TSPSC Paper Leakage: 'గ్రూప్-1' పేపర్ లీకేజీలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల జాబితా సిద్ధం!
ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం మరింత వేడెక్కుతోంది. 'గ్రూప్-1' ప్రశ్నపత్రాన్ని రాజశేఖర్ రెడ్డి ముఠా అనేక మందికి అమ్మినట్లు సిట్ భావిస్తోంది. ఎవరెవరికి అందిందనేది నిగ్గు తేల్చేందుకు ప్రయత్నిస్తోంది.
➥ అనేక మందికి ప్రశ్నపత్రాలు అమ్మినట్లు భావిస్తున్న 'సిట్'
➥ నిందితుల వాట్సాప్‌లో కీలక సమాచారం
➥ విదేశాల్లో ఉన్నవారినీ విచారించే అవకాశం
తెలంగాణలో రోజురోజుకి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం మరింత వేడెక్కుతోంది. 'గ్రూప్-1' ప్రశ్నపత్రాన్ని రాజశేఖర్ రెడ్డి ముఠా అనేక మందికి అమ్మినట్లు సిట్ భావిస్తోంది. ప్రస్తుతం ఎవరెవరికి అందిందనేది నిగ్గు తేల్చేందుకు ప్రయత్నిస్తోంది. గ్రూప్-1 పరీక్షలో సుమారు 25 వేల మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. అందులో 100 స్కోర్ దాటిన వారు ఎంతమంది ఉన్నారు? వారికి ప్రవీణ్, రాజశేఖర్, రేణుకకు ఎలాంటి సంబంధాలున్నాయనే అంశాలపై ఫోకస్ పెట్టారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం 100కు పైగా మార్కులు సాధించిన 'గ్రూప్-1' అభ్యర్థుల జాబితా రూపొందించిన సిట్ అధికారులు వారిలో అనుమానితులను విచారించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు నిందితుల ఫోన్లు, ఇతర డిజిటల్ ఉపకరణాలను జల్లెడ పడుతుండగా... మరోవైపు సిట్‌లోని ప్రత్యేక బృందం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తోంది.
టౌన్ ప్లానింగ్ పరీక్ష ప్రశ్నపత్రంతో మొదలైన లీకేజీ ప్రభావం చివరకు గత అక్టోబరు నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన అన్ని పరీక్షలపై పడింది. మొత్తం ఏడు పరీక్షల్లో నాలుగింటిని కమిషన్ రద్దు చేసింది. ప్రశ్నపత్రాలు ఉంచిన కంప్యూటర్‌ను రాజశేఖర్ రెడ్డి అక్టోబరులోనే యాక్సెస్ చేసినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడి కావడమే ఇందుకు కారణం. ఈ పరీక్షల్లో గ్రూప్-1 ప్రధానమైంది. అక్టోబరు 16న ఈ పరీక్ష నిర్వహించగా అంతకు ముందే రాజశేఖర్ రెడ్డి కాన్ఫిడెన్షియల్ విభాగంలో ఉన్న కంప్యూటర్‌ను యాక్సెస్ చేశాడు.
విషయం నిర్ధారణ అయిన తర్వాతే గ్రూప్-1 పరీక్షను రద్దుచేశారు. అయితే పోలీసులను తప్పుదారి పట్టించేందుకు నిందితులు తొలుత ఏఈ, టౌన్ ప్లానింగ్ ప్రశ్నపత్రం మాత్రమే లీక్ చేసినట్లు చెప్పారు. సిట్ దర్యాప్తులో గ్రూప్-1తో పాటు ఇతర పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా బయటకు వచ్చినట్లు తేలడంతో వాటిద్వారా ఎవరెవరు లబ్ధి పొందారన్నది ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో భాగంగా గ్రూప్-1 పరీక్షలో వందకుపైగా మార్కులు సాధించిన వారితో అధికారులు ఓ జాబితా తయారుచేశారు. వారిలో అనుమానితులను విచారించాలని భావిస్తున్నారు.
జాబితాలో ఉన్నవారికి, రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్‌లకు మధ్య ఏమైనా ఫోన్ సంభాషణలు జరిగాయా, ఛాటింగ్ చేశారా? అన్న విషయాలను నిర్ధారించుకుంటున్నారు. దీనికోసం ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఫోన్లలో అక్టోబరు నుంచి వాట్సప్ ఛాటింగ్ వివరాలను తెప్పించుకుంటున్నారు. వీరిద్దరూ ఆరు నెలలుగా ఎవరెవరితో సంప్రదింపులు జరిపారు... వారిలో గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారెవరున్నారు? తదితర వివరాలన్నీ సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు సేకరిస్తున్నారు. దీంతోపాటు అనుమానిత అభ్యర్థుల బ్యాంకు లావాదేవీలను కూడా వడ పోస్తున్నారు.
సిట్ రూపొందించిన జాబితాలో కొందరు విదేశాల్లో నివాసం ఉంటున్న వారు కూడా ఉన్నారని, ఈ పరీక్ష కోసమే రాష్ట్రానికి వచ్చి... తిరిగి వెళ్లిపోయారని, పరీక్షలో అర్హత కూడా సాధించారని వెల్లడయింది. వీరిలో కొందరి ఫోన్లు అకస్మాత్తుగా స్విచ్చాఫ్ అయ్యాయని కూడా తెలుస్తోంది. ఆధారాలన్నీ కొలిక్కివచ్చిన తర్వాత వీరందరినీ పిలిపించి విచారించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత ఒక నిర్ణయానికి రానున్నారు. ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తు ప్రకారం గ్రూప్-1 పరీక్ష లీక్ అయినట్లే భావిస్తున్నామని, లబ్ధిపొందిన వారిని గుర్తించి వారందరిపైనా కేసులు పెట్టడం ఖాయమని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
30 ప్రశ్నలపైనే ఫోకస్..
నిందితుల నుంచి పూర్తి సమాచారం రాబట్టేందుకు సిట్ అధికారులు 30 ప్రశ్నలను సిద్ధం చేసుకున్నారు. రెండు రోజులుగా ఒక్కొక్కరిని విచారిస్తూ, అవసరమైనప్పుడు ఇద్దరినీ ఒకేసారి విచారించారు. 2 రోజులుగా పోలీసులు ప్రధాన నిందితులైన రాజశేఖర్, ప్రవీణ్, రేణుకతో పాటు మిగిలిన నిందితుల నుంచి సమాచారాన్ని సేకరించారు. సోమవారం నుంచి అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి సిట్ విచారించనుంది.
Also Read:
TSPSC Exams: టీఎస్‌పీఎస్సీ పరీక్షల రీషెడ్యూలు! గ్రూప్-2, 4 పరీక్షలపై సందిగ్ధత!
తెలంగాణలో ప్రశ్నపత్రాల లీకేజీతో వివిధ పరీక్షల తేదీలు మారే అవకాశం ఉంది. పరీక్షలను రీషెడ్యూలు చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. వేటిని రీషెడ్యూలు చేసే అవకాశముంది? వేటిని యథాతథంగా కొనసాగించవచ్చన్న విషయమై కసరత్తు చేస్తోంది. ముందుగా తక్కువ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలను త్వరగా ముగించాలని కమిషన్ భావిస్తోంది. కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
21 నుంచి ఎస్సీటీ ఎస్‌ఐ పరీక్ష హాల్‌టికెట్లు! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్ఎల్‌పీఆర్‌బీ) మార్చి 26న ఎస్‌సీటీ ఎస్‌ఐ టెక్నికల్ పేపర్ రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు మార్చి 21 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థలు మార్చి 21న ఉదయం 8 గంటల నుంచి హాల్‌టికెట్లు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 24న అర్ధరాత్రి 12 గంటల వరకు అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..