APP Recruitment: తెలంగాణలో 151 ఏపీపీ పోస్టులకు నోటిఫికేషన్.. రూ.1,33,630 వరకూ జీతం
Telangana APP Jobs Recruitment: తెలంగాణ స్టేట్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (TSLPRB)లో 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.
Assistant Public Prosecutors Recruitment: సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టుల నియమకానికి నోటిఫికేషన్ వెలువడింది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (Telangana State Level Police Recruitment Board - TSLPRB) వెల్లడించింది. దీనికి సంబంధించి వివిధ న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న 151 ఏపీపీ పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో మల్టీ జోన్ - 1 పరిధిలో 68, మల్టీ జోన్ -2 పరిధిలో 83 పోస్టులు ఉన్నాయి. కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాత ప్రభుత్వం విడుదల చేసిన తొలి నోటిఫికేషన్ ఇదే.
విద్యార్హత, దరఖాస్తు ఫీజు..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ/ బీఎల్ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తులకు అర్హులని పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇంటర్మీడియట్ తర్వాత ఐదేళ్ల లా కోర్సు పూర్తిచేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2021 జూలై 4 నాటికి రాష్ట్రంలోని ఏదైనా క్రిమినల్ కోర్టులో మూడేళ్లకు తగ్గకుండా అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలని వివరించింది. అలాగే శారీరకంగా ఆరోగ్యవంతులై ఉండాలని పేర్కొంది.
తెలంగాణకు చెందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.750, ఇతర కేటగిరీల వారు రూ.1500 దరఖాస్తు ఫీజు చెల్లించాలని సూచించింది. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు www.tslprb.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది.
పరీక్ష విధానం..
ఇందులో రెండు పేపర్లు (పేపర్ 1, పేపర్ 2) ఉంటాయి. మొదటి పేపర్‌లో 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1/2 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అడిగే ప్రశ్నలకు అభ్యర్థులు ఓఎంఆర్ ఆధారితంగా (OMR based ) జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. పేపర్ - 2 డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఇది కూడా 100 మార్కులకు ఉంటుంది. పేపర్ - 1లో క్వాలిఫై అయిన వారికి మాత్రమే పేపర్ - 2 పరీక్ష ఉంటుంది.
ముఖ్యమైన వివరాలు:
మొత్తం పోస్టులు: 151
మల్టీ జోన్ - 1లో 68 పోస్టులు ఉన్నాయి. (జనరల్ అభ్యర్థులు: 27, బీసీ-ఏ: 5, బీసీ-బీ: 5, బీసీ-సీ: 1, బీసీ-డీ: 5, బీసీ-ఈ: 2, ఎస్సీ-10, ఎస్టీ- 4, ఈడబ్ల్యూఎస్- 7, ఇతరులు- 2)
మల్టీ జోన్ - 2లో 83 పోస్టులు ఉన్నాయి. (జనరల్ అభ్యర్థులు: 32, బీసీ-ఏ: 7, బీసీ-బీ: 7, బీసీ-సీ: 1, బీసీ- డీ: 5, బీసీ -ఈ: 3, ఎస్సీ- 12, ఎస్టీ- 6, ఈడబ్ల్యూఎస్- 8, ఇతరులు- 2)
వేతనం: రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు ఉంటుంది. (RPS 2020 ప్రకారం)
వయోపరిమితి: జూలై 1, 2021 నాటికి 34 ఏళ్ల వయస్సు దాటకూడదు.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://www.tslprb.in/