AP DSC 2026 నోటిఫికేషన్ అక్టోబర్ నెలలో విడుదల కానుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా అక్టోబర్‌లోనే ప్రారంభమవుతుంది.
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది అభ్యర్థులకు ప్రభుత్వం కీలక సమాచారం అందించింది. అక్టోబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించనుంది.

- ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ-2026 నోటిఫికేషన్ అక్టోబర్‌లో, పరీక్షలు డిసెంబర్‌లో జరుగుతాయి.
- ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగు, ఖాళీల భర్తీ లక్ష్యం.
- డీఎస్సీకి 2025-26 విద్యా సంవత్సరం సిలబస్‌ను అభ్యర్థులు అనుసరించాలి.
- అభ్యర్థులు అపోహలు పట్టించుకోకుండా, ప్రిపరేషన్‌పై దృష్టి సారించాలి.
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఉపాధ్యాయుడిగా స్థిరపడాలనేది లక్షల మంది యువత కల. రాష్ట్ర విద్యావ్యవస్థలో కీలక మార్పులు తీసుకొస్తున్న ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. గత ఏడాది నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా భారీగా పోస్టులను భర్తీ చేసింది. ఇప్పుడు మరోసారి అక్టోబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసేందుకు రెడీ అవుతోంది. అభ్యర్థులు ఎలాంటి ఆందోళనలకు గురి కాకుండా చదువుపై శ్రద్ధ పెట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారులు సూచిస్తున్నారు.
రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా, మంత్రి నారా లోకేష్ వెల్లడించిన వివరాలు ప్రకారం, రాబోయే డీఎస్సీ-2026 ప్రక్రియ అక్టోబర్ నెలలో ప్రారంభంకానుంది. అక్టోబర్‌లో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది. అభ్యర్థులకు ప్రిపరేషన్ కోసం తగిన సమయం ఇస్తూ, డిసెంబర్ నెలలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ స్పష్టమైన కాలపరిమితి అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను ప్రణాళికాబద్ధంగా మార్చుకోవడానికి ఎంతో దోహదపడుతుంది.
రాష్ట్రంలోని ప్రభుత్వం పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడం, ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తిని మెరుగుపరచడం ఈ నోటిఫికేషన్ ప్రధాన ఉద్దేశం. మెగా డీఎస్సీ-2025 ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేసినప్పటికీ ఇంకా మిగిలిన ఉన్న ఖాళీలను భర్తీ చేయడం ద్వారా యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. సోషల్ మీడియాలో నియామక ప్రక్రియపై వస్తున్న తప్పుడు ప్రచారాలను అరికట్టడానికి, అభ్యర్థుల్లో భరోసా కల్పించడానికి ఈ కొత్త నోటిఫికేషన్ ప్రకటన ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ల అమలులో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ప్రతి దశలోనూ పారదర్శకత పాటిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. ఈసారి అంతే పారదర్శకతతో ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
డీఎస్సీ 2026 సిలబస్
రాబోయే డీఎస్సీ పరీక్షల కోసం విద్యాశాఖ సజెస్టివ్ సిలబస్‌ను ఇప్పటికే రూపొందించింది. 2025-26 విద్యా సంవత్సరం సిలబస్‌ను అభ్యర్థులు అనుసరించాల్సి ఉంటుంది.
ఎస్జీటీ- ఎస్జీటీ పోస్టులకు మొత్తం 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్(8 మార్కులు), పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్(4 మార్కులు), ఎడ్యుకేషనల్ సైకాలజీ (8మార్కులు) కంటెంట్ అండ్ మెథడాలజీ(60 మార్కులు) ఉంటాయి.
స్కూల్ అసిస్టెంట్(SA):- స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు జీకే (10 మార్కులు), పర్స్పెక్టివ్స్(5 మార్కులు), సైకాలజీ(5 మార్కులు), సబ్జెక్ట్ కంటెంట్(40 మార్కులు)తోపాటు మెథడాలజీ(20 మార్కులు)కీలక భూమిక పోషిస్తాయి.
భాషా అంశాలు: తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, కన్నడ, ఒడియా, తమిళం, సంస్కృతం వంటి భాషలకు సంబంధించి 3 నుంచి 10వ తరగతి స్థాయి వరకు ఉన్న సాహిత్యం, వ్యాకరణం, బోధన పద్ధతులపై ప్రశ్నలు వస్తాయి.
బోధనేతర సబ్జెక్టులు: గణితం, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులలో ఇంటర్మీడియట్ స్థాయి వరకు లోతైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి.
పర్స్పెక్టివ్ అండ్ సైకాలజీ: డీఎస్సీలో కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా, ఒక ఉపాధ్యాయుడికి ఉండాల్సిన సామాజిక స్పృహ, మానసిక శాస్త్ర అవగాహన కూడా పరీక్షిస్తారు. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విభాగంలో భారతీయ విద్యా చరిత్ర, ఉపాధ్యాయ సాధికారత, సమకాలీన విద్యా ధోరణులు, ఎడ్యుకేషనల్ యాక్ట్స్, జాతీయ విద్యా విధానం 2020 వంటి అంశాలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. అదే విధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీలో శిశు వికాసం, అభ్యసనం, వ్యక్తిత్వం వంటి అంశాల ద్వారా విద్యార్థుల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పరీక్షిస్తారు.
స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు
దివ్యాంగులైన విద్యార్థులకు బోధించేందుకు ప్రత్యేక ఉపాధ్యాయులు అవసరం. దీని కోసం డీఎస్సీలో ప్రత్యేకంగా ఎస్జీటీ, టీజీటీ విభాగాల్లో పోస్టులు భర్తీ చేస్తారు. వినికిడి లోపం, దృష్టి లోపం కలిగిన విద్యార్థులకు బోధించే మెళకువలు, వారి కోసం ప్రత్యేక సిలబస్, ఆర్సీఐ నిబంధనల ప్రకారం పరీక్ష నిర్వహిస్తారు.
అభ్యర్థులకు సూచనలు
నోటిఫికేషన్ రాక ముందే అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను ప్రారంభించడం మంచిది. సోషల్ మీడియాలో వచ్చే చర్చలు, అపోహలను పట్టించుకోకుండా ప్రిపరేషన్‌పై ఫోకస్ చేయాలని ప్రభుత్వం చెబుతోంది. పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా చదవడంతోపాటు , పాత్ర ప్రశ్నా పత్రాలను విశ్లేషించుకోవడం వల్ల మంచి మార్కులు సాధించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
Frequently Asked Questions
AP DSC 2026 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుంది?
AP DSC 2026 పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి?
విద్యాశాఖ నిర్ణయం ప్రకారం, AP DSC 2026 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు డిసెంబర్ నెలలో నిర్వహించబడతాయి.
ఈ DSC నోటిఫికేషన్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడం, ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తిని మెరుగుపరచడం, ఖాళీ పోస్టులు భర్తీ చేసి యువతకు ఉపాధి కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం.
DSC 2026 పరీక్షలకు అభ్యర్థులు ఏ సిలబస్ అనుసరించాలి?
అభ్యర్థులు 2025-26 విద్యా సంవత్సరం సిలబస్‌ను అనుసరించాల్సి ఉంటుంది. విద్యాశాఖ ఇప్పటికే సజెస్టివ్ సిలబస్‌ను రూపొందించింది.
ట్రెండింగ్ వార్తలు





















