Brain Tumor: మూత్రపరీక్షతో బ్రెయిన్ ట్యూమర్ ఉందో లేదో కనిపెట్టేసే కొత్త పరికరం - శాస్త్రవేత్తల సృష్టి
అతిపెద్ద అనారోగ్యాల్లో బ్రెయిన్ ట్యూమర్ ఒకటి. ఇది వస్తే జీవితం చివరి దశకు చేరుకున్నట్టే.
మనదేశంలో బ్రెయిన్ ట్యూమర్ కేసులు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వారిలోనే బ్రెయిన్ ట్యూమర్ కనిపించేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా 15 ఏళ్ల వయసు నుంచి ఈ సమస్య తొంగి చూస్తోంది. బ్రెయిన్ ట్యూమర్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో జన్యుపరమైనవి అంటే వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల, ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్ల వల్ల, సెల్‌ఫోన్ రేడియేషన్ వల్ల కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ఛాన్సులు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే బ్రెయిన్ ట్యూమర్ వచ్చాక కొన్ని రకాల లక్షణాలు బయటపడ్డాకే ఇది ఉందనే విషయం తేలేది. అయితే ఇప్పుడు జపాన్ శాస్త్రవేత్తలు ఒక కొత్త పరికరాన్ని తయారు చేశారు. దీనివల్ల బ్రెయిన్ ట్యూమర్ ఎలాంటి లక్షణాలు చూపించకపోయినా కేవలం మూత్ర పరీక్ష ద్వారా ఉందో లేదో తేల్చేయవచ్చు. దీనివల్ల అపార నష్టాన్ని అడ్డుకోవచ్చు. ముందే మందులు వాడడం, చికిత్స మొదలుపెట్టడం వల్ల వ్యక్తి ప్రాణానికి గానీ, జీవితానికి గానీ ఎలాంటి హాని కలగకుండా రక్షించవచ్చు.
బ్రెయిన్ ట్యూమర్లో నాలుగు దశలు ఉంటాయి. మొదటి దశలో ఉన్నప్పుడు తలనొప్పి, వాంతులు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదే రెండో దశకి చేరుకుంటే అవే లక్షణాలు తీవ్రంగా మారిపోతాయి. ఇక మూడో దశలో బ్రెయిన్ లో ఉన్నకణితి ఇతర ప్రధాన అవయవాలకు కూడా వ్యాపిస్తుంది. అంటే ఊపిరితిత్తులు వెన్నుపూస వంటి వాటికి సోకుతుంది. ఇక నాలుగో దశలో ట్యూమర్ లోని కణాలు రక్తంలో కలిసిపోయి, శరీరం అంతా వ్యాపిస్తాయి. మొదటి దశ మొదలవ్వకముందే బ్రెయిన్ ట్యూమర్ లక్షణాన్ని కనిపెట్టవచ్చని జపాన్ శాస్త్రవేత్తలు నిరూపించారు.
మెదడులో కణితి ఉన్న రోగికి మూత్రంలో మేమ్బ్రైన్ ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ గుర్తించే కొత్త పరికరాన్ని జపాన్ పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. టోక్యో విశ్వవిద్యాలయం సహకారంతో జపాన్ కు చెందిన నాగోయా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ల బృందం ఈ కొత్త పరికరాన్ని తయారు చేసింది. మెదడులో కణితితో బాధపడుతున్న రోగుల మూత్రంలో CD31, cd63 అని పిలిచే రెండు రకాల ఎక్స్ట్రా సెల్యులర్ వెసికల్ మెమరీ ప్రోటీన్లు ఉంటాయి. ఇలా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న వ్యక్తి మూత్రంలో ఎక్స్ట్రా సెల్యులర్ వెసికల్స్ ఉండడం ఆ బ్రెయిన్ ట్యూమర్ ఉందనడానికి ప్రధాన సంకేతం. అందుకే మూత్రంలో వీటి జాడ తెలియగానే ఆ రోగికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని నిర్ధారించవచ్చని చెబుతున్నారు పరిశోధకులు.
Also read: ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్ద గది - ఈ గదిలో మీ రక్త ప్రవాహపు శబ్దాన్ని కూడా వినవచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.