TSLPRB: జూన్‌లో పోలీసు పరీక్షల తుది ఫలితాలు! కసరత్తు ప్రారంభించిన పోలీసు బోర్డు!
పోలీసు పరీక్షల ప్రక్రియ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో తుది ఫలితాల వెల్లడికి టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కసరత్తు ప్రారంభించింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్‌లో వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోంది.
తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి మార్చి 12న ప్రారంభమైన తుది రాతపరీక్షలు ఏప్రిల్ 30తో ముగియనున్నాయి. పరీక్షల ప్రక్రియ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో తుది ఫలితాల వెల్లడికి రాష్ట్ర పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) కసరత్తు ప్రారంభించింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్‌లో వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రణాళిక ప్రకారం జరిగితే జూన్ మొదటి వారంలో తుది ఫలితాలు వెలువడనున్నాయి. అనంతరం అభ్యంతరాల నమోదుకు అవకాశమిస్తారు.
ఏప్రిల్ 30న పోలీసు కానిస్టేబుల్ (సివిల్), ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కానిస్టేబుల్‌తోపాటు కానిస్టేబుల్ (ఐటీ & కమ్యూనికేషన్) పరీక్షలతో తుది పరీక్షల ప్రక్రియ ముగియనుంది. అయితే ఇప్పటికే పూర్తయిన పరీక్షల పత్రాల మూల్యాంకనానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. లక్షల్లో పత్రాల్ని మూల్యాంకనం చేయాల్సి ఉండటంతో అందుకు మే నెలంతా సమయం పడుతుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం అటు టీఎస్‌పీఎస్సీ, ఇటు పదోతరగతి పరీక్షల నిర్వహణలో అక్రమాలు బహిర్గతం కావడంతో ఎలాంటి ఆరోపణలకు తావివ్వకూడదని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కొంత సమయం ఎక్కువైనా సరే పక్కాగా మూల్యాంకనం చేయించేందుకు సిద్ధమవుతున్నారు. ఎంపికైన అభ్యర్థుల విద్యార్హతలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలను జూన్‌లో పరిశీలించనున్నారు. ఈక్రమంలో జిల్లాకేంద్రాల్లో దరఖాస్తు పరిశీలన వేదికలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
ఈసారి తుది రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను మాత్రమే పరిశీలించాలని క్రితంసారి నిర్ణయించారు. ఈసారీ అలాగే చేయనుండటంతో సమయం చాలావరకు ఆదా అయింది. దరఖాస్తుల పరిశీలన అనంతరం వారి నేరచరిత గురించీ ఆరా తీయనున్నారు. ఈ ప్రక్రియలన్నీ పూర్తయ్యాకే ఎంపికైన అభ్యర్థుల జాబితా వెలువడనుంది.
Also Read:
గురుకుల డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే!
తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 868 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 174 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 287 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 407 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో లెక్చరర్ పోస్టులు 785, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 39, లైబ్రేరియన్ పోస్టులు 36 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
గురుకుల జూనియర్ కళాశాలల్లో జేఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 2008 జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 253 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 291 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 1070 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో జేఎల్ పోస్టులు 1924, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 34, లైబ్రేరియన్ పోస్టులు 50 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..