Sleep Deprivation Affects: సరిగా నిద్రపోకుంటే గుండెకు చిల్లు పడటం ఖాయం!
మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సరైన నిద్ర లేకపోవడం కూడా హార్ట్‌కు చాలా ప్రమాదకరమని లేటెస్ట్ స్టడీస్ చెబుతున్నాయి.
మీ గుండె దాదాపు పిడికిలి పరిమాణంలో ఉంటుంది. శరీరమంతా రక్తాన్ని పంపింగ్ చేయడమే దీనిపని. దాని పని అది సక్రమంగా చేయాలంటే మాత్రం మీరు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సరైన ఆహారం తీసుకోకపోవడం, పరిమిత వ్యాయామం, ధూమపానం గుండెకు చాలా హానికరం. కానీ మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, నిద్ర లేమి కూడా అనారోగ్యకరమైన అలవాటు. ఇది అధిక రక్తపోటు, అధిక ఒత్తిడి స్థాయిలను పెంచి గుండెకు చేటు తీసుకొస్తుందని వైద్యులు చెబుతున్నారు.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండెపోటు, ఊబకాయం, మధుమేహం, స్ట్రోక్ వంటి అనేక గుండె సమస్యలకు నిద్రలేమి ప్రధాన కారణం. ఇటీవల తెల్లవారుజామున విపరీతంగా కాటెకోలమైన్‌లను స్రవించే వ్యక్తులు ఉదయం 4-8 గంటల మధ్య స్ట్రోక్ లేదా గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి, నిద్రకు టైం పాటించని వాళ్లు, నిద్రలేమితో బాధపడే వాళ్లు దీర్ఘకాలంలో గుండె సంబంధిత వ్యాధులకు బలయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వయసు పెరిగే కొద్ది నిద్రపోయే వ్యవధి తగ్గుతుందని పేర్కొన్నారు వైద్యులు. పెద్దలు 7-9 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యమంటున్నారు. అయితే 5-6 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు 12-14 గంటల నిద్ర అవసరమని గట్టిగా చెబుతున్నారు.
మెరుగైన నిద్ర కోసం ఈ చిట్కాలు పాటించండి
రోజంతా మీరు ఎంత కష్టపడినా.. పడుకునే ముందు మాత్రం పని చేయకుండా ఉండేలా చూసుకోండి. ఎక్కువ శారీరక శరమ ఉండేలా ప్రయత్నించండి.
రోజూ స్థిరమైన నిద్ర ఉండేలా దినచర్యను మార్చుకోండి. ప్రతి రాత్రి ఒకే సమయంలో పడుకోండి. ఒకే సమయంలో మేల్కొండి.
సూర్య కాంతి తగిలేందుకు ఉదయం వాకింగ్‌కు వెళ్లండి.
నిద్రపోవడానికి ముందు తినడం, తాగడం మానుకోండి. ముఖ్యంగా కొవ్వు, చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలు అసలు తీసుకోకండి. పడుకునే ముందు మద్యానికి దూరంగా ఉండండి.
ఏ వయసు వారు ఎంత నిద్రపోవాలంటే...
పుట్టినప్పటి నుంచి 3 నెలల వయసు: 14 నుంచి 17 గంటలు
4 నుంచి 11 నెలలు : 12 నుంచి 16 గంటలు
1 నుంచి 2 సంవత్సరాలు: 11 నుంచి 14 గంటలు
3 నుంచి 5 సంవత్సరాలు : 10 నుంచి 13 గంటలు
6 నుంచి 12 సంవత్సరాలు: 9 నుంచి 12 గంటలు
13 నుంచి 18 సంవత్సరాలు: 8 నుంచి 10 గంటలు
18 నుంచి 64 సంవత్సరాలు: 7 నుంచి 9 గంటలు
65 ఏళ్లపై బడిన వారు : 7 నుంచి 8 గంటలు