TS Mega DSC: 'మెగా డీఎస్సీ'కి మొదలైన కసరత్తు, దాదాపు 20 వేల టీచర్ పోస్టుల భర్తీ?
Mega DSC ద్వారా రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భర్తీ చేపట్టాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు డీఎస్సీ నిర్వహణకు కసరత్తు మొదలుపెట్టారు.
TS Mega DSC: మెగా డీఎస్సీ ద్వారా రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భర్తీ చేపట్టాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 'మెగా డీఎస్సీ' నిర్వహణపై విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఈ సారి డీఎస్సీ నిర్వహణ సజావుగా జరిగేలా న్యాయపరమైన సలహాలు తీసుకొని ముందుకుసాగాలని అధికారులు భావిస్తున్నారు. గత ప్రభుత్వం మొత్తం 5,089 పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్ జారీచేయగా.. ఇందులో స్కూల్ అసిస్టెంట్ 1,739, భాషా పండిట్లు 611, వ్యాయామ ఉపాధ్యాయులు 164, సెకండరీ గ్రేడ్ టీచర్ 2,575 పోస్టులను ఖాళీలుగా చూపారు. గతేడాది ఆగస్టు వరకు ఆ పోస్టులు లెక్కతేలాయి.
టెట్ ఉత్తీర్ణులైన వారికే పదోన్నతులు కల్పించాలనే నిబంధన దృష్ట్యా ఇప్పటికే ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయి ఉంది. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించి పదోన్నతులు ఇవ్వడం ద్వారా మరో 9 వేల వరకు ఖాళీలు తేలే వీలుంది. వీటన్నిటినీ డీఎస్సీలో చేర్చాలని అధికారులు తెలిపారు. వచ్చే మార్చి నుంచి ఉపాధ్యాయుల పదవీ విరమణలో ఖాళీ అయ్యే పోస్టులనూ కలపాల్సి ఉంటుంది. ఈ లెక్కన 19 వేల నుంచి 20 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేయాల్సి ఉంటుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు.
మళ్లీ టెట్ నిర్వహణ..!
డీఎస్సీ నిర్వహణకు అవసరమైన కసరత్తు వారం నుంచి 15 రోజుల్లో పూర్తిచేసి సీఎంకు నివేదించాలని విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. నివేదిక అందిన తర్వాత మరోసారి ముఖ్యమంత్రితో సమావేశమయ్యాక డీఎస్సీ నిర్వహణ తేదీలపై స్పష్టత వచ్చే వీలుంది. ముందుగా ఉపాధ్యాయ పదోన్నతుల కోసం టెట్‌ని విధిగా నిర్వహించాల్సి ఉంటుంది. టెట్ నిర్వహణలో జాప్యం ఉంటే పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలను ముందే గుర్తించి, వాటినీ కలిపి డీఎస్సీ నిర్వహించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
గత సెప్టెంబరులో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌కు 1.72 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి వారి సంఖ్య మరింత పెరిగే వీలుంది. ఫిబ్రవరి లేదా మార్చిలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వీలుంది. ఆ లోగా డీఎస్సీ నిర్వహించాలంటే అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని... ఎలాంటి ఆటంకాలు లేకుండా న్యాయపరమైన సలహాలు తీసుకోవాలని భావిస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను కొనసాగించి... పోస్టులు, గడువు పెంచి కొనసాగించే అవకాశాన్నీ అధికారులు పరిశీలిస్తున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9,370 ఉపాధ్యాయ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉందని గత జులైలో మంత్రివర్గ ఉపసంఘానికి విద్యాశాఖ ఆయా గణాంకాలు సమర్పించింది. అందుకు భిన్నంగా 5,089 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో 4,281 పోస్టులకు కోత పడినట్లయింది. మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1,22,386 కాగా.. ప్రస్తుతం 1,03,343 మంది పనిచేస్తున్నారు. అంటే 19,043 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో స్కూల్ అసిస్టెంట్‌లో 70 శాతం, హెడ్‌మాస్టర్ పోస్టులను పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాల్సి ఉంటుంది.
గత నోటిఫికేషన్ సమయంలోనే పదోన్నతుల ద్వారా 1947 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, 2162 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మరో 5,870 స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు కలిపి మొత్తం 9,979 భర్తీ చేస్తామని సర్కారు స్పష్టంచేసింది. నోటిఫికేషన్ పోస్టులతో వీటిని కలిపినా మొత్తం 15,068 అవుతాయి. అంటే 3,975 ఖాళీలకు గండిపడింది. విద్యాశాఖ ప్రతిపాదించిన 9,370తోపాటు గత అక్టోబరులో స్కూల్ అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా పదోన్నతులు ఇవ్వడం వల్ల మరో 450 ఖాళీలు అదనంగా వస్తాయని విద్యాశాఖ అంచనా వేసింది. ఈ లెక్కన 9,820 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అనుబంధ నోటిఫికేషన్ జారీచేస్తారా?
రాష్ట్రంలో 5,089 పోస్టులతో విడుదలైన గత డీఎస్సీ నోటిఫికేషన్‌కు మొత్తం 1.77 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల కోడ్ కారణంగా నియామక పరీక్షలు ఆగిపోయాయి. అయితే పాత నోటిఫికేషన్ రద్దు చేయకుండా.. పోస్టులను పెంచి, అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేనాటికి ఉపాధ్యాయ ఖాళీల భర్తీ పూర్తయితే విద్యార్థులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయ పదోన్నతులు పూర్తయితే మరో 8,500 వరకు ఖాళీలు ఏర్పడతాయని విద్యాశాఖ అంచనా వేస్తోంది. అయితే కోర్టు కేసులతో ఆగిపోయిన ఉపాధ్యాయ పదోన్నతులకు, డీఎస్సీకి ముడిపెడితే నియామకాలు మరింత ఆలస్యంకావచ్చు. దీనిపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.