UPSC Civils Mains: సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష షెడ్యూలు వెల్లడి, ఏ పరీక్ష ఎప్పుడంటే?
UPSC Civil Services Mains 2024 Exam Dates: సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష తేదీలను యూపీఎస్సీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో సివిల్స్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.
UPSC CIVIL SERVICES (MAIN) EXAMINATION, 2024 SCHEDULE: సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2024 పరీక్షల షెడ్యూలును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆగస్టు 9న వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. సెప్టెంబర్ 20 నుంచి మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను త్వరలోనే విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9:00 గంటల నుంచి 12:00 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు మొదటి సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు.
సివిల్స్ మెయిన్స్ పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ 20.09.2024
ఉదయం సెషన్: పేపర్-1 ఎస్సే
➥ 21.09.2024
ఉదయం సెషన్: పేపర్-2 జనరల్ స్టడీస్-1
మధ్యాహ్నం సెషన్: పేపర్-3 జనరల్ స్టడీస్-2
➥ 22.09.2024
ఉదయం సెషన్: పేపర్-4 జనరల్ స్టడీస్-3
మధ్యాహ్నం సెషన్: పేపర్-5 జనరల్ స్టడీస్-4
➥ 28.09.2024
ఉదయం సెషన్: పేపర్-ఎ (ఇండియన్ లాంగ్వేజ్)
మధ్యాహ్నం సెషన్: పేపర్-బి (ఇంగ్లిష్)
➥ 29.09.2024
ఉదయం సెషన్: పేపర్-6 (ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్-1)
మధ్యాహ్నం సెషన్: పేపర్-7 (ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్-2)
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్ (Civil Services) ఖాళీల భర్తీకి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షను యూపీఎస్సీ (UPSC) జూన్ 16న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను జులై 1న యూపీఎస్సీ విడుదల చేసింది. ఆ సమయంలో కేవలం అభ్యర్థుల హాల్‌టికెట్ నెంబర్లను మాత్రమే ప్రకటించింది. అయితే జులై 19న మెయిన్ పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల రోల్ నంబర్లు, పేర్ల జాబితాను యూపీఎస్సీ విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షకు మొత్తం 14627 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబరు 20 నుంచి 5 రోజులపాటు సివిల్స్ ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ఏటా 10 లక్షల వరకు అభ్యర్థులు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి గాను మొత్తం 1056 పోస్టులను భర్తీచేయనున్నారు. వీటిల్లో 40 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు. మిగిలిన ఖాళీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తింజేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
➥ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష విధానం:
మొత్తం 1750 మార్కులకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక 275 మార్కులకు పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ) ఉంటుంది. ఇవి రెండు కలిపి 2025 మార్కులకు తుది ఎంపిక ఉంటుంది. పరీక్షలో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 250 మార్కులు కేటాయించారు. అయితే వీటిలో ఒక్కో పేపరుకు 300 మార్కుల చొప్పున క్వాలిఫయింగ్ పేపర్లు(పేపర్-ఎ, పేపర్-బి) ఉంటాయి. వీటి మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 25 నగరాల్లోని కేంద్రాల్లో సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలను యూపీఎస్సీ నిర్వహించనుంది. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో కేవలం హైదరాబాద్, విజయవాడలో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తారు.