే వీటన్నింటిని దాటుకొని పెద్దపులి రావడంపై అటవీశాఖ అధికారులు విశేషంగా భావిస్తున్నారు.
అయితే పెద్దపులి మాత్రం చుట్టం చూపుగా వచ్చి పోతుంది. 2016లో అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం బీర్సాయిపేట అటవీ ప్రాంతంలో, 2018లో మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇంధన్ పల్లిలో, 2021లో నిర్మల్ జిల్లా కడెం మండలం గంగాపూర్లో పెద్దపులి కదలికలు కనిపించాయి. 2022 లో కడెం జలాశయం వెనక భాగాన ఉన్న అడవుల్లో, 2024 జన్నారం మండలం జువ్విగూడలో, 2025లో తిర్యాణి అటవీ ప్రాంతంలో పెద్ద పులి అడుగులను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇలా వలస వచ్చిన పులులు నిలకడగా ఉండకపోవడంతో అవి కవ్వాల్లో కనిపించడం లేదు. ఇటీవల జన్నారం అటవీ డివిజన్ లోని ఇంధన్ పల్లి రేంజిలోని ఇంధన్ పల్లి నార్త్ బీట్ పక్కనున్న మామిడి తోటలో ఆవుపై దాడి చేసి చంపేసింది.
కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం 2012లో ఏర్పాటైంది. 892 చ.కి.మీ. కోర్ ఏరియా, 1,123 చ.కి.మీ బఫర్ ఏరియాతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇది విస్తరించి ఉంది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి పనులను అటవీ శాఖ అధికారులు చేపట్టారు. 7 కోట్లు ఖర్చు చేశారు. అడవి మధ్యలో కుంటలు, చెరువులు తవ్వించారు. సోలార్ మోటార్లు సైతం ఏర్పాటు చేశారు. బేస్ క్యాంపు భవనాలు నిర్మించారు. ఎన్ని ఏర్పాట్లు చేసినా. పులులు వచ్చిననప్పుడు మాత్రం ఇక్కడ ఉండటం లేదు.
అటవీ ప్రాంతంలో పలు రకాల జంతువులు అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉండేవి. సంబంధిత శాఖ వీటి కోసమే పలు రకాల సదుపాయాలు ఏర్పాటు చేసింది. గతంలో రెండు నీటి కుంటలను, ఇటీవల మరో రెండింటిని సిద్ధం చేసింది. కృత్రిమ గడ్డివనాలు పెంచడం మొదలు పెట్టింది. సందర్శకుల సౌకర్యార్థం ప్రత్యేక వ్యూ పాయింట్లు, మంచెలను సిద్ధంగా ఉంచింది. సుమారు 20 కిలోమీటర్ల మేర ఉన్న ఈ సఫారీలో ప్రస్తుతం అడవి కుక్కలు మొదలు జింకలు, అడవి దున్నలు, చిరుత పులులు, ఇటీవల తరచూ పెద్ద పులులు సంచరిస్తున్న చిత్రాలను ఇక్కడి కెమెరాలు బంధించాయి.
అయితే ఏళ్ల నిరీక్షణ తర్వాత అతిథిలా వచ్చిన ఈ పెద్దపులి ఇక్కడే ఆవాసం ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఇంధన్ పల్లి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ abp దేశంతో తెలిపారు. కవ్వాల్ టైగర్ జోన్ లోకి మహారాష్ట్ర తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పెద్దపులి వచ్చినట్టు సీసీటీవీ, పులి అడుగుల ఆధారంగా గుర్తించామనీ, ఇంధన్ పల్లి రేంజిలో ఉత్తర బీట్ పరిధిలో ఒక ఆవును చంపిన తర్వాత ఇది మగ పులిగా గుర్తించడం జరిగిందన్నారు.
ఇదే ప్రాంతంలో L1, T2 అనే రెండు ఆడ పులులు సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. గత వారం రోజుల క్రితం కాసిపేట బుగ్గ అటవీ ప్రాంతంలో పశువులపై దాడి చేసిన విషయం తెలిసిందే.. అయితే ప్రస్తుతం రెండు పులులు కూడా కవ్వాల్ వైపు వచ్చే అవకాశం ఉంది, మేటింగ్ కు ఇదే సరైన సమయం, ఇంధన్ పల్లి రేంజ్ పరిధిలో మగ పులి రావడంతో అవి పరస్పరం కలుసుకోవడం వీలైతే, పులుల సంతతి పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ కవ్వాల్ అభయారణ్యంలో ఒకవేళ అనుకోకుండా మూడు పులులు కూడా ఎదురైతే వాటి మధ్య పోరు కూడా జరగవచ్చు. పులుల రాకతో మొత్తానికి అటవీ ఆక్రమణలు కూడా తగ్గడానికి అవకాశం ఉంది. కవ్వాల్ అభయారణ్యంలో పులులు సంచరిస్తు ఉండడం ఇప్పుడు అందరిని ఆసక్తి రేకెత్తిస్తోంది.





















