SB Investigation: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్, ఎస్‌బీ విచారణ తర్వాతే శిక్షణ ప్రారంభం!
ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో తదుపరి అంకంపై టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ దృష్టి పెట్టింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రవర్తన, పూర్వాపరాల పరిశీలనతో పాటు వైద్యపరీక్షలు జరగాల్సి ఉంది.
తెలంగాణలో కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక తుది జాబితాను పోలీసు నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో తదుపరి అంకంపై టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ దృష్టి పెట్టింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రవర్తన, పూర్వాపరాల పరిశీలనతో పాటు వైద్యపరీక్షలు జరగాల్సి ఉంది. ఎంపికైన అభ్యర్థులు ముందుగా తమ ధ్రువీకరణపత్రాలపై గెజిటెడ్ అధికారుల సంతకాలతో కూడిన అటెస్టేషన్ పత్రాలను అక్టోబర్ 13 లోగా సమర్పించాల్సి ఉంది.
అదేవిధంగా గతంలో రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరిగిన 18 కేంద్రాల నుంచి ఆయా యూనిట్ల అధికారులు ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణపత్రాలను తెప్పించుకోనున్నారు. ముందుగా సమర్పించిన పత్రాలతో అటెస్టేషన్ పత్రాలను సరిపోల్చి పరిశీలించడంతో పాటు అభ్యర్థులకు ఏదైనా నేరచరిత్ర ఉందా..? అనేది తనిఖీ చేయనున్నారు. ఈ ప్రక్రియ అంతా స్పెషల్‌బ్రాంచ్ (ఎస్‌బీ) పోలీసుల పర్యవేక్షణలో జరగనుంది. 12,866 మంది పురుషులు.. 2,884 మంది మహిళ అభ్యర్థులకు సంబంధించి ఎస్‌బీ విచారణ ప్రక్రియను త్వరితగతిన చేపడితే నవంబరు 20 వరకు కొనసాగే ఆస్కారం ఉండడంతో ఆ తర్వాతే కానిస్టేబుళ్ల శిక్షణ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: టీఎస్‌జెన్‌కోలో 339 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల దరఖాస్తులు ప్రారంభం - చివరితేది ఎప్పుడంటే?
విచారణలో ఆటంకాలకు అవకాశం...
తెలంగాణలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో.. కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే కమిషనరేట్లతోపాటు ఎస్పీ కార్యాలయాల పరిధిలో ఎస్‌బీతో సహా అన్ని విభాగాల పోలీసులు బందోబస్తు పనుల్లో నిమగ్నమయ్యే అవకాశముంది. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి నగదు, మద్యం అక్రమ సరఫరాను నియంత్రించేందుకు వాహన తనిఖీలతో పాటు పోలీసు పికెట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే స్థానిక పోలీసులతో పాటు కేంద్రం నుంచి వచ్చే బలగాలకు బందోబస్తు విధులను అప్పగించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి ఎస్‌బీ విచారణకు ఆటంకం తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసు ఉద్యోగాల భర్తీలో 'కటాఫ్' తగాదా
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియలో కొత్త తగాదాలు తలెత్తుతున్నాయి. ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థుల కటాఫ్ మార్కుల కంటే, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కటాఫ్ మార్కులు చాలా తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. తెలంగాణ పోలీసుశాఖలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 587 సబ్ ఇన్‌స్పెక్టర్;16,604 కానిస్టేబుల్ పోస్టులకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసింది. లక్షల మంది యువత ఈ ఉద్యోగాల కోసం పోటీ పడ్డారు. నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కోర్టుల్లో కేసులు ఉన్నాయి. దీంతో ఈ నోటిఫికేషన్‌కు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించబోవని బోర్డు పేర్కొంది.
Also Read: టీఎస్‌జెన్‌కోలో 60 కెమిస్ట్ ఉద్యోగాలు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది ఎప్పుడంటే?
ప్రిలిమినరీ ఎగ్జామ్ వరకూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లేవు. కానీ, ఫైనల్ ఎగ్జామ్‌కు ముందట ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తూ నోటిఫికేషన్‌లో సవరణలు చేశారు. నియామకాల్లో 10 శాతం పోస్టులను ఈడబ్ల్యూఎస్ కింద కేటాయించారు. తుది పరీక్షకు సంబంధించిన ఫలితాలను మూడ్రోజుల క్రితమే పోలీసు నియామక బోర్డు విడుదల చేసింది. ప్రతి జిల్లాలోనూ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కటాఫ్ కంటే బీసీ, ఎస్సీ, ఎస్టీల కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థుల కటాఫ్ కంటే కూడా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కటాఫ్ తక్కువగా ఉంది. ప్రతి జిల్లా, ప్రతి కమిషనరేట్‌లోనూ అత్యల్ప కటాఫ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులదే ఉంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తక్కువ మంది ఉండటం, వారికి కేటాయించిన పోస్టులు ఎక్కువగా ఉండడం వల్లే వారి కటాఫ్ తక్కువగా ఉందనే అభిప్రాయం వినిపిస్తుంది.