T Fiber: 'తక్కువ ధరకే ఇంటర్నెట్, ఇంటి నుంచే 150 రకాల సేవలు' - టీఫైబర్, మీ సేవ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
Telangana News: గ్రామాల్లో ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే ఉద్దేశంతో చేపట్టిన టీ ఫైబర్ ప్రాజెక్టును మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అలాగే, మీ సేవ మొబైల్ యాప్ సేవలను సైతం ప్రారంభించారు.

Minister Sridhar Babu Started T Fiber And Mee Seva Mobile App: గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ ఇంటర్నెట్ అందించేందుకు ఉద్దేశించిన 'టీ ఫైబర్' (T Fiber) ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ సేవలను మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ప్రారంభించారు. టీ ఫైబర్ ద్వారా మొబైల్, కంప్యూటర్, టీవీ వినియోగించవచ్చని ఆయన తెలిపారు. సంగారెడ్డి జిల్లా శ్రీరాంపూర్ వాసులతో మంత్రి మాట్లాడారు. ఈ సేవలను పరిశీలించి మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. దీంతో పాటు 'మీ సేవ' మొబైల్ యాప్ సేవలను సైతం ప్రారంభించారు. రైతులకు రుణమాఫీ, బోనస్ కోసం మొబైల్ యాప్ ప్రారంభించామని చెప్పారు.
అసలేంటీ టీ ఫైబర్..?
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ విప్లవానికి నాంది పలికే దిశగా రాష్ట్రంలోని లక్షల ఇళ్లకు దశల వారీగా రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ (Interner Connection) అందుబాటులోకి వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇది వైఫై కనెక్షన్ వంటిది. ఈ కనెక్షన్ తీసుకుంటే వర్చువల్ నెట్‌వర్క్‌తో పాటు టెలిఫోన్, పలు తెలుగు ఓటీటీలను గ్రామస్థులు చూడడానికి వీలు పడుతుంది. టీ ఫైబర్ పైలెట్ ప్రాజెక్టు కింద 3 జిల్లాల్లో ఒక్కో గ్రామంలో 4 వేల కుటుంబాలకు కేబుల్ టీవీ సేవలతో కూడిన బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభమవుతాయి. తొలి దశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2,096 పంచాయతీల్లో అమలు చేయనున్నారు. ఆదివారం పెద్దపల్లిలోని అడవి శ్రీరాంపూర్, సంగారెడ్డి సంగుపేట, నారాయణపేటలోని మద్దూర్‌లో తొలుత ఈ సేవలు ప్రారంభమయ్యాయి.
ఈ కనెక్షన్ తీసుకుంటే ప్రతీ ఇంట్లో ఉన్న టీవీనే కంప్యూటర్‌గా మారుతుంది. ప్రతీ ఇంటికి రూ.300కే.. 20 ఎంబీబీఎస్ స్పీడ్‌తో కనెక్షన్ ఇస్తారు. దీంతో చెల్లింపులు కూడా చెయ్యొచ్చు. గ్రామంలోని అన్ని కార్యాలయాలు, స్కూళ్లకు కూడా కనెక్షన్ ఇవ్వనున్నారు. టీవీనే కంప్యూటర్‌గా మారుతుండడంతో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ జంక్షన్లు, ఇతర చోట్ల కూడా అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఫైబర్ నెట్‌తో (Fiber Net) అనుసంధానం చేయబోతున్నారు. ఇవి ప్రతి పోలీస్ స్టేషన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానమవుతాయి.
'ఇంటి నుంచే 150 రకాల సేవలు'
అలాగే, ప్రజలు ఇంటి నుంచే పౌర సేవలు పొందేలా మీసేవ మొబైల్ యాప్‌ను సైతం మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. దీని ద్వారా 150 రకాల పౌర సేవలు అందనున్నాయి. షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్లు, సమీకృత కలెక్టరేట్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ఇంటరాక్టివ్ కియోస్క్ ద్వారా ప్రజలు ఈ సేవలు పొందొచ్చు. దరఖాస్తు నింపడం, చెల్లింపులు చేయడం, సర్టిఫికెట్ ప్రింట్ తీసుకునే సదుపాయం సైతం అందుబాటులో ఉంటుంది. పర్యాటక శాఖ హోటల్స్, పర్యాటక ప్యాకేజీల బుకింగ్, దివ్యాంగుల గుర్తింపు కార్డులు, సదరం సర్టిఫికెట్ల జారీ ఇతర సేవలు ఈ యాప్ ద్వారా పొందొచ్చు.





















