Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Hyderabad News: నటుడు మంచు మనోజ్ ఆస్పత్రిలో చేరారు. కాలికి గాయంతో ఆయన మరో వ్యక్తి సాయంతో ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు పరీక్షలు నిర్వహించారు.
Actor Manchu Manoj Joined In Banjarahills Hospital: ప్రముఖ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) ఆస్పత్రిలో చేరారు. బంజారాహిల్స్‌లోని TX ఆస్పత్రికి ఆయన తన భార్య మౌనికతో కలిసి ఆదివారం సాయంత్రం వచ్చారు. ఉదయం తండ్రి మోహన్ బాబు అనుచరులు తనపై దాడి చేసినట్లుగా ఫిర్యాదు చేశారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వచ్చారు. కాలికి గాయంతో నడవడానికి ఇబ్బంది పడుతున్న మనోజ్ మరో వ్యక్తి సాయంతో ఆస్పత్రి లోపలికి వెళ్లారు. వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆస్పత్రి లోపలికి వెళ్లే ముందు అక్కడికి చేరుకున్న మీడియా వర్గాలు దీనిపై ప్రశ్నించగా ఆయన స్పందించలేదు. కాగా, మంచు మనోజ్ నడవడానికి ఇబ్బంది పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇదీ జరిగింది
Manchu Manoj was admitted to a Banjara Hills hospital after an alleged attack at his residence. He claims Vidyaniketan staff were involved.#ManchuManoj #MohanBabu#ManchuFamily #ManchuVishnu pic.twitter.com/EG3VuAqZmR
— WC (@whynotcinemasHQ) December 8, 2024
మంచు ఫ్యామిలీ మరోసారి గొడవలు జరిగాయంటూ ఆదివారం ఉదయం వార్తలు హల్చల్ చేశాయి. ఆస్తుల విషయంలో మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు మనోజ్ మధ్య వివాదం జరిగిందని.. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని పెద్దఎత్తున ప్రచారం సాగింది. అయితే, దీనిపై మోహన్ బాబు కుటుంబం స్పందించింది. అసత్యాలు ప్రచారం చెయ్యొద్దంటూ హెచ్చరించింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మనోజ్ ఒక్కసారిగా గాయాలతో ఆస్పత్రికి రావడంతో అటు సినీ పరిశ్రమ, ఇటు మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఆసక్తికరంగా పోలీసుల స్టేట్‌మెంట్
మరోవైపు, మోహన్ బాబు, మంచు మనోజ్‌లు పరస్పరం ఒకరిపై ఒకరు డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. తండ్రి మోహన్ బాబు తనపై దాడి చేశాడని మనోజ్.. తన కుమారుడే తనపై దాడి చేశాడని మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇరువురికీ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించినట్లు పోలీసులు చెప్పడం గమనార్హం.
మంచు ఫ్యామిలీ ఏం చెప్పిందంటే.?
అటు, ఈ అంశంపై మంచు ఫ్యామిలీ స్పందించింది. ఆధారాలు లేకుండా అలాంటి ప్రచారం చెయ్యొద్దని పేర్కొంది. ఆ వార్తలను మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు టీమ్ ఖండించింది. కాగా, గతంలోనూ మంచు మనోజ్, విష్ణు మధ్య గొడవలు జరిగినట్లు వార్తలు హల్చల్ చేశాయి.
కాగా, మోహన్ బాబు ఆదివారం శంషాబాద్ సమీపంలోని తమ సొంత ఇంట్లోనే ఉన్నారని మంచు ఫ్యామిలీ సన్నిహితుల ద్వారా సమాచారం. బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత కాసేపు ఆయన కునుకు తీశారట. మోహన్ బాబు నిద్రలో ఉన్న సమయంలో ఆయనకు తనయుడికి మధ్య గొడవ జరిగిందని న్యూస్ ఛానళ్లలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను నిద్ర లేపారని, ఆ వార్తలు చూసి షాక్ అయ్యారని తెలిసింది. వెనువెంటనే ఈ ప్రచారాన్ని మంచు ఫ్యామిలీ ఖండించింది.