New Labour Laws Gratuity: ఉద్యోగుల గ్రాట్యుటీపై గుడ్‌న్యూస్.. ఓవర్ టైమ్ కు రెట్టింపు డబ్బు.. కొత్త లేబర్ చట్టంలో మార్పులివే
Gratuity Rules Changed in India | దశాబ్దాలుగా అమలులో ఉన్న 29 పాత లేబర్ చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసి 4 కొత్త లేబర్ కోడ్లను అమలు చేసింది. నవంబర్ 21 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి.

New Labour Laws Gratuity: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక సంస్కరణలపై అతిపెద్ద ముందడుగు వేస్తూ 29 పాత కార్మిక చట్టాలను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా నవంబర్ 21 నుంచి నాలుగు కొత్త లేబర్ కోడ్‌లు అమలులోకి వచ్చాయి. ఈ మార్పు ఆత్మనిర్భర్ భారత్ దిశలో చారిత్రాత్మక సంస్కరణ అని, ఇది దేశంలోని ఉపాధి వ్యవస్థ, పారిశ్రామిక వ్యవస్థకు కొత్త నిర్వచనాన్ని ఇస్తుందని కేంద్రం చెబుతోంది. కొత్త నిబంధనల వల్ల దేశంలోని 40 కోట్లకు పైగా కార్మికులకు సామాజిక భద్రత లభిస్తుందని, ఇది ఇంతకు ముందు లేదని కేంద్ర మంత్రులు పేర్కొన్నారు.
కొత్త లేబర్ కోడ్‌లు అభివృద్ధి చెందిన భారత్ 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా బలమైన పునాదిని వేస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ సంస్కరణలు వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రతా కోడ్ 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020 కింద అమలు చేయనున్నారు. కొత్త లేబర్ చట్టం నిబంధనల ద్వారా కలిగే ప్రయోజనాలు, ఉద్యోగులు గుర్తించాల్సిన మార్పులివే.
1. ఆధునిక అవసరాలకు అనుగుణంగా కొత్త నిబంధనలు
దేశంలో అమల్లో ఉన్న అనేక కార్మిక చట్టాలు 1930-1950 మధ్య కాలంలో రూపొందించారు. ఇందులో గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫారమ్ వర్కర్లు, వలస కార్మికులు వంటి ఆధునిక పని గురించి ప్రస్తావించలేదు. కొత్త లేబర్ కోడ్‌లు వీరందరికీ చట్టపరమైన రక్షణను అందిస్తాయి.
2. నియామక పత్రం తప్పనిసరి, సకాలంలో వేతనానికి హామీ
ఇప్పుడు ప్రతి ఉద్యోగికి జాబ్ నియామక పత్రం ఇవ్వాలి. పలు రంగాల్లో దేశవ్యాప్తంగా కనీస వేతనం అమలు చేయాలి. సకాలంలో వేతనం చెల్లించడం చట్టపరమైన బాధ్యత కానుంది. ఇది ఉపాధిలో పారదర్శకతను, ఉద్యోగుల భద్రతను పెంచుతుంది.
3. ఉద్యోగులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు
40 సంవత్సరాలు పైబడిన ఉద్యోగులకు ఏడాదికి ఒకసారి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. గనుల తవ్వకం, రసాయనాలు, నిర్మాణం వంటి ప్రమాదకరమైన పని ప్రదేశాలలో పనిచేసే వారికి పూర్తి ఆరోగ్య భద్రత లభిస్తుంది.
4. కేవలం 1 సంవత్సరం ఉద్యోగంతో గ్రాట్యూటీ
గతంలో ఒకే ఆఫీసులో 5 సంవత్సరాల ఉద్యోగం తర్వాత లభించే గ్రాట్యూటీ ఇప్పుడు కేవలం ఒక సంవత్సరం పాటు ఓ కంపెనీలో రెగ్యూలర్ జాబ్ చేసిన తర్వాత లభిస్తుంది. ఇది ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులకు గొప్ప వరంగా మారనుంది. కానీ ఇది ఎంతవరకు అమలు అవుతుందనే దానిపై సందేహాలు నెలకొన్నాయి.
5. పనిచేసే మహిళలకు కొత్త సౌకర్యాలు
మహిళలు వారికి ఇష్టమైతే ఇప్పుడు రాత్రి షిఫ్ట్‌లలో, భద్రతా ఏర్పాట్లతో పని చేయవచ్చు. సమాన వేతనం, ఆఫీసులో రక్షణకు హామీ కూడా కొత్త కోడ్‌లో చేర్చారు ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులకు కూడా సమాన హక్కులు లభించాయి.
6. గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులకు తొలిసారిగా గుర్తింపు
ఓలా- ఉబర్ డ్రైవర్లు, జొమాటో- స్విగ్గీ డెలివరీ భాగస్వాములు, యాప్ ఆధారిత కార్మికులు ఇప్పుడు సామాజిక భద్రతా ప్రయోజనాలు నేరుగా పొందుతారు. అగ్రిగేటర్లు తమ టర్నోవర్లో 1- 2% వారికోసం సహకారం అందించాలి. UAN లింక్ చేసి ఉంటుంది, కనుక రాష్ట్రం మారినప్పటికీ ప్రయోజనాలు కొనసాగుతాయి.
7. ఓవర్ టైమ్ డబుల్ వేతనం
ఉద్యోగులకు ఇప్పుడు ఓవర్ టైమ్ చెల్లింపును రెట్టింపు వేతనంతో ఇవ్వాలి. ఇది ఓవర్ టైమ్ చెల్లింపులో పారదర్శకతను నిర్ధారిస్తుంది.
8. కాంట్రాక్ట్ కార్మికులకు శాశ్వత భద్రత
ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా కనీస వేతనం, సామాజిక భద్రత, పనికి హామీ లాంటిది లభిస్తుంది. వలస, అసంఘటిత రంగాల కార్మికులు కూడా భద్రతా ఫ్రేమ్‌వర్క్‌లో చేరతారు.
9. పరిశ్రమలకు కంప్లైయన్స్ సులభం
సింగిల్ లైసెన్స్, సింగిల్ రిటర్న్ సిస్టమ్ అమలు చేయనున్నారు. ఇది కంపెనీల కంప్లైయన్స్ భారాన్ని తగ్గిస్తుంది. పరిశ్రమలకు రెడ్ టేపిజం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
10. కార్మికులు- కంపెనీ వివాదాల కోసం కొత్త ఫార్ములా
ఇప్పుడు ఇన్‌స్పెక్టర్-కమ్ ఫెసిలిటేటర్ వ్యవస్థ అమలు చేస్తారు. ఇక్కడ అధికారులు శిక్షాత్మక చర్యలకు బదులుగా మార్గదర్శకాలపై ఫోకస్ చేస్తారు. ఉద్యోగులు నేరుగా ఫిర్యాదులను దాఖలు చేయడానికి ఇద్దరు సభ్యుల ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలి.






















