Monsoon Diseases: వానల్లో వ్యాధులు - హెపటైటిస్ A, కలరా, టైఫాయిడ్‌లు పొంచి ఉన్నాయ్.. ఈ జాగ్రత్తలు పాటించండి
వర్షాకాలంలో నీరు, ఆహారం చాలా సులభంగా కలుషితం అవుతాయి. అందువల్ల సూక్ష్మక్రిముల వ్యాప్తి చాలా ఎక్కువగా ఉండి అంటువ్యాధులు ప్రభలుతాయి.
వర్షాకాలంలో నీరు చాలా రకాల సూక్ష్మజీవుల ద్వారా కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. అలాంటి కలుషిత నీరు, ఆహారం ద్వారా టైఫాయిడ్, హెపటైటిస్ A, కలరా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి.
నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు
వర్షాకాలం ప్రారంభం కాగానే ఎండ వేడి నుంచి ఉపశమనం దొరికిందని ఆనందపడే లోగా అంటువ్యాధుల వ్యాప్తి మొదలవుతుంది. ముఖ్యంగా కలుషిత ఆహారం ద్వారా, నీటి ద్వారా వ్యాపించే కలరా, టైఫాయిడ్ వంటివి కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా పరిణమిస్తాయి.
కలరా
నీళ్ల ద్వారా వ్యాపించే వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా చెప్పవచ్చు. ఇందులో నీళ్ల విరేచనాలు, వాంతులు, తీవ్రమైన డీహైడ్రేషన్ వల్ల కండారాల్లో క్రాంప్స్ వంటి లక్షణాలు వస్తాయి. కలరా వ్యాప్తికి కంటామినేటెడ్ నీళ్లు, ఐస్, పానీయాలు, ఆహారం వంటివి కారణం అవుతాయి. అంతేకాదు కలుషిత నీటితో పండించిన కూరగాయలు, కలుషిత నీటిలో పెరిగిన చేపలు, సీఫూడ్ వంటి వాటి వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
టైఫాయిడ్
టైఫాయిడ్ లో తీవ్రమైన జ్వరం ఉంటుంది. ముఖ్యంగా రోజు గడిచేకొద్దీ జ్వరం తీవ్రమవుతూ ఉంటుంది. ఇదే కాకుండా కడుపులో నొప్పి ఉండవచ్చు. మలబద్దకం లేదా విరేచనాలు, తలనొప్పి వేధిస్తాయి. ముఖ్యంగా చాలా కాలం పాటు కొనసాగే జ్వరం, నీరసం, తలనొప్పి, వికారంగా ఉండడం వంటి బాధలు తప్పవు. టైఫాయిడ్ నుంచి కోలుకోవడానికి సమయం పడుతుంది కూడా.
హెపటైటిస్ A
హెపటైటిస్ A, E లో జ్వరం, ఆకలి మందగించడం, వికారం, వాంతులు, కడుపులో అసౌకర్యంగా ఉండడం, కళ్లలలో తెల్లగుడ్డు పచ్చగా మారడం, చర్మం రంగు పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. హెపటైటిస్ A లో మోస్తరు నుంచి తీవ్రమైన జ్వరం, ఆకలి లేకపోవడం, విరేచనాలు, వికారం, కడుపులో అసౌకర్యం, మూత్రం ముదురు రంగులో రావడం, కామెర్లు వంటి లక్షణాలు ప్రత్యేకం.
టైఫాయిడ్, హెపటైటిస్ A బ్యాక్టీరియా వల్ల సంక్రమించే వ్యాధులు. ఈ వ్యాధులకు చికిత్సగా తప్పకుండా యాంటీబయోటిక్ మందులు ఒక నిర్ధిష్టమైన కోర్సు వాడాల్సి ఉంటుంది. హెపటైటిస్ వైరల్ రోగం. ఈ వ్యాధికి లక్షణాలు తగ్గించే చికిత్సలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఈ వ్యాధులను నివారించేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
- సురక్షితమైన మంచి నీటిని మాత్రమే ఉపయోగించాలి.
- చేతులు తరచుగా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
- భోజనానికి ముందు, టాయిలెట్ ఉపయోగించిన తర్వాత మరచిపోకుండా చేతులు కడుక్కోవాలి.
- బాగా ఉడికిన ఆహారం మాత్రమే తినాలి. పచ్చిగా తినేవి, సగం ఉడికించినవి ఈ సీజన్ లో తినకపోవడమే మంచిది.
- ఇంట్లో శుభ్రంగా వండిన ఆహారం తీసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి.
- వీలైనంత వరకు వీధుల్లో దొరికే ఆహారం తీసుకోవద్దు.
- తాజాగా వండిన ఆహారం మాత్రమే తీసుకోవాలి.
Also Read : వర్షా కాలంలో దగ్గు, జలుబులకు ఆయుర్వేద పరిష్కారాలు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.