Praja Palana Vijayotsavalu: హైదరాబాద్ మెట్రో కారిడార్లు, స్టేషన్లలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సంరంభం
Telangana News | తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రో కారిడార్లలో తెలంగాణ తల్లి విగ్రహం రూపం పోస్టర్లు ప్రదర్శిస్తున్నారు.
Praja Palana Vijayotsavalu Posters at Hyderabad Metro | హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనను పురస్కరించుకుని ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాలకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రజాపాలన విజయోత్సవాలను హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ (Hyderabad Metro Rail) ఘనంగా నిర్వహిస్తోంది. తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి దిశానిర్దేశం తో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహ (Telangana Talli Statue) నమూనా చిత్రాన్ని రద్దీ ఎక్కువగా ఉండే మెట్రో స్టేషన్లలో ప్రదర్శిస్తున్నారు.
తెలంగాణ తల్లి ఫొటోలు విస్తృతంగా ప్రచారం
'జయ జయహే తెలంగాణ - జననీ జయకేతనం' అంటూ తెలంగాణ స్ఫూర్తిని అంది పుచ్చుకుంటూ హైదరాబాద్ మెట్రో రైల్ మొత్తం 25 మెట్రో స్టేషన్లలో కొత్తగా రూపొందించిన 'తెలంగాణ తల్లి' చిత్రాల ((Telangana Talli Photos)ను ఏర్పాటు చేసినట్టు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 9న రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకకు హాజరు కావాలని ప్రధాన ప్రతిపక్షనేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రభుత్వం ఆహ్వానించడం తెలిసిందే.
మెట్రో కారిడార్లు, స్టేషన్లలో ప్రజా పాలన విజయోత్సవాల పోస్టర్లు
ముఖ్యమంత్రి రేవంత్ సూచనల మేరకు ప్రజాపాలన విజయోత్సవాలను హైదరాబాద్ మెట్రో స్టేషన్ల (Hyderabad Metro Stations) పరిధిలో జోరుగా నిర్వహిస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. మెట్రో రైల్ రెండవ దశ ముఖ్య అంశాలను తెలియజేప్పేలా మెట్రో స్టేషన్ల కాన్ కోర్స్ లు, ప్లాట్ ఫామ్ లపైన స్టాండీలను ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రధాన మార్గాలలో మెట్రో పిల్లర్లకు హోర్డింగ్ లను ఏర్పాటు చేసి ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలను, మెట్రో సాధిస్తున్న ప్రగతిని వివరించామని ఎన్వీఎస్ వెల్లడించారు. అందమైన విద్యుద్దీపాల అలంకరణతో ముఖ్యమైన మెట్రో మార్గాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంవత్సర పాలన విజయాలను ఘనంగా ప్రతిబింబించేలా హైదరాబాద్ మెట్రో రైల్ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొంటోంది.
ఐఏఎఫ్ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ ప్రభుత్వ ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా హైదరాబాద్ లో భారత వైమానిక దళం నేడు భారీ ఎయిర్ షో నిర్వహిస్తోంది. ట్యాంక్ బండ్ వద్ద హుస్పేన్ సాగర్ పై ఐఏఎఫ్ విన్యాసాలు ప్రదర్శించనుంది. ప్రపంచంలోని టాప్ 5 టీమ్ మాత్రమే చేయగల విన్యాసాలను ఇక్కడ ప్రదర్శించనుండటం విశేషం. ఐఏఎఫ్ ఎయిర్ షో కారణంగా నేడు హైదరాబాద్ లో ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్కింగ్ ప్లేసుల వివరాలు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. వీవీ విగ్రహం, ఖైరతాబాద్, పాత PS సైఫాబాద్, ఇక్బాల్ మినార్, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, లిబర్టీ, రవీంద్ర భారతి, అంబేద్కర్ విగ్రహం, కవాడిగూడ కూడలి, కట్టమైసమ్మ, ఇందిరా పార్క్ జంక్షన్, కర్బలా మైదాన్, రాణిగంజ్, నల్లగుట్ట జంక్షన్లలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని వాహనదారులకు సూచించారు.