World Environment Day: సిగరెట్ తాగితే పన్ను కట్టాల్సిందే, ఆ దేశాల్లో కఠిన నిబంధనలు
ధూమపానం వల్ల మనుషులకే కాదు భూమికీ హానికరం అంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ.
సిగరెట్ పీకలతో భూమి విషపూరితం
ధూమపానం హానికరం అని ఎక్కడ కనిపించినా చాలా సిల్లీగా తీసుకుంటున్నారు ప్రజలు. సినిమా ముందు యాడ్స్ వేసినా అది కూడా హాస్యాస్పదమే అవుతోంది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయకూడదని చెబుతున్నా ఆ నిబంధనను పట్టించుకునే వారే లేరు. మనమింత లైట్‌గా తీసుకుంటున్న సిగరెట్ వల్ల భూమికి ఎంత నష్టం జరుగుతోందో తెలుసా..? మరీ ముఖ్యంగా కాల్చి పారేసిన సిగరెట్లతో ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో ఊహించగలరా..? ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ సిగరెట్ పీకలు పడేస్తుండటం వల్ల భూమి విషపూరితం అవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.
పొగాకుతో మానవాభివృద్ధికి ఆటంకం: డబ్ల్యూహెచ్‌ఓ
పొగాకు సాగు నుంచి ఉత్పత్తి, సరఫరా, వినియోగంతోనే భూమికి తీరని నష్టం జరుగుతోందని ఇప్పటికే పర్యావరణవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక ప్రకారం..పొగాకు పరిశ్రమలతో పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. పైగా ఈ ఎఫెక్ట్ ఏటా పెరుగుతూ పోతోందని అంటోంది WHO. పొగాకు వినియోగాన్ని నియంత్రించటం పరిశోధకులు, నేతల చేతుల్లోనే ఉందని గుర్తు చేసింది. ధూమపానంతో మనుషులకే కాకుండా పర్యావరణానికీ హాని కలుగుతోంది. ధూమపానం చేసే వాళ్లపైనే కాదు పొగాకు ఉత్పత్తిలో భాగమయ్యే వారిపైనా ప్రభావం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెబుతోంది. దీర్ఘకాలంలో ఇదే మానవాభివృద్ధికి ఆటంకంగా మారుతుందని హెచ్చరించింది. రోడ్లపైన, పార్క్‌లలో ఇలా ఇష్టమొచ్చిన చోట సిగరెట్లు తాగి పారేస్తుండటం వల్ల దశల వారీగా భూమి విషపూరితమవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
సిగరెట్ తయారీ కోసం సహజ వనరులు పణం
పొగాకులో ఉండే రసాయనాలు వాయు కాలుష్యానికి దారి తీస్తాయి. పొగాకు సాగుకు చాలా నీళ్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఓ సిగరెట్ తయారీకి సగటున మూడున్నర లీటర్ల నీరు అవసరమవుతాయి. అంటే ఆ మేరకు విలువైన జల వనరులు వృథా అవుతున్నట్టు లెక్క. ప్రపంచవ్యాప్తంగా ఏటా 4.5 లక్షల కోట్లకు పైగా కాలిపోయిన సిగరెట్లు వీధుల్లో నుంచి సేకరిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరిస్తోంది. వీటి కారణంగా పర్యావరణ కాలుష్యంతో పాటు అగ్నిప్రమాదాలూ చోటు చేసుకునే అవకాశాలున్నాయి. ఏటా 6 లక్షల 80 వేల టన్నులకు పైగా పొగాకు వ్యర్థాలు పోగు పడుతున్నాయి. కాల్చి పారేసిన సిగరెట్లతో 9 లక్షల టన్నుల వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ధూమపానం చేసే వారిలో 65% మంది రోడ్లమీదే పారేస్తుండటమూ సమస్యల్ని పెంచుతోంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల కోట్ల సిగరెట్లు తయారవుతున్నాయి.
సిగరెట్ పొగలో దాదాపు 7 వేల రకాల హానికర రసాయనాలు కనుగొన్నారు. వీటిలో 70 రసాయనాలు మనుషుల్లో, జంతువుల్లో క్యాన్సర్‌కి కారకమవుతోంది. 300 సిగరెట్ల తయారీకి ఒక చెట్టుని నరికివేయాల్సి వస్తోంది. ఈ సమస్యల్ని గమనించే యూరోపియన్ దేశాలు పొగాకు ఉత్పత్తులపై పర్యావరణ పన్ను విధిస్తున్నాయి. వీటి వల్ల పర్యావరణానికి ఎంత నష్టం వాటిల్లుతోందని అంచనా వేసి అందుకు తగ్గట్టుగా పన్నులు వసూలు చేస్తున్నారు.