Mohan Babu - Manchu Manoj: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు మీద ఫిర్యాదు చేశాడనే వార్త ఆదివారం ఉదయం పరిశ్రమ ప్రముఖులతో పాటు ప్రజలను సైతం ఉలిక్కిపడేలా చేసింది. అయితే అందులో నిజం లేదు. అసలు విషయం ఏమిటంటే?
లెజెండరీ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, కలెక్షన్ కింగ్, డాక్టర్ మంచు మోహన్ బాబు (Mohan Babu) మీద ఆయన రెండో కుమారుడు మనోజ్ (Manchu Manoj) ఫిర్యాదు చేశాడనే వార్త ఆదివారం ఉదయం తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు సైతం ఉలిక్కిపడేలా చేసింది. అయితే... అందులో నిజం లేదు! అసలు గొడవ జరగలేదా? అటువంటి తరుణంలో కొట్లాట అని బయటకు ఎందుకు వచ్చింది? ఈ రోజు ఉదయం మోహన్ బాబు ఎక్కడ ఉన్నారు? వంటి వివరాల్లోకి వెళితే...
విశ్రాంతిలో మోహన్ బాబు... ఇంట్లోనే ఉన్నారు!
మోహన్ బాబు ఆదివారం కనుక ఎటువంటి పనులు పెట్టుకోలేదని, ఈ రోజు ఉదయం ఆయన శంషాబాద్ సమీపంలోని తమ సొంత ఇంటిలోనే ఉన్నారని మంచు ఫ్యామిలీ సన్నిహితుల ద్వారా సమాచారం అందింది. బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత కాసేపు ఆయన కునుకు తీశారట. మోహన్ బాబు నిద్రలో ఉన్న సమయంలో ఆయనకు తనయుడికి మధ్య గొడవ జరిగిందని న్యూస్ ఛానళ్లలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను నిద్ర లేపారని, ఆ వార్తలు చూసి షాక్ అయ్యారని తెలిసింది.
అమెరికాలో మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు!
మోహన్ బాబు హైదరాబాద్ సిటీలో ఉండే ఆయన పెద్ద కుమారుడు విష్ణు మంచు (Vishnu Manchu) అమెరికాలో ఉన్నారు. కొత్త సినిమా కన్నప్ప విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ నిమిత్తం విష్ణు అమెరికా వెళ్ళినట్లు తెలిసింది. సినిమా పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. మరి, మీడియాలో ఈ విధమైన ప్రచారం జరిగిందనే విషయం ఆయన వరకు వెళ్లిందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
మనోజ్ ఎక్కడ ఉన్నారు? గొడవ జరిగిందా? లేదా?
మంచు మనోజ్ సైతం హైదరాబాద్ సిటీలోనే ఉన్నారు. తండ్రితో ఆయనకు గొడవ జరిగిందనే వార్తల్లో ఎటువంటి నిజం లేదని, ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేయవద్దని మంచు కుటుంబం మీడియాలో వస్తున్న కథనాలను ఖండించింది. అది నిజమే. అయితే... అసలు గొడవ జరిగిందా? లేదా? అంటే తండ్రి తనయుల మధ్య ఎటువంటి గొడవ జరగలేదు.
Also Read: హన్సిక నోటి వెంట జానీ మాస్టర్ పేరు... కేసులకు భయపడకుండా చెప్పేసిందిగా!
మోహన్ బాబు యూనివర్సిటీ (Mohan Babu University - MBU) వ్యవహారాలు చూసే వినయ్ అనే వ్యక్తికి, మనోజ్ మంచుకు మధ్య గొడవ జరిగిందని తెలిసింది. వాళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది అని వివరాలు తెలియాల్సి ఉంది. ఆ గొడవ మీద 100కు డయల్ చేసి చెప్పడం, అది మీడియాకు లీక్ కావడం వెంట వెంటనే జరగాయి. అంతే తప్ప... ఏ పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు నమోదు కాలేదు.
మనోజ్, వినయ్ మధ్య గొడవ జరిగితే దానిని తండ్రి మోహన్ బాబు, తనయుడు మనోజ్ మధ్య గొడవగా కొంతమంది చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇంకొంత మంది ఔత్సాహికులు మరో అడుగు ముందుకు వేసి... గాయాలతో మనోజ్ పోలీస్ స్టేషన్ వచ్చారని ఊహాజనిత కథనాలు అల్లేశారు. ఇప్పటివరకు మనోజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళలేదు. అయితే ఫోన్ చేయడం మాత్రం నిజం. ఆయనకు గాయాలు కాలేదు. అయితే రక్తం కారుతున్న గాయాలతో మనోజ్ ఫిర్యాదు చేశాడని పలువురు పేర్కొనడం విశేషం. ఆ మధ్య ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో విద్యార్థులకు మద్దతుగా మనోజ్ మాట్లాడారు. ఒకవేళ ఆ అంశంలో వినయ్ అనే వ్యక్తితో ఆయన మాట్లాడారని తెలుస్తోంది. ఆ సమయంలో ఆగ్రహం వ్యక్తం చేసి ఉండొచ్చు. తండ్రి కొడుకులు మధ్య కొట్లాట జరిగిందనేది పూర్తిగా అవాస్తవం.
Also Read: పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్... ఇక మెగా వర్సెస్ అల్లు వివాదానికి ఎండ్ కార్డ్!?