RRB Group D Result: గుడ్ న్యూస్ - ఆర్ఆర్‌బీ 'గ్రూప్-డి' ఫలితాలు వచ్చేస్తున్నాయి, ఎప్పుడంటే? అర్హత మార్కులివే!
డిసెంబరు 24 లేదా అంతకన్నా ముందుగానే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఫలితాలతోపాటు ఫైనల్ కీ, కటాఫ్ మార్కుల వివరాలను కూడా రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ విడుదల చేయనుంది.
ఇండియన్ రైల్వేలో గ్రూప్-డి పోస్టుల భర్తీకి నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష (సీబీటీ) ఫలితాలు త్వరలోనే వెలువనున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ డిసెంబరు 13న ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం డిసెంబరు 24 లేదా అంతకన్నా ముందుగానే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఫలితాలతోపాటు ఫైనల్ కీ, కటాఫ్ మార్కుల వివరాలను కూడా రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ విడుదల చేయనుంది.
పరీక్షకు సంబంధించి 5 దశల ఫలితాలను మొత్తం కలిపి ఒకే సారి విడుదల చేయనుంది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జనవరిలో శారీరక సామర్థ్య పరీక్ష(ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు)లు నిర్వహిస్తారు. అనంతరం మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మూడు దశల్లో విజయవంతంగా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. పీఈటీ తేదీలను సంబంధిత ఆర్‌ఆర్‌బీలు త్వరలో వెల్లడించనున్నాయి. ఎంపిక ప్రక్రియపై తాజా సమాచారం కోసం అభ్యర్థులు ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ చూడాలని రైల్వే శాఖ సూచించింది.
Also Read: ఎస్‌ఐ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్‌వర్డ్ (పుట్టినతేది) వివరాలను నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపికచేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి ప్రారంభ వేతనం నెలకు రూ.18,000 జీతం (7వ పే సీపీసీ పే మ్యాట్రిక్స్ ప్రకారం).
1,03,769 కొలువులకు నియామకాలు..
గ్రూప్-డి నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(ఆర్‌ఆర్‌బీ) ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)ను దేశవ్యాప్తంగా 5 విడతల్లో సీబీటీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం 16 ఆర్‌ఆర్‌బీల పరిధుల్లో 1,03,769 గ్రూప్-డి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల కాగా సుమారు కోటి మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో జనరల్-42,355; ఎస్సీ-15,559, ఎస్టీ-7,984, ఓబీసీ-27,378; ఈడబ్ల్యూఎస్-10,381 పోస్టులను కేటాయించారు.
గ్రూప్-డి పోస్టుల భర్తీకి సంబంధించి ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 11 వరకు ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్షను వివిధ దశల్లో రైల్వే శాఖ నిర్వహించింది. అక్టోబర్‌లో పరీక్ష ప్రాథమిక కీతో పాటు.. రెస్పాన్స్ షీట్ విడుదలయ్యాయి. రైల్వేల్లో గ్రూప్-డి పోస్టుల భర్తీకి నిర్వహించిన ఆన్‌లైన్ రాతపరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అక్టోబరు 14న విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు ప్రశ్నపత్రం, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ఆన్సర్ కీపై అక్టోబరు 15 నుంచి 19 వరకు కీపై అభ్యంతరాలు స్వీకరించింది. దీంతో నవంబరు మూడోవారంలో తుది ఆన్సర్ కీతోపాటు ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.డిసెంబరు నెలాఖరులో ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా అధికారులు విడుదల చేయనున్నారు.
Also Read: ఏపీలో 6100 కానిస్టేబుల్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా!
పరీక్ష, కటాఫ్ వివరాలు ఇలా..
✪ మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) రాత పరీక్ష 5 దశల్లో నిర్వహించారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో జనరల్ సైన్స్ నుంచి 25 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్ & కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు.
✪ పరీక్ష సమయాన్ని దివ్యాంగులకు 120 నిమిషాలు, ఇతరులకు 90 నిమిషాలుగా నిర్ణయించారు.
✪ పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల చొప్పున కోత విధిస్తారు.
✪ అర్హత మార్కులను జనరల్-40%, ఈడబ్ల్యూఎస్-40%, ఓబీసీ-30%, ఎస్సీ-30%, ఎస్టీ-30% గా నిర్ణయించారు.
✪ దివ్యాంగులకు అదనంగా 2% మినహాయింపునిచ్చారు.