ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్ద గది - ఈ గదిలో మీ రక్త ప్రవాహపు శబ్దాన్ని కూడా వినవచ్చు
ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్ద గదిని మైక్రోసాఫ్ట్ ఏడేళ్ల క్రితమే నిర్మించింది.
నిశ్శబ్ద వాతావరణం ఎంతో హాయిగా ఉంటుంది. గజిబిజి వాతావరణంలో, ట్రాఫిక్ శబ్దాలతో విసిగిపోయిన వారికి నిశ్శబ్దం ఒక థెరపీ అనే చెప్పాలి. భరించలేనంత నిశ్శబ్దాన్ని మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నిశ్శబ్దాన్ని భరించలేకపోవడం ఏంటి అనుకోవచ్చు... అయితే మీరు ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్ద గది గురించి తెలుసుకోవాలి. ఈ గదిలో గంటకన్నా ఎక్కువ సమయం ఏ మనిషి ఉండలేడు.
మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం అమెరికాలోని వాషింగ్టన్లోని రెడ్‌మండ్ ప్రాంతంలో ఉంది. ఆ ప్రధాన కార్యాలయంలోనే అనెకోయిక్ ఛాంబర్ ని నిర్మించారు. ఇది ఒక గదిలా ఉంటుంది. అదే అత్యంత నిశ్శబ్దమైన గది. బయట నుంచి సూక్ష్మ శబ్దాలు కూడా ఆ గదిలోకి చొరబడవు.అంతేకాదు ఖాళీ గదిలో ఏ శబ్దం చేసిన ప్రతిధ్వని వినిపిస్తుంది కానీ, ఈ గదిలో ప్రతిధ్వని అనేది వినిపించదు. అందుకే ఈ గదికి అనే అనెకోయిక్ అని పేరు పెట్టారు. అంటే ‘ప్రతిధ్వని లేకుండా’ అని అర్థం. ఈ గది కట్టడానికే రెండేళ్ల సమయం పట్టింది.
గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఈ అత్యంత నిశ్శబ్దమైన గదిగా ఇది రికార్డులకు ఎక్కింది. గిన్నిస్ వరల్డ్ రికార్డులు వారు ఈ గదిలో రెండు అల్ట్రా సెన్సిటివ్ పరీక్షలు చేశారు. ఒక పరీక్షలో ఇక్కడున్న శబ్దం విలువ -20.6 డెసిబుల్స్‌గా వచ్చింది. మరొకసారి -20 పాయింట్ వన్ డెసిబిల్స్ గా వచ్చింది. ఇంతకన్నా నిశ్శబ్ద పరిస్థితి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు.
నిశ్శబ్ద గదిలో ఉంటే ఏం జరుగుతుంది?
ఒక మనిషి కొన్ని నిమిషాల పాటు ఈ గది లోపల ఉంటే అతడు తన హృదయ స్పందననే స్పష్టంగా వినడం ప్రారంభిస్తాడు. కొన్ని నిమిషాల తర్వాత తన శరీరంలో రక్తం ప్రవహిస్తున్న శబ్దాన్ని వినగలుగుతాడు. అలాగే శరీరంలో ఎముకలు చేసే శబ్దాన్ని కూడా వింటాడు. అలా ఒక గంట పాటు ఉండగలడు. అంతకన్నా ఆ గదిలో నివసించడం చాలా కష్టం. ఎందుకంటే బయటి ప్రపంచం నుండి ఎటువంటి శబ్దాలు రావు, కాబట్టి అక్కడున్న నిశ్శబ్దం మీ చెవులలో భరించలేని రింగింగ్ గా మారుతుంది. మీ శ్వాస కూడా చాలా దగ్గరగా వినిపిస్తుంది. చెవిలో రింగింగ్ ఎక్కువైపోతుంది. ప్రతిధ్వని లేకపోవడం వల్ల శరీరం సమతుల్యతను కోల్పోతుంది. దీనివల్ల అక్కడ ఉండలేరు ఎంత త్వరగా బయటికి వచ్చేస్తామా అని ఫీల్ అవుతారు.
దీన్ని ఎలా తయారు చేశారు?
ఈ అనెకోయిక్ ఛాంబర్‌ను ఆరు పొరల గోడలతో నిర్మించారు. ఆ ఆరు పొరల గోడలను కాంక్రీటు, ఇనుము ఉపయోగించి నిర్మించారు. పక్కనున్న గదుల నుండి ఈ గదిని పూర్తిగా డిస్‌కనెక్ట్ చేశారు. గదిలోని నేల క్రింద వైబ్రేషన్ డంపింగ్ స్ప్రింగులను అమర్చారు. గది గోడలకు, పైకప్పుకు, నేలకు ఫైబర్ గ్లాస్ వెడ్జ్‌లు అమర్చారు. దీనివల్ల గది వరకు చేరే ధ్వని తరంగాలు, గది లోపలికి ప్రవేశించకుండా గోడల వద్దే విచ్ఛిన్నం అయిపోతాయి. దీనివల్ల బయట ప్రపంచానికి సంబంధించిన ఏ శబ్దం కూడా గది లోపలకి ప్రవేశించలేదు. అందుకే ఈ గది ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్ద గదిగా మారింది.
Also read: రెడ్ వైన్ తాగడం వల్ల ఈ ప్రయోజనాలు ఉన్నాయని సైన్స్ కూడా ఒప్పుకుంది